అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: ‘నీట్’(NEET) విషయంలో కేంద్ర ప్రభుత్వానివి తప్పుడు విధానాలని ప్రభుత్వ సలహాదారు, బోధన్ (bodhan) ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి (Mla Sudarshan Reddy) దుయ్యబట్టారు. ఈ మేరకు నగరంలో మీడియాతో మాట్లాడారు.
NEET Protest Telangana | న్యాయం చేయమని అడిగితే లాఠీఛార్జీలా..?
నెలరోజులుగా నీట్ పరీక్ష విషయంలో న్యాయం చేయాలని విద్యార్థులు అడిగితే వారిపై లాఠీఛార్జీ చేయడం కేంద్ర ప్రభుత్వ అరాచక చర్య అని సుదర్శన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్ర విద్యా శాఖ మంత్రి రాజీనామాపై మాట్లాడకుండా విద్యార్థుల ఉద్యమాన్ని అణగదొక్కేందుకు కేంద్రం ప్రయత్నం చేస్తోందన్నారు. దేశంలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీపై అమానుషమైన దాడిని తాము తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. విద్యార్థుల న్యాయమైన డిమాండ్ అయిన కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే రాజీనామా చేయాలన్నారు.
NEET Protest Telangana | విద్యార్థుల పక్షాన కాంగ్రెస్ పార్టీ..
విద్యార్థుల పక్షాన కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పోరాటం ముమ్మరం చేస్తామని ప్రభుత్వ సలహాదారు తెలిపారు. ఉద్యమాలను అణిచివేయడంలో బీజేపీ ప్రభుత్వం బ్రిటిష్ వాళ్లను సైతం మించిపోయారని విమర్శించారు. విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడడం మానుకోవాలి ఈ దేశ భవిష్యత్తు అయిన విద్యార్థుల న్యాయమైన కోరికను వెంటనే తీర్చాలని డిమాండ్ చేశారు. సమావేశంలో ఉర్దూ అకాడమీ ఛైర్మన్ తాహెర్ బిన్ హందాన్, కాంగ్రెస్ జిల్లా మాజీ అధ్యక్షుడు మానాల మోహన్ రెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మన్ అంతిరెడ్డి రాజిరెడ్డి, పారిపెల్లి గంగారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఇది కూడా చదవండి: “నిద్రపోయే వాళ్లను లేపొచ్చు.. కానీ వీళ్లది నిద్ర నటించే ప్రభుత్వం.” – వైసీపీ అధినేత జగన్