Jajala House Arrest | కామారెడ్డిలో ఉద్రిక్తత.. జాజాల హౌస్ అరెస్టుపై బీఆర్ఎస్ శ్రేణుల ఆగ్రహం

కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలను కొనసాగించాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ చేపట్టిన ధర్నా కామారెడ్డిలో ఉద్రిక్తతకు దారి తీసింది.

shashi kiran Mottala

అక్షరటుడే, కామారెడ్డి: Jajala House Arrest | కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలను కొనసాగించాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ చేపట్టిన ధర్నా కామారెడ్డి (Kamareddy)లో ఉద్రిక్తతకు దారి తీసింది. లింగంపేటలో ధర్నాకు వెళ్తున్న ఎల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యే జాజాల సురేందర్​ను పోలీసులు కామారెడ్డిలో హౌస్ అరెస్ట్ చేశారు.

Jajala House Arrest | భారీ బందోబస్తు

జాజాల ఇంటినుంచి బయటకు కదలకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. దాంతో నియోజకవర్గంలోని ఇతర మండలాల నుంచి నాయకులు పెద్దఎత్తున జాజాల ఇంటికి చేరుకుని సంఘీభావం ప్రకటించారు. కామారెడ్డి పట్టణంలో ధర్నా ముగించుకుని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు ముజీబోద్దీన్ ఆధ్వర్యంలో నేతలు జాజాల ఇంటికి చేరుకుని జాజాల సురేందర్​ను ఇంటినుంచి బయటకు తీసుకురావడంతో పోలీసులు ఒక్కసారిగా షాక్​కు గురయ్యారు. అనుకోని ఘటనతో అప్రమత్తమైన పోలీసులు బీఆర్ఎస్ నాయకులను అడ్డుకునేందుకు శతవిధాలా ప్రయత్నించారు. పోలీసులను తోసుకుంటూ బీఆర్ఎస్ నేతలు ముందుకు సాగారు. ఈ క్రమంలో పోలీసులు, బీఆర్ఎస్ నాయకులకు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది.

Jajala House Arrest | జాతీయ రహదారిపై..

బీఆర్​ఎస్​ నాయకులు పాత జాతీయ రహదరిపైకి చేరుకుని ఇంటర్నేషనల్ హోటల్ ముందు రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. ప్రభుత్వానికి, సీఎంకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. జాజాల మాట్లాడుతూ.. తమ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మేనిఫెస్టోలో లేకున్నా షాదీ ముబారక్, కల్యాణ లక్ష్మి పథకాల ద్వారా పేదింటి ఆడబిడ్డలకు సాయం చేశామని గుర్తు చేశారు. అలాంటి పథకాన్ని ఈ ప్రభుత్వం అమలు చేయడం ఇష్టం లేక వాళ్ళ మనుషులే కోర్టులో కేసు వేశారని ఆరోపించారు. దానికి ప్రభుత్వం కౌంటర్ ఇవ్వకపోవడంతోనే కోర్టు 6 వారాల పాటు నిలిపివేసిందన్నారు. ప్రభుత్వం చేతకాని తనం వల్లే పథకం ఆగిపోయే పరిస్థితి వచ్చిందని పేర్కొన్నారు. వెంటనే కోర్టులో కౌంటర్ వేసి పథకాన్ని కొనసాగించేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా ధర్నా చేస్తుంటే కేవలం ఎల్లారెడ్డి నియోజకవర్గంలో కార్యకర్తలు, నాయకులను అడ్డుకోవాలని సీఎం చెప్పారా..? ఎమ్మెల్యే చెప్పారా అని ప్రశ్నించారు. ఉద్యమాల గడ్డ ఎల్లారెడ్డి అని, ఉద్యమాలు చేసిన చరిత్ర తమదని, ఎంతమంది పోలీసులను అడ్డుకున్నా భయపడేది లేదని స్పష్టం చేశారు.

ఇది కూడా చదవండి..: Nagula Panchami Celebrations | భక్తిశ్రద్ధలతో నాగులపంచమి..

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.