Heavy Rain | అర్ధరాత్రి దంచికొట్టిన వాన.. రైతులకు తీవ్ర నష్టం

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Heavy Rain | అకాల వర్షాలు అన్నదాతలను ఆగం చేస్తున్నాయి. ఆరుగాలం కష్టపడి పండించిన పంట అమ్ముకునే సమయంలో వానలు పడి రైతులు (Farmers) తీవ్ర నష్టపోతున్నారు. కొనుగోళ్లు సజావుగా సాగకపోవడంతో తడిసి ముద్దవుతోంది.

రాష్ట్రంలోని పలు జిల్లాల్లో మంగళవారం రాత్రి భారీ వర్షం కురిసింది. మహబూబ్‌నగర్‌ జిల్లా కొత్తమొల్గరలో 11 సెంటీ మీటర్ల వర్షపాతం, పర్పల్లిలో 10, భూత్పూర్‌లో 10, నాగర్‌కర్నూల్‌ జిల్లా తిమ్మాజీపేటలో 8.8, వనపర్తి జిల్లా అమరచింతలో 8.6, మహబూబ్‌నగర్‌ టౌన్‌లో 7.5.. సిద్దిపేట జిల్లా అంగడ కిష్టాపూర్‌లో 6.5, నల్గొండ జిల్లా డిండిలో 6.2, సంగారెడ్డి జిల్లా హత్నూరలో 6, నిజామాబాద్‌ ధర్పల్లిలో 5.4, వికారాబాద్‌ జిల్లా దౌల్తాబాద్‌లో 5, కామారెడ్డి జిల్లా దోమకొండలో 5, సదాశివనగర్‌లో 5 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు అయింది. హైదరాబాద్​ నగరంలో సైతం భారీ వాన పడింది.

Heavy Rain | ఈ జిల్లాల్లో వర్ష బీభత్సం

ప్రధానంగా సిద్దిపేట, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి (Kamareddy), మహబూబ్‌నగర్, వనపర్తి, నాగర్‌కర్నూల్, గద్వాల్, నారాయణపేట, నిజామాబాద్, వికారాబాద్ జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో రాత్రిపూట భారీ వర్షాలు కురిశాయి. హైదరాబాద్‌లో కూడా రాత్రంతా విస్తారంగా వర్షాలు కురిశాయి. నగరంలోని మల్కాజ్​గిరిలో 21.3మి.మీ వర్షపాతం నమోదు అయింది. బుధవారం ఉదయం నుంచి వాతావరణం మేఘావృతమై ఉంది. ఉక్కపోత నుంచి ప్రజలకు ఉపశమనం లభించింది.

Heavy Rain | తడిసిన ధాన్యం

అర్ధరాత్రి వర్షం పడటంతో ధాన్యం తడిసి పోయింది. ముఖ్యంగా చాలా ప్రాంతాల్లో వడ్లను కాంటా చేసి సంచుల్లో నింపి ఉంచారు. లారీలు రావడం లేదని కేంద్రాల్లో రోజుల తరబడి ఉంచుతున్నారు. రాత్రి వర్షానికి సంచుల్లో ఉంచిన ధాన్యం తడిసిపోయింది. దీంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఆ వడ్లు మొలకెత్తే అవకాశం ఉండటంతో ఆరబెట్టడానికి అవస్థలు పడుతున్నారు. ప్రభుత్వం స్పందించి కాంటా వేసిన ధాన్యాన్ని మిల్లులకు తరలించాలని కోరుతున్నారు.

ఇది కూడా చదవండి..: Maoist Narahari Surrender | 45 ఏళ్ల మావోయిస్టు జీవితానికి ముగింపు.. డీజీపీ సీవీ ఆనంద్ ఎదుట లొంగిపోయిన నరహరి దంపతులు!

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *