అక్షరటుడే, వెబ్‌డెస్క్: Jio IPO Announcement | భారత టెలికాం, డిజిటల్ రంగాల్లో విప్లవాత్మక మార్పులకు నాంది పలికిన రిలయన్స్ జియో.. స్టాక్ మార్కెట్‌లో సంచలనం సృష్టించే దిశగా అడుగులు వేస్తోంది. జియో పబ్లిక్ ఇష్యూకు రంగం సిద్ధమైంది. శుక్రవారమే సెబీకి పత్రాలను సమర్పించనున్నారు. ఈ విషయాన్ని రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ ప్రకటించారు.
Jio IPO Announcement | ఏజీఎంలో కీలక ప్రకటన..
రిలయన్స్ ఇండస్ట్రీస్ (Reliance Industries) వార్షిక సాధారణ సమావేశం(ఏజీఎం) శుక్రవారం జరిగింది. ఇందులో రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ వాటాదారులను ఉద్దేశించి ప్రసంగించారు. కీలకమైన జియో ఐపీవోపై అప్‌డేట్ ఇచ్చారు. జియో ఐపీవో (Jio IPO)కు సంబంధించిన డ్రాఫ్ట్ పేపర్లను బోర్డు ఆమోదించిందని తెలిపారు. వాటిని ఈ రోజే సెబీకి సమర్పిస్తామన్నారు. ఈ కంపెనీ తమ వాటాదారులకు గణనీయమైన విలువను అందించడంతో పాటు కొత్త పెట్టుబడిదారులకు ఆకర్షణీయమైన పెట్టుబడి అవకాశాలను కల్పిస్తుందని విశ్వసిస్తున్నానన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. ప్రపంచ స్థాయి సామర్థ్యం కలిగిన సాంకేతిక సంస్థలను భారత్ నిర్మించగలదని జియో లిస్టింగ్ ప్రపంచానికి నిరూపిస్తుందని భావోద్వేగపూరితంగా పేర్కొన్నారు.
Jio IPO Announcement | తండ్రిని గుర్తు చేసుకున్న ముకేశ్..
ఏజీఎం సందర్భంగా ముకేశ్ అంబానీ (Mukesh Ambani) తన తండ్రి ధీరూబాయ్ అంబానీ వారసత్వాన్ని గుర్తు చేసుకున్నారు. తన తండ్రి కలలుగన్న ‘అందరి అభివృద్ధి’ అనే లక్ష్యాన్ని తాను ముందుకు తీసుకువచ్చానన్నారు. ఇప్పుడు అదే బాధ్యతను తదుపరితరం స్వీకరిస్తోందని.. తన పిల్లలు ఆకాష్, ఇషా, అనంత్ అంబానీలు జియో ఐపీవో ప్రక్రియకు నాయకత్వం వహిస్తున్నారని పేర్కొన్నారు. భవిష్యత్తులో విలువ సృష్టించే కొత్త అవకాశాలను కూడా వారే ముందుండి నడిపిస్తారన్న విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. జియో ఐపీవో అనేది ఒక వ్యాపార నిర్ణయం మాత్రమే కాదని.. ఇది తనకు, రిలయన్స్ కుటుంబానికి, లక్షలాది వాటాదారులకు ఎంతో భావోద్వేగపరమైన క్షణమని ముకేశ్ అంబానీ పేర్కొన్నారు.
Jio IPO Announcement | అతిపెద్ద డిజిటల్ ప్లాట్‌ఫాం..

పదేళ్ల క్రితం ప్రారంభమై టెలికాం రంగంలో సంచలనం సృష్టించిన జియో.. దేశంలోనే అతిపెద్ద డిజిటల్ ప్లాట్‌ఫామ్‌గా ఎదిగింది. 52.4 కోట్లకు పైగా వినియోగదారులను కలిగి ఉన్న ఈ సంస్థ.. భారత టెలికాం రంగంలో అగ్రస్థానంలో ఉంది. 26.8 కోట్ల మంది వినియోగదారులు జియో 5జీ సేవలు పొందుతున్నారు. జియో ఎయిర్‌ఫైబర్ ద్వారా 1.3 కోట్ల ఇళ్లకు కనెక్టివిటీ అందుతోంది.
Jio IPO Announcement | రూ. 40 వేల కోట్ల సమీకరణ లక్ష్యం!
జియో ఐపీవో ద్వారా రూ. 40 వేల కోట్ల నిధులను సమీకరించాలన్న లక్ష్యంతో రిలయన్స్ ఉంది. రూ.10 రూపాయల ముఖ విలువ కలిగిన 27 కోట్ల ఈక్విటీ షేర్లను ఫ్రెష్ ఇష్యూ ద్వారా విక్రయించనుంది. ఇది దేశంలోనే అతిపెద్ద ఐపీవోగా నిలిచే అవకాశాలున్నాయి. ఇప్పటివరకు భారతదేశంలో అతిపెద్ద ఐపీవోగా హ్యుందాయ్ మోటార్ ఇండియా నిలిచింది. 2024 అక్టోబర్‌లో లిస్టయిన ఆ సంస్థ.. మార్కెట్‌నుంచి రూ.27 వేల కోట్లకుపైగా సమీకరించింది.
ఇది కూడా చదవండి..: Stock Market Losses | ఐదు రోజుల లాభాలకు తెర.. భారీ నష్టాలతో ముగిసిన మార్కెట్లు