అక్షరటుడే, బాన్సువాడ: Journalist Training | సమాజంలో జర్నలిస్టు వృత్తి ఎంతో బాధ్యతతో కూడుకున్నదని ప్రభుత్వ సలహాదారు, బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి (MLA Pocharam Srinivas reddy) అన్నారు. ప్రజలకు వాస్తవాలను తెలియజేస్తూ, ప్రభుత్వానికి ప్రజల సమస్యలను చేరవేయడంలో జర్నలిస్టుల పాత్ర కీలకమని ఆయన పేర్కొన్నారు.
Journalist Training | శిక్షణ తరగతులు
బాన్సువాడ (Banswada) ఎస్ఆర్ఎన్కే ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో మంగళవారం తెలంగాణ (Telangana) రాష్ట్ర మీడియా అకాడమీ, టీయూడబ్ల్యూజే–ఐజేయూ సంయుక్త ఆధ్వర్యంలో జర్నలిస్టుల రెండు రోజుల శిక్షణ తరగతులు ప్రారంభమయ్యాయి. ఈ తరగతులను తెలంగాణ రాష్ట్ర మీడియా అకాడమీ ఛైర్మన్ శ్రీనివాసరెడ్డితో కలిసి పోచారం శ్రీనివాస్ రెడ్డి ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ.. జర్నలిస్టులు తమ వృత్తి ధర్మాన్ని నిబద్ధతతో నిర్వహిస్తున్నారని అన్నారు. విలేఖరి బాధ్యత ఎంతో విలువైనదని, ఎలాంటి ఆశలు, ప్రతిఫలాపేక్ష లేకుండా ప్రజలకు సమాచారాన్ని అందించేందుకు జర్నలిస్టులు నిరంతరం కృషి చేస్తున్నారని ప్రశంసించారు.
Journalist Training | ఒక వార్త సమాజంపై చూపే ప్రభావం..
ఒక వార్త సమాజంపై ప్రభావం చూపే అవకాశం ఉన్నందున వార్తలను ప్రచురించే ముందు వాస్తవాలను నిర్ధారించుకోవడం, బాధ్యతాయుతంగా వ్యవహరించడం ఎంతో ముఖ్యమని ఎమ్మెల్యే సూచించారు. ప్రస్తుతం సాంకేతిక పరిజ్ఞానం విస్తృతంగా అందుబాటులోకి రావడంతో మీడియా రంగంలో కూడా అనేక మార్పులు చోటుచేసుకున్నాయని అన్నారు. ముఖ్యంగా డిజిటల్ మీడియా, సోషల్ మీడియా కారణంగా సంఘటనలు జరిగిన వెంటనే ప్రజలకు సమాచారం చేరుతోందని తెలిపారు. జర్నలిస్టులు ఆధునిక సాంకేతికతను అందిపుచ్చుకోవడంతో పాటు, మారుతున్న మీడియా రంగానికి అనుగుణంగా తమ నైపుణ్యాలను పెంపొందించుకోవాలని సూచించారు. శిక్షణ తరగతులను సద్వినియోగం చేసుకుని వృత్తిపరమైన పరిజ్ఞానాన్ని మరింత పెంచుకోవాలని కోరారు. ఎనిమిదేళ్ల క్రితం ఎక్కడా లేని విధంగా బాన్సువాడలో 60 మంది రిపోర్టర్లకు ఇళ్ల స్థలాలతో పాటు డబుల్ బెడ్ రూమ్ ఇల్లు మంజూరు చేశానన్నారు.
Journalist Training | జర్నలిస్టుల వృతి నైపుణ్యాలను..
మీడియా అకాడమీ ఛైర్మన్ శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ.. జర్నలిస్టుల వృత్తి నైపుణ్యాలను పెంపొందించేందుకు శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఆధునిక జర్నలిజంలో డిజిటల్ మీడియా, సాంకేతిక పరిజ్ఞానం, వార్తల విశ్లేషణ, వాస్తవ నిర్ధారణ వంటి అంశాలపై శిక్షణ అవసరమన్నారు. అగ్రోస్ కార్పొరేషన్ మాజీ ఛైర్మన్ కాసుల బాలరాజ్, ఆర్డీవో రవీందర్ రెడ్డి, టీయూడబ్ల్యూజే–ఐజేయూ జిల్లా అధ్యక్షుడు రజినీకాంత్, ప్రిన్సిపాల్ గంగాధర్ పాల్గొన్నారు.
ఇది కూడా చదవండి: ములుగు గట్టమ్మ ఆలయానికి The Paradise టీమ్..