Mahesh Kumar Goud Comments | కేసీఆర్‌కు చెడు జరగాలని కోరుకునేది సొంత కుటుంబమే: మహేష్ గౌడ్

సీఎం రేవంత్ రెడ్డి పట్ల బీఆర్ఎస్ నాయకులు వ్యవహరిస్తున్న తీరును టీపీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ బి. మహేష్ కుమార్ గౌడ్ తీవ్రంగా తప్పుబట్టారు.

Shivam nagarani

అక్షరటుడే వెబ్‌డెస్క్: Mahesh Kumar Goud Comments | సీఎం రేవంత్ రెడ్డి పట్ల బీఆర్ఎస్ నాయకులు వ్యవహరిస్తున్న తీరును టీపీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ బి. మహేష్ కుమార్ గౌడ్ తీవ్రంగా తప్పుబట్టారు. బుధవారం అసెంబ్లీ మీడియా పాయింట్‌లో ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడూ కేసీఆర్ చెడును కోరుకోలేదని, ప్రతిపక్ష నేతగా ఆయనకు అన్ని వేళలా తగిన గౌరవం ఇస్తున్నామని స్పష్టం చేశారు.

గతంలో కేసీఆర్ బాత్‌రూమ్‌లో జారిపడినప్పుడు సీఎం రేవంత్ రెడ్డి వెంటనే స్పందించి అర్ధరాత్రి గ్రీన్ ఛానల్ ద్వారా ఆసుపత్రికి తరలించి మెరుగైన వైద్యం అందించారని మహేష్ గౌడ్ గుర్తుచేశారు. కేసీఆర్ అసెంబ్లీకి వస్తే స్వయంగా సీఎం ఆయన ఆరోగ్యం గురించి ఆరా తీశారని, ప్రస్తుతం రాష్ట్రంలో సీఎం తర్వాత అత్యధిక సెక్యూరిటీ పొందుతున్న వ్యక్తి కేసీఆరేనని తెలిపారు.

Mahesh Kumar Goud Comments | పిండ ప్రదానం చేయడంపై మండిపాటు..

ప్రజలు కాంగ్రెస్‌కు అధికారం కట్టబెడితే, సిరిసిల్లలో సీఎం రేవంత్ రెడ్డికి  ( Revanth Reddy )బీఆర్ఎస్ నేతలు పిండ ప్రదానం చేయడం ఎంతవరకు సబబు అని మహేష్ గౌడ్ నిలదీశారు. స్పీకర్ పదవి విషయంలో బీఆర్ఎస్ నేత తాతా మధు మాట్లాడిన తీరును మీడియా మిత్రులు గమనించాలని కోరారు. బీఆర్ఎస్ నాయకుల ఈ దిగజారుడు రాజకీయాన్ని యావత్ తెలంగాణ సమాజం ఖండిస్తోందని అన్నారు.

కేసీఆర్ ప్రాణాలకు ప్రమాదం ఉందని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు రాజకీయ డ్రామాలు ఆడుతున్నారని ఆయన ఆరోపించారు. నిజానికి కేసీఆర్ ఆరోగ్యం క్షీణించాలని, ఆయనకు చెడు జరగాలని సొంత కుటుంబ సభ్యులే కోరుకుంటున్నారని విమర్శించారు. గతంలో హరీశ్ రావు క్షుద్ర పూజలు చేస్తున్నారని కేసీఆర్ కూతురు కవిత స్వయంగా మాట్లాడిన వీడియోలు అందరి వద్ద ఉన్నాయని గుర్తుచేశారు. సొంత కుటుంబ సభ్యులే కేసీఆర్ చెడు కోరుకుంటుంటే, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీపై నిందలు వేయడం విడ్డూరంగా ఉందని ఎద్దేవా చేశారు.

Mahesh Kumar Goud Comments | త్వరగా కోలుకుని అసెంబ్లీకి రావాలని..

మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ మరణానికి కారణమైన వారిని సైతం క్షమించిన ఉదారత కాంగ్రెస్ పార్టీదని మహేష్ గౌడ్ పేర్కొన్నారు. ఉద్యమ నాయకుడిగా కేసీఆర్‌పై అందరికీ గౌరవం ఉందని, ఆయన త్వరగా కోలుకుని అసెంబ్లీకి రావాలని తాము కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామని తెలిపారు. రాష్ట్రంలో దళితులు, బలహీన వర్గాలకు సంక్షేమం అందించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం నిరంతరం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు.

ఇది కూడా చదవండి:  BRS Public Apology | స్పీకర్​కు బీఆర్ఎస్ బహిరంగ క్షమాపణ చెప్పాలి

Follow:
Author Bio: శివం నాగరాణి గత 5 సంవత్సరాలుగా తెలుగు వార్తా రంగంలో పనిచేస్తున్నారు. కందిలి దినపత్రికలో జర్నలిస్ట్‌గా పని చేశారు. ప్రస్తుతం అక్షర టుడే వెబ్‌సైట్‌లో లైఫ్‌స్టైల్, ఆధ్యాత్మికం, ఆరోగ్యం, విద్య, ఉద్యోగాలు, ప్రభుత్వ పథకాలు, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్‌వంటి అంశాలపై వార్తలను అందిస్తున్నారు.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *