అక్షరటుడే, నిజామాబాద్ సిటీ : Gram Ward Sabha Review | ప్రజాపాలన- ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా ఈ నెల 4, 6, 8, 10వ తేదీలలో పంచాయతీల్లో గ్రామసభలు, మున్సిపాలిటీల్లో వార్డు సభలు నిర్వహించాల్సి ఉంది. వీటిపై కలెక్టరేట్లో (Nizamabad) బుధవారం అదనపు కలెక్టర్లు కిరణ్‌కుమార్, భజంగరావు అధికారులతో సమీక్ష నిర్వహించారు.
మండల ప్రత్యేక అధికారులు, మున్సిపల్ కమిషనర్లు, ఎంపీడీఓలు, తహశీల్దార్లు, ఎంపీవోలు, వివిధ శాఖల అధికారులకు సభల నిర్వహణకు సంబంధించి పాటించాల్సిన విధి, విధానాలు, ప్రస్తావించాల్సిన అంశాలు వివరించారు. గ్రామ, వార్డు సభలను సమర్ధవంతంగా నిర్వహిస్తూ, పూర్తి స్థాయిలో విజయవంతం అయ్యేలా ప్రణాళికాబద్దంగా కృషి చేయాలన్నారు. సభ నిర్వహణకు ఒకరోజు ముందే ఆయా గ్రామాల్లోని ప్రజలకు సమాచారం అందించాలని సూచించారు.
Gram Ward Sabha Review | ఎస్ఐఆర్పై..
పారదర్శకమైన ఓటరు జాబితా రూపకల్పన కోసం కేంద్ర ఎన్నికల సంఘం చేపడుతున్న ప్రత్యేక ఓటరు సమగ్ర సవరణ (SIR) ప్రక్రియ గురించి సభలలో ప్రజలకు అవగాహన కల్పించాలని అదనపు కలెక్టర్లు కోరారు. ఎస్ఐఆర్ అమలులో బూత్ లెవెల్ ఏజెంట్ల పాత్ర క్రియాశీలకం అన్నారు.
Gram Ward Sabha Review | తక్కువ వర్షాలు
ఖరీఫ్ సీజన్‌లో రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఎరువులు, విత్తనాలు అందించేందుకు ప్రణాళిక రూపొందించాలని సూచించారు. ఈసారి ఎల్‌నినో (El nino) ప్రభావంతో వర్షాలు తక్కువగా కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికలు చేసిన నేపథ్యంలో పంటల మార్పిడి ఆవశ్యకత గురించి రైతులకు అవగాహన కల్పించాలని ఆదేశించారు. పరిసరాల పరిశుభ్రత, తడి,పొడి చెత్త నిర్వహణ, ప్లాస్టిక్ వినియోగం నియంత్రణపై ప్రజల్లో అవగాహనను పెంపొందించాలని, వాల్టా, వన్యప్రాణి సంరక్షణ చట్టాల గురించి తెలియజేయాలని సూచించారు.

Gram Ward Sabha Review | ఫిర్యాదులు పరిష్కరించాలి
రక్షిత మంచినీటి సరఫరా, వీధి దీపాల నిర్వహణ, సానిటేషన్ విషయంలో ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులను తక్షణమే పరిష్కరించాలని ఆదేశించారు. ఈ సమావేశంలో అదనపు డీసీపీ శుభం నగ్రాలే, డీఆర్వో గీత, డీఎఫ్‌వో సిద్దార్థ్ విక్రమ్ సింగ్, డీఆర్డీవో సాయన్న, జెడ్పీ సీఈవో సాయాగౌడ్, నిజామాబాద్ నగర పాలక సంస్థ కమిషనర్ దిలీప్ కుమార్, నిజామాబాద్, బోధన్ ఆర్డీఓలు రాజేంద్రకుమార్, విజయలక్ష్మి పాల్గొన్నారు.
దీనిని కూడా చదవండి : BRS Membership Drive | ముందు మీ రాజధాని సంగతి చూసుకో.. పవన్‌కు వేముల కౌంటర్
