Konda Surekha | కొండా సురేఖను బర్తరఫ్​ చేయాలి.. కాంగ్రెస్​ ఎమ్మెల్యేల డిమాండ్​

కాంగ్రెస్​ పార్టీలో కొండా కుటుంబానికి వ్యతిరేకంగా పలువురు ఎమ్మెల్యేలు ఏకం అయ్యారు.

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్: Konda Surekha | కాంగ్రెస్​ పార్టీలో కొండా కుటుంబానికి వ్యతిరేకంగా పలువురు ఎమ్మెల్యేలు ఏకం అయ్యారు. ఆమెను వెంటనే మంత్రి పదవి నుంచి తొలగించాలని డిమాండ్​ చేశారు.

ఆమె కూతురు కొండా సుష్మిత చేసిన వ్యాఖ్యలు.. సురేఖ పదవికి ఎసరు తెచ్చాయి. ఈ వ్యాఖ్యలపై ఇప్పటికే సీఎం రేవంత్​ రెడ్డి, పార్టీ అధిష్టానం సీరియస్​ అయినట్లు సమాచారం. ఉమ్మడి వరంగల్​ జిల్లాలోని కాంగ్రెస్​ ఎమ్మెల్యేలు సైతం సురేఖకు వ్యతిరేకంగా అధిష్టానానికి లేఖ రాశారు. తాజాగా సీఎల్పీ సమావేశంలో సైతం ఆమెను తొలగించాలని తీర్మానం చేయడం గమనార్హం.

సీఎం రేవంత్​రెడ్డి (CM Revanth Reddy)పై కొండా సుష్మిత వ్యాఖ్యల నేపథ్యంలో శుక్రవారం పలువురు ఎమ్మెల్యేలు సీఎల్పీ ఆఫీసులో సమావేశం అయ్యారు. ఇందులో కీలక నిర్ణయం తీసుకున్నారు. కొండా సురేఖ రాజీనామా చేయాలని డిమాండ్‌ చేశారు. సురేఖను మంత్రి పదవి నుంచి బర్తరఫ్‌ చేయాలన్నారు. ఆమె తీరుతో పార్టీ నష్టం జరుగుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. సమావేశం అనంతరం ఎమ్మెల్యేలు మీడియాతో మాట్లాడారు. ఒరిజినల్​ కాంగ్రెస్​ అని మాట్లాడుతున్న కొండా కుటుంబం ఎన్ని పార్టీలు తిరిగి వచ్చిందో అందరికీ తెలుసని విమర్శించారు. రాజగోపాల్​రెడ్డి, చిన్నారెడ్డి వ్యవహారం సైతం సరికాదని ఎమ్మెల్యేలు అన్నారు.

Konda Surekha | పదవులు అనుభవిస్తూ..

ఎమ్మెల్యే వీరేశం మాట్లాడుతూ.. ఆది నుంచి కొండా సురేఖ తీరు పార్టీకి నష్టం కలిగించే విధంగా ఉందన్నారు. కేటీఆర్, సమంత అంశంలో కొండా సురేఖ మాట్లాడింది తప్పన్నారు. సురేఖ భాష, తప్పుల వల్ల రేవంత్ రెడ్డి బద్నాం అవుతుంటే, ఆమె పదవులు ఎంజాయ్ చేస్తున్నారని విమర్శించారు. రేవంత్ రెడ్డి నిర్ణయాలను వ్యతిరేకిస్తున్న వాళ్లకి పార్టీలో ఉండే అర్హత లేదని స్పష్టం చేశారు. సురేఖకు నోటీసులు ఇస్తే.. తన బిడ్డ మాటలకు సంబంధం లేదని చెబుతున్నారని, మరి ఆమె మాటలను ఎందుకు ఖండించలేదని ఆయన ప్రశ్నించారు.

Konda Surekha | రాజీనామా చేయాలి

ప్రభుత్వ విప్​ బీర్ల ఐలయ్య, ఎమ్మెల్యే బొడ్మ వెజ్జు మాట్లాడుతూ.. సురేఖ పార్టీకి రాజీనామా చేసి వెళ్లిపోవాలన్నారు. కూతురు మాటలపై ఆమె
స్పందించాల్సిందే అన్నారు. వేలాది మంది కార్యకర్తలు కష్టపడి పార్టీని అధికారంలోకి తెచ్చారని చెప్పారు. సీఎం రేవంత్ రెడ్డిపై ప్రతిపక్ష నేతలు మాట్లాడితే అర్థం చేసుకోవచ్చు, కానీ సొంత పార్టీ నేతలే మాట్లాడటం సరికాదన్నారు. ఏదైనా ఉంటే పీసీసీకి కానీ, సీఎంకి కానీ చెప్పుకోవాలని.. ఇలా మాట్లాడటం సరికాదన్నారు. కొండా కుటుంబం కాంగ్రెస్​లో ఉంటూ పార్టీని ఖతం చేసేలా వ్యవహరిస్తోందని మండి పడ్డారు. కులం అడ్డు పెట్టుకొని ఏం చేసినా నడుస్తుంది అనుకుంటే చెల్లదన్నారు.

ఇది కూడా చదవండి..: Dead Body in Car | కారు డిక్కీలో మహిళ మృతదేహం కలకలం

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
1 Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *