అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Konda Surekha | రాష్ట్ర రాజకీయాల్లో మంత్రి కొండా సురేఖ వ్యవహారంపై తీవ్ర చర్చ జరుగుతోంది. కొండా కుటుంబం తీరుతో పార్టీకి నష్టం వాటిల్లుతుందని పలువురు కాంగ్రెస్ నాయకులు ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలో ఆమెపై చర్యలు తీసుకునేందుకు పార్టీ సిద్ధం అవుతున్నట్లు సమాచారం.
కొండా సురేఖ తీరు ఆది నుంచి పార్టీని ఇబ్బంది పెట్టేలా ఉంది. గతంలో ఓ హీరోయిన్ విషయంలో చేసిన వ్యాఖ్యలతో పార్టీకి డ్యామేజీ అయింది. అనంతరం ఆమె భర్త కొండా మురళి (Konda Murali) సొంత పార్టీ ఎమ్మెల్యేలపై తీవ్ర విమర్శలు చేశారు. రేవూరి ప్రకాశ్‌రెడ్డి, కడియం శ్రీహరి (Kadiyam Srihari)పై అనుచిత వ్యాఖ్యలు చేశారు. అంతేగాకుండా ఆ కుటుంబం ఇతర ఎమ్మెల్యేలను కలుపుకొని పోదనే ఆరోపణలు ఉన్నాయి. దీంతో కొండా ఫ్యామిలీ వ్యతిరేకంగా ఉమ్మడి వరంగల్ జిల్లా ఎమ్మెల్యేలు ఏకం అయ్యారు. గతంలో క్రమశిక్షణ కమిటీకి ఫిర్యాదు చేశారు. ఇటీవల ఏకంగా ఆమెను బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు.
Konda Surekha | కూతురి వ్యాఖ్యలతో..
కొండా మురళి గతంలో మంత్రి పొంగులేటిని ఉద్దేశించి సైతం వ్యాఖ్యలు చేశారు. మేడారంలో అభివృద్ధి పనుల విషయంలో ఆయనపై ఆరోపణలు చేశారు. ఇన్ని రోజులు వారు ఎన్ని మాటలు అన్న పట్టించుకోని కాంగ్రెస్ అధిష్టానం.. తాజాగా వారి కూతురు చేసిన వ్యాఖ్యలతో ఆగ్రహం వ్యక్తం చేసింది. కొండా సుష్మిత గతంలో సైతం రేవంత్‌రెడ్డిపై ఆరోపణలు చేశారు. తాజాగా మరోసారి పరకాల సీటు విషయంలో తీవ్ర ఆరోపణలు చేశారు. సీఎం అవినీతికి పాల్పడుతున్నారని ఆరోపించారు. పొంగులేటిపై సైతం విమర్శలు చేశారు. దీంతో అధిష్టానం సీరియస్ అయింది.
Konda Surekha | మంత్రి పదవి ఉంటుందా..
కొండా సుష్మిత (Konda Susmitha) వ్యాఖ్యలపై ఇది వరకే క్రమశిక్షణ కమిటీ నివేదిక ఇచ్చింది. ఆమె పార్టీ లైన్ దాటి మాట్లాడరని పేర్కొంది. కొండా సురేఖ వివరణ ఇచ్చినా.. అధిష్టానం ఆగ్రహంగా ఉంది. సొంత కూతురు సీఎంపై మాట్లాడితే తమకు సంబంధం లేదని కొండా దంపతులు చెప్పడంపై రేవంత్‌రెడ్డి సైతం ఆగ్రహంగా ఉన్నట్లు సమాచారం. ఈ క్రమంలో ఢిల్లీలో ఆమె విషయంలో చర్చించడానికి సీఎం ఢిల్లీకి వెళ్లారు. దీంతో ఆమెను మంత్రి పదవి నుంచి తొలగిస్తారని ప్రచారం జరుగుతోంది.
Konda Surekha | కేసీ వేణుగోపాల్‌తో భేటీ
కొండా సురేఖ వ్యవహారంపై అధిష్టానంతో చర్చించడానికి సీఎం రేవంత్‌రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌గౌడ్ ఢిల్లీ వెళ్లారు. మరోవైపు కొండా సురేఖ సైతం హస్తినకు వెళ్లారు. మంగళవారం సాయంత్రం సీఎం రేవంత్‌రెడ్డి కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌తో భేటీ అయ్యారు. పార్టీ అధ్యక్షుడు ఖర్గే, రాహుల్ గాంధీతో సైతం ఆయన సమావేశం కానున్నట్లు తెలిసింది. అనంతరం కొండా సురేఖ వ్యవహారంపై ప్రకటన వస్తుందని భావిస్తున్నారు.
Konda Surekha | వెయ్యి రోజుల పాలన వేళ..
కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి వెయ్యి రోజులు అవుతోంది. ఈ క్రమంలో మంత్రివర్గ పునర్ వ్యవస్థీకరణ చేపట్టాలనే డిమాండ్ ఉంది. దీంతో కొండా సురేఖతో పాటు పనితీరు బాగ లేని మరికొందరిని తప్పించే అవకాశాలు ఉన్నట్లు సమాచారం. లేదంటే శాఖలను మారుస్తారని ప్రచారం జరుగుతోంది. అయితే కొండా సురేఖను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తారా.. మంత్రి పదవి నుంచి తొలగిస్తారా అనేది తెలియాల్సి ఉంది. లేదంటే హెచ్చరించి వదిలేస్తారా అనేది త్వరలో తేలనుంది. ఆమెపై చర్యలు తీసుకోకపోతే మరికొందరు నేతలు సైతం ఇష్టారీతిగా మాట్లాడే అవకాశం ఉందని పార్టీ నాయకులు అంటున్నారు. ఈ క్రమంలో అధిష్టానం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాలి.
#WATCH | Telangana CM Revanth Reddy arrives at the residence of Congress General Secretary (Organisation) and MP K.C. Venugopal in Delhi. pic.twitter.com/XjJjeL7eot
— ANI (@ANI) September 1, 2026
ఇది కూడా చదవండి : Brishti Mukherjee Suicide | మమతా బెనర్జీ ఇంట తీవ్ర విషాదం.. సోదరుడి కుమార్తె ఆత్మహత్య