అక్షరటుడే, వెబ్‌డెస్క్: KTR on Gas Prices | ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Narendra Modi)పై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. బెంగాల్లో ఎన్నికలు ముగియగానే దేశవ్యాప్తంగా కమర్షియల్ సిలిండర్ ధరలను భారీగా పెంచారని మండి పడ్డారు.
తెలంగాణ భవన్ (Telangana Bhavan)లో శుక్రవారం మే డే వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కేటీఆర్ మాట్లాడుతూ.. దేశ చరిత్రలో ఎన్నడు పెంచనంతగా వాణిజ్య సిలిండర్ల మీద రూ.993 పెంచిన ఘనత మోదీది అని విమర్శించారు. ఎన్నికలు అయిపోగానే గ్యాస్ సిలిండర్ల ధరలు పెంచడం మోదీకి అలవాటు అయిందన్నారు. ఒక్క సిలిండర్ మీద దాదాపు రూ.వెయ్యి పెంచి సామాన్యులకు, హోటళ్లలో పని చేసే కార్మికులకు మోదీ మేడే కానుక ఇచ్చారని ఎద్దేవా చేశారు.
KTR on Gas Prices | తీవ్ర ప్రభావం
హైదరాబాద్ (Hyderabad)లో నిన్నటి వరకు ఒక సిలిండర్ ధర రూ.2,321 ఉండగా ఈరోజు నుంచి రూ.3,315కు చేరిందని కేటీఆర్ అన్నారు. వాణిజ్య సిలిండర్ల ధరల పెరుగుదల ప్రభావం హోటళ్ల మీద, మెస్‌ల మీద పడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. హైదరాబాద్ నగరంలో యువతకు, ఉద్యోగాలు చేసుకునే వారికి ఈ ధరల పెంపు వల్ల ఇబ్బందులు ఎదురవుతాయన్నారు.
KTR on Gas Prices | కార్మికుల సంక్షేమం పట్టని ప్రభుత్వాలు
కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వాలు కార్మికుల సంక్షేమాన్ని పట్టించుకోవడం లేదని కేటీఆర్ విమర్శించారు. మోదీ పాలనలో రూపాయి విలువ పాతాళానికి, గ్యాస్ ధరలు ఆకాశానికి చేరుతున్నాయని విమర్శించారు. రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం (Congress Government) కార్మికుల సంక్షేమాన్ని పట్టించుకోవడం లేదన్నారు. ఎన్నికల ముందు కార్మికులకు అనేక హామీలు ఇచ్చిన రేవంత్‌రెడ్డి ఇప్పుడు వారిని విస్మరించారన్నారు.
KTR on Gas Prices | రెండేళ్లలో కేసీఆర్ వస్తారు
రేవంత్ రెడ్డి (Revanth Reddy) ఎన్నికల్లో ఇచ్చిన హామీలను విస్మరించి మొద్దునిద్ర పోతున్నారని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సిగాచి పరిశ్రమ ప్రమాదంలో మరణించిన కార్మికులకు ఇంకా పరిహారం అందలేదన్నారు. రెండేళ్లలో మళ్లీ కేసీఆర్ అధికారంలోకి వస్తారని, కార్మికుల సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. అప్పటి వరకు ఓపిక పట్టాలని కార్మికులను కోరారు.
ఇది కూడా చదవండి..: High Court Notices | పోలీసుల తీరుపై హైకోర్టు ఆగ్రహం.. సీవీ ఆనంద్‌కు ధిక్కార నోటీసులు!

