అక్షరటుడే, కామారెడ్డి: Kamareddy Flood Fear | గతేడాది ఆగస్టులో కామారెడ్డిని (Kamareddy) ముంచెత్తిన వరదల జ్ఞాపకాలు ప్రజలను మళ్లీ వెంటాడుతున్నాయి. ఆకాశంలో మబ్బులు కమ్మగానే జీఆర్ కాలనీ, కౌండిన్య కాలనీ వాసుల గుండెల్లో దడ మొదలవుతోంది. పెద్ద చెరువు నీటిమట్టం పెరుగుతుండటంతో మరోసారి వరద వస్తుందేమోనన్న ఆందోళన కాలనీవాసుల్లో కనిపిస్తోంది.
Kamareddy Flood Fear | భయం గుప్పిట్లో..
గతేడాది వినాయక చవితి(Vinayaka chavithi) రోజు కురిసిన అకస్మాత్తు భారీ వర్షాలకు కామారెడ్డి పట్టణం అతలాకుతలమైంది. గంటల పాటు కురిసిన వర్షానికి పట్టణం చుట్టూ నీరు నిలిచి ప్రజలు ఇళ్లలోనే చిక్కుకుపోయారు. ముఖ్యంగా పెద్ద చెరువు కింద ఉన్న జీఆర్ కాలనీ, కౌండిన్య కాలనీ పూర్తిగా జలమయమయ్యాయి. ఫర్నిచర్, ఇళ్లలోని సామగ్రి కొట్టుకుపోయి ప్రజలు రోడ్డున పడ్డారు. ఆ రోజు రాత్రంతా ప్రజలు భయంతో నిద్ర లేకుండా గడిపారు.
Kamareddy Flood Fear | శాశ్వత పరిష్కారం చూపని వైనం
ఏడాది గడిచినా ఆ గాయాలు ఇంకా మానలేదు. ఈసారి వర్షాలు మొదలవుతుండగానే మళ్లీ అదే పరిస్థితి వస్తుందేమోనన్న భయం వెంటాడుతోంది. అక్రమ కబ్జాలు, అక్రమ కట్టడాలు, మురుగు కాల్వల ఆక్రమణల వల్లనే పట్టణంలో వరద ముప్పు పెరిగిందని స్థానికులు ఆరోపిస్తున్నారు. వర్షం నీరు వెళ్లే దారులు మూసుకుపోవడంతో నీరంతా కాలనీల్లోకి చేరుతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వరదల తర్వాత అధికారులు, ప్రజాప్రతినిధులు క్షేత్రస్థాయి పర్యటనలు చేసి, శాశ్వత పరిష్కారం చూపుతామని హామీలు ఇచ్చారు. కాలువలను వెడల్పు చేస్తామని, ఆక్రమణలను తొలగిస్తామని చెప్పారు. కానీ ఆచరణలో మాత్రం ఎలాంటి కార్యాచరణ కనిపించడం లేదని ప్రజలు మండిపడుతున్నారు.
Kamareddy Flood Fear | నిండుకుండలా పెద్ద చెరువు
గత వారం రోజులుగా కురుస్తున్న వర్షాలకు కామారెడ్డి పెద్ద చెరువు ఇప్పటికే నిండుకుండను తలపిస్తోంది. మరికొన్ని రోజులు భారీ వర్షాలు కురిస్తే పరిస్థితి ఏమిటని కాలనీవాసులు ప్రశ్నిస్తున్నారు. గతేడాది అంతా పోగొట్టుకున్నాం. ఈసారి కూడా అదే జరిగితే బతికేది ఎలా అని కాలనీవాసులు ఆవేదన వ్యక్తం చేశారు. పెద్ద చెరువుతో పాటు చిన్నమల్లారెడ్డి చెరువు నిండితే చిన్నమల్లారెడ్డి, సరంపల్లి గ్రామాల నుంచి వచ్చే వరదలు పెద్ద చెరువు ప్రధాన కాలువలో కలుస్తుండటంతో వరద ఉధృతి పెరిగే అవకాశాలు ఉన్నాయి. గతేడాది వరదలకు కామారెడ్డి పట్టణం తీవ్రంగా నష్టపోయింది. జీఆర్, కౌండిన్య కాలనీలతో పాటు పలు ప్రాంతాల్లో అనేక ఇళ్లు దెబ్బతిన్నాయి. వరదల్లో ముఖ్యమైన డాక్యుమెంట్లు, సర్టిఫికెట్లు, నగదు, బంగారం కోల్పోయారు. ఫ్రిజ్‌లు, టీవీలు, వాహనాలు, దుకాణాల్లోని సరుకులు నీట మునిగాయి.
చర్యలు తీసుకునేనా..?
వరద ముప్పు రాకుండా డ్రైనేజీ వ్యవస్థను పటిష్టం చేయడం, ఆక్రమణలను తక్షణం తొలగించడం, చెరువు కట్టలను బలోపేతం చేయడంతో పాటు శాశ్వత పరిష్కారానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని పట్టణ ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. లేకుంటే ప్రతి వర్షానికి భయపడుతూ బతకాల్సిన పరిస్థితి తప్పదని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే అధికారులు శాశ్వత పరిష్కారం కోసం చర్యలు తీసుకుంటారా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
మరమ్మతులు చేపట్టాం
– ఇప్ప ఉమారాణి, మున్సిపల్ ఛైర్పర్సన్
గతేడాది వరదల దృష్ట్యా ఈ ఏడాది ముందస్తుగానే చర్యలు తీసుకున్నాం. వరదకు కారణమైన కాలువ మరమ్మతులు చేపట్టాం. ఎక్కడికక్కడ తూటి పొదలను యంత్రాల సహాయంతో తొలగించాం. వరదల సమయంలో తీసుకునే జాగ్రత్తలను కలెక్టర్ ఆదేశాలతో ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలతో మాక్‌డ్రిల్ కూడా నిర్వహించాం. వరద బారిన పడకుండా మరోసారి కాలనీలో పర్యటించి తగిన చర్యలు తీసుకుంటాం.
ఇది కూడా చదవండి: అమెరికాలోని వాషింగ్టన్ రాష్ట్రం స్పోకేన్‌లో అటవీ ప్రాంతంలో చెలరేగిన మంటలు