Hostel Students | హాస్టల్ విద్యార్థి ఆత్మహత్యాయత్నం.. కలకలం రేపుతున్న వరుస ఘటనలు

సదాశివనగర్​లోని బీసీ బాలుర వసతి గృహంలో ఓ విద్యార్థి ఆత్మహత్యాయత్నం చేశాడు.

shashi kiran Mottala

అక్షరటుడే, కామారెడ్డి: Hostel Students | ప్రభుత్వ వసతి గృహాల్లో ఉంటున్న విద్యార్థుల ఆత్మహత్యాయత్నం ఘటనలు తరచూ వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. బాన్సువాడలో(Banswada) ఓ విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్న ఘటన మర్చిపోకముందే మరో ఘటన వెలుగులోకి రావడం కలకలం రేపుతోంది.

Hostel Students | సదాశివనగర్​లో..

సదాశివనగర్(Sadashiv nagar) మండల కేంద్రంలోని బీసీ బాలుర వసతి గృహంలో (BC Hostel) పదో తరగతి చదువుతున్న విద్యార్థి గురువారం రాత్రి పుస్తకాలు, ఇతర వస్తువులకు ఉపయోగించే రబ్బర్ బ్యాండ్లతో మెడకు బలంగా చుట్టుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. వెంటనే అప్రమత్తమైన హాస్టల్ వార్డెన్ విద్యార్థి ఆత్మహత్యాయత్నాన్ని అడ్డుకుని వెంటనే కామారెడ్డి జీజీహెచ్​కు తరలించారు. విషయాన్ని ఉన్నతాధికారులకు, విద్యార్థి తల్లిదండ్రులకు చేరవేశారు. మొదట్లోనే ఆత్మహత్యాయత్నాన్ని అడ్డుకోవడంతో పెను ప్రమాదం తప్పింది. రబ్బర్ బ్యాండ్లతో గట్టిగా బిగుసుకుని ఊపిరాడకుంటే దారుణం జరిగి ఉండేది. వార్డెన్ అప్రమత్తతతో ప్రమాదం తప్పడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. గాంధారి మండలం బ్రాహ్మణపల్లి గ్రామానికి చెందిన విద్యార్థి మేనత్త ఇటీవల మృతి చెందడంతో మొన్నటి వరకు అక్కడే ఉన్నాడు. రెండు రోజుల క్రితమే తండ్రి ఆ విద్యార్థిని హాస్టల్​లో విడిచిపెట్టి బాగా చదువుకోవాలని చెప్పి ఇంటికి వెళ్ళిపోయాడు. రాత్రి హాస్టల్ వార్డెన్ నుంచి ఫోన్ రాగానే వెంటనే ఆస్పత్రికి చేరుకున్నారు. విషయం తెలుసుకున్న విద్యార్థి సంఘాల నాయకులు ఆస్పత్రికి చేరుకుని వివరాలు సేకరించారు.

Hostel Students | ఒంటరిగా ఉంటూ..

విద్యార్థికి హాస్టల్​లో ఒంటరిగా ఫీలవుతూ, వసతిగృహంలో ఉండటం ఇష్టం లేకనే ఇలాంటి ఘటనకు పాల్పడినట్టు విద్యార్థి, అతని తల్లిదండ్రులు తెలిపారు. ప్రస్తుతం విద్యార్థికి ఆస్పత్రిలో చికిత్స కొనసాగుతోంది. అయితే జిల్లాలో వరుస ఘటనలు మాత్రం కలకలం రేపుతున్నాయి. పాఠశాలలు ప్రారంభమై నెల రోజులు కూడా కాకముందే వరుస ఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయి. వేసవి సెలవుల్లో ఇళ్ల వద్ద హుషారుగా ఉన్న విద్యార్థులు హాస్టళ్లకు రాగానే ఒత్తిడిగి గురవుతున్నారు.

హాస్టల్​లో ఉండటం ఇష్టం లేని విద్యార్థులు తల్లిదండ్రులకు చెప్పినా వినిపించుకోకపోవడం వల్ల, తమను ఇక్కడే ఉంచేస్తారేమోనన్న ఆలోచనతో క్షణికావేశానికి గురై ఆత్మహత్య బాట పడుతున్నారు. ఈ క్రమంలో హాస్టల్​లో ఇలా ఒంటరిగా ఫీలవుతూ హోమ్ సిక్​తో బాధపడుతున్న విద్యార్థులను గుర్తించి వారికి సరైన కౌన్సెలింగ్ ఇవ్వాల్సిన అవసరం ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు.

sadashiv nagar 1

ఇది కూడా చదవండి: విశాఖలో రక్షణమంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ పర్యటన 

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *