Telangana Land Resurvey | భూ సమస్యల పరిష్కారానికి .. భూముల రీ సర్వే : మంత్రి పొంగులేటి

భూ స‌మ‌స్య‌లు, భూ వివాదాలు లేని తెలంగాణ‌ను నిర్మించాల‌నే ల‌క్ష్యంతో రాష్ట్రవ్యాప్తంగా భూ సర్వే నిర్వహించాలని నిర్ణయించినట్లు మంత్రి పొంగులేటి తెలిపారు.

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Telangana Land Resurvey | భూ స‌మ‌స్య‌లు, భూ వివాదాలు లేని తెలంగాణ‌ను నిర్మించాల‌నే ల‌క్ష్యంతో రాష్ట్రవ్యాప్తంగా భూ సర్వే నిర్వహించాలని నిర్ణయించినట్లు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి (Ponguleti) తెలిపారు. భూముల రీస‌ర్వే కార్య‌క్ర‌మాన్ని వ‌చ్చే నెల నుంచి ద‌శ‌ల వారీగా ప్రారంభిస్తామన్నారు.

మంత్రి పొంగులేటి శుక్రవారం రెవెన్యూ అధికారుల‌తో టెలి కాన్ఫరెన్స్​ నిర్వహించారు. రాష్ట్రంలో మొత్తం 10,954 రెవెన్యూ గ్రామాలుండ‌గా తొలి ద‌శ‌లో  వచ్చే నెల నుంచి హైద‌రాబాద్ మిన‌హా మిగిలిన 32 జిల్లాల నుంచి 70 గ్రామాల చొప్పున మొత్తం 2,240 గ్రామాల‌ను ఎంపిక చేసి రీస‌ర్వే చేప‌ట్ట‌నున్న‌ట్లు తెలిపారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు.

Telangana Land Resurvey | రైతులకు భరోసా కల్పిస్తాం

భూమి రైతుకు ఆస్తి మాత్రమే కాద‌ని.. జీవనాధారమ‌ని ప్రతి అంగుళం భూమికి స్పష్టమైన హద్దులు, ప్రతి సర్వే నంబర్‌కు భూదార్ (Bhudhar), ప్రతి రైతుకు భరోసా కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమ‌ని మంత్రి తెలిపారు. భూ వివాదాలు లేని రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు ఈ రీ-సర్వే కార్యక్రమం చారిత్రాత్మక మైలురాయిగా నిలుస్తుంద‌ని మంత్రి పొంగులేటి పేర్కొన్నారు.

Telangana Land Resurvey | నిజాం కాలం సర్వే రికార్డులు

రాష్ట్రంలో ఇప్పటికీ అనేక ప్రాంతాల్లో 1936 నాటి నిజాం (Nizam) కాలం సర్వే రికార్డులే ప్రధాన ఆధారంగా ఉన్నాయని పొంగులేటి పేర్కొన్నారు. ప్రస్తుతం భూముల విభజనలు, ఉపసంఖ్యలు పెరగడం, పట్టణీకరణ విస్తరించడం, పరిపాలనా సరిహద్దులు మారడం వల్ల అనేక ప్రాంతాల్లో భూముల అసలు హద్దులపై స్పష్టత లేకుండా పోయిందని చెప్పారు. ఈ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపేందుకే సమగ్ర రీ-సర్వే చేపడుతామన్నారు. నిజాం కాలం నుంచి నక్షాలు లేని 378 గ్రామాలను గుర్తించామని, వాటిలో ఇప్పటికే 5 గ్రామాల్లో రీ-సర్వే పూర్తి చేసి భూదార్ నంబర్లు కేటాయించినట్లు మంత్రి తెలిపారు.

Telangana Land Resurvey | ప్రత్యేక మ్యాప్​లు

భూముల రీ-సర్వే పూర్తయిన తర్వాత ప్రతి కమతానికి ఖచ్చితమైన సరిహద్దులు, ప్రత్యేక మ్యాప్​లు సిద్ధమవుతాయని మంత్రి తెలిపారు. దీంతో భూ యాజమాన్యంపై ఎలాంటి వివాదాలకు తావు ఉండదన్నారు. భూ భారతి చట్టం ద్వారా సాగు భూముల రిజిస్ట్రేషన్లకు సర్వే పటం తప్పనిసరి చేసిన నేపథ్యంలో రీ-సర్వే ద్వారా భూముల రిజిస్ట్రేషన్, మ్యుటేషన్ ప్రక్రియలు మరింత పారదర్శకంగా, వేగవంతంగా జరుగుతాయని పేర్కొన్నారు.

దీనిని కూడా చదవండి : Jio IPO Announcement | ఐపీవోకు రిలయన్స్ జియో.. ముకేశ్ అంబానీ కీలక ప్రకటన

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *