అక్షరటుడే వెబ్‌డెస్క్: Konda Surekha Controversy | తెలంగాణ ( Telangana) కాంగ్రెస్‌లో మంత్రి కొండా సురేఖ వ్యవహారం రోజురోజుకూ రాజకీయ ఉత్కంఠను రేపుతోంది. ఆమెపై అధిష్టానం ఎలాంటి చర్యలు తీసుకుంటుందనే సస్పెన్స్ కొనసాగుతున్న వేళ పార్టీలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. తాజాగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో కొండా సురేఖ భర్త కొండా మురళి, మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి విడివిడిగా భేటీ కావడం రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది. ప్రజాభవన్‌లో జరిగిన సమావేశంలో మంత్రితో పాటు ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా పాల్గొన్నట్లు సమాచారం.
Konda Surekha Controversy | క్రమశిక్షణ కమిటీ నివేదిక..
పార్టీ నియమావళిని కొండా సురేఖ ఉల్లంఘించడం ఇది మూడోసారమని, అలాగే చిన్నారెడ్డి కూడా గీత దాటి మాట్లాడారని కాంగ్రెస్ రాష్ట్ర క్రమశిక్షణ వ్యవహారాల కమిటీ (డీఏసీ) పీసీసీ చీఫ్‌కు నివేదిక సమర్పించింది. ఇకపై వీరిని ఉపేక్షిస్తే పార్టీకి తీవ్ర నష్టం వాటిల్లుతుందని ఆ నివేదికలో స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో కొండా సురేఖపై పార్టీ వేటు వేయడం ఖాయమనే ప్రచారం జరుగుతున్న తరుణంలో కొండా మురళి భట్టిని కలవడం ప్రాధాన్యత సంతరించుకుంది. మరోవైపు రాజగోపాల్ రెడ్డి భట్టితో భేటీ కావడం కూడా హాట్ టాపిక్‌గా మారింది. సురేఖ, చిన్నారెడ్డిలపై చర్యలు తీసుకుంటే అదే డిమాండ్ తనపైనా వస్తుందనే ఉద్దేశంతోనే ఆయన ముందస్తుగా అప్రమత్తమై భేటీ అయ్యారనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
Konda Surekha Controversy | మేం కాంగ్రెస్‌లోనే ఉంటాం..
భట్టి విక్రమార్కతో సమావేశం ముగిసిన తర్వాత కొండా మురళి మీడియాతో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. తమ బిడ్డ కొండా సుస్మిత చేసిన వ్యాఖ్యలతో తమకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. ఆమె మనోభావాలు ఆమెకు ఉంటాయని, దానిని ప్రశ్నించే హక్కు తనకు లేదన్నారు. తమకు గాంధీ కుటుంబంపై సంపూర్ణ విశ్వాసం ఉందని, తాము కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతామని స్పష్టం చేశారు. కేవలం ఒక బిల్లు విషయమై భట్టిని కలిశానని, క్రమశిక్షణ కమిటీ నిర్ణయం వెలువడే వరకు తాను దీనిపై ఏమీ మాట్లాడనని ఆయన తేల్చిచెప్పారు.
ఇది కూడా చదవండి: Model School Teachers | ప్రభుత్వ తీరుతో ఉపాధ్యాయుల ఇబ్బందులు : హరీశ్‌రావు