అక్షరటుడే, కామారెడ్డి: Operation Muskaan | ఉమ్మడి నిజామాబాద్ జిల్లా (Nizamabad District)లో బాలకార్మికుల సంఖ్య రోజురోజుకూ పెరిగిపోతోంది. పిల్లలను పనిలో పెట్టుకోవడం నేరమని తెలిసినా పలు షాపులు, హోటళ్లు, ఇటుక బట్టీలు, గ్యారేజీలు, పౌల్ట్రీ ఫారాలు, వ్యవసాయ క్షేత్రాల్లో యజమాన్యాలు చిన్నారులతో వెట్టిచాకిరి చేయిస్తున్నారు. పేదరికాన్ని ఆసరాగా చేసుకుని కుటుంబాలకు కొంత డబ్బు ఇచ్చి, పిల్లల భవిష్యత్తును అంధకారంలోకి నెడుతున్నారు. వీటిని నిర్మూలించేందుకు ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘ఆపరేషన్ ముస్కాన్’ విజయవంతమవుతోంది.
ఈ పరిస్థితిని అరికట్టేందుకే రాష్ట్ర ప్రభుత్వం ఆపరేషన్ ముస్కాన్ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా 2026 జూలై నెలంతా ఉమ్మడి జిల్లాలో జరిగిన ఆపరేషన్ ముస్కాన్–12 విజయవంతమైంది. దాదాపు వందకు పైగా చిన్నారులను బాల కార్మిక వ్యవస్థ నుంచి రక్షించారు అధికారులు. వీరిని క్షేమంగా వారి తల్లిదండ్రులకు అప్పగించారు.
Operation Muskaan | ప్రాజెక్ట్ ముఖ్య ఉద్దేశమిదే..
18ఏళ్లలోపు పిల్లలను కార్మికులుగా మార్చడం, వెట్టిచాకిరి చేయించడం, భిక్షాటనకు వాడుకోవడం, ప్రమాదకరమైన పరిస్థితుల్లోకి నెట్టడం పూర్తిగా నిర్మూలించడమే ఈ ఆపరేషన్ లక్ష్యం. తప్పిపోయిన పిల్లలను గుర్తించడం, బాలల హక్కుల పరిరక్షణ, వారికి సురక్షితమైన బాల్యం, విద్య, వైద్యం అందించడం ప్రభుత్వ ప్రధాన ఉద్దేశం. ఇందుకోసం హోటళ్లు, ఇటుక బట్టీలు, షాపులు, కిరాణా దుకాణాలు, మెకానిక్ షాపుల్లో అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తారు. చట్టాన్ని ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటారు.
Operation Muskaan | నెల రోజుల స్పెషల్ డ్రైవ్
ఉమ్మడి జిల్లా ఐపీఎస్ అధికారుల ఆదేశాలతో జూలై 1 నుంచి 31 వరకు కామారెడ్డి జిల్లాలోని కామారెడ్డి, ఎల్లారెడ్డి, బాన్సువాడ మూడు డివిజన్లలో ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేశారు. నిజామాబాద్ జిల్లాలో నిజామాబాద్, ఆర్మూర్, బోధన్ డివిజన్లలో తనిఖీలు కొనసాగించారు. పోలీసు శాఖతో పాటు కార్మిక శాఖ, మహిళా, శిశు సంక్షేమ శాఖ, చైల్డ్ వెల్ఫేర్ కమిటీ, జిల్లా బాలల పరిరక్షణ విభాగం, విద్యాశాఖ, వైద్య ఆరోగ్య శాఖ, రెవెన్యూ శాఖ అధికారులు కలిసి ఫీల్డ్‌లోకి దిగారు. ప్రతి రోజు ఉదయం నుంచి రాత్రి వరకు బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు, మార్కెట్లు, పారిశ్రామిక ప్రాంతాల్లో సోదాలు నిర్వహించారు.
Operation Muskaan | కామారెడ్డి జిల్లాలో 45 మందికి విముక్తి
ఈ నెల రోజుల ఆపరేషన్‌లో జిల్లా యంత్రాంగం కామారెడ్డి జిల్లాలోని 45 మంది బాలబాలికలను గుర్తించి రక్షించింది. వీరిలో 41 మంది బాలురు, 4 మంది బాలికలు ఉన్నారు. కామారెడ్డి డివిజన్లో 13 మంది (12 మంది బాలురు, 1 బాలిక), ఎల్లారెడ్డిలో 10 మంది బాలురు, బాన్సువాడ డివిజన్లో 22 మంది (19 మంది బాలురు, 3 మంది బాలికలు) చిన్నారులకు విముక్తి కల్పించారు. ఎక్కువ మంది చిన్నారులు హోటళ్లు, మెకానిక్ షాపులు, ఇటుక బట్టీలు, వ్యవసాయ పనుల్లో చిక్కుకున్నారు. కొందరు కుటుంబ పోషణ కోసం, మరికొందరు బలవంతంగా పనిలోకి చేరినట్టుగా అధికారులు గుర్తించారు.
Operation Muskaan | నిజామాబాద్ జిల్లాలో..
నిజామాబాద్ జిల్లాలోని నిజామాబాద్ సిటీ, ఆర్మూర్, బోధన్ డివిజన్లలో జరిపిన తనిఖీల్లో మొత్తం 119 మంది బాలలను గుర్తించారు. ఇందులో నిజామాబాద్ సబ్‌డివిజన్ పరిధిలో 43 మంది పిల్లలను అధికారులు అదుపులోకి తీసుకున్నారు. బోధన్ సబ్‌డివిజన్ పరిధిలో 49మంది బాలబాలికలు, ఆర్మూర్ బోధన్ సబ్‌డివిజన్ పరిధిలో 27 మందిని గుర్తించారు. నిజామాబాద్ డివిజన్‌లో 19, ఆర్మూర్ డివిజన్‌లో 15, బోధన్ డివిజన్‌లో 14 కేసులను నమోదు చేశారు. తప్పిపోయిన పిల్లల వివరాలను ‘ట్రాక్ చైల్డ్’లో నమోదు చేసి వారి ఆచూకీ తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నట్లు సీపీ సాయి చైతన్య పేర్కొన్నారు. బాలలను పనిలో పెట్టుకుంటే సంబంధిత యజమానులపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని సీపీ విధిస్తామన్నారు. అలాగే జరిమానా విధిస్తామని హెచ్చరిచారు.
Operation Muskaan | భరోసా కేంద్రం.. హాస్టళ్లలో చేరిక
ఆపరేషన్ ముస్కాన్ కార్యక్రమంలో రక్షించిన బాలలను వెంటనే చైల్డ్ వెల్ఫేర్ కమిటీ ముందు హాజరు పరిచారు. సీడబ్ల్యుసీ ఆదేశాల మేరకు చాలా మందిని వారి తల్లిదండ్రులకు అప్పగించారు. కుటుంబ పరిస్థితి సరిగా లేని వారికి భరోసా కేంద్రాల్లో సంరక్షణ, వసతి, భోజనం, వైద్య పరీక్షలు అందించారు. విద్యకు దూరమైన పిల్లలను మళ్లీ బడికి పంపేందుకు విద్యాశాఖ అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. తప్పిపోయిన పిల్లల వివరాలను “ట్రాక్ చైల్డ్” పోర్టల్‌లో నమోదు చేసి వారి ఆచూకీ కోసం నిరంతరం ప్రయత్నిస్తున్నారు.
Operation Muskaan | యజమానులపై కఠిన చర్యలు
బాలలను చట్టవిరుద్ధంగా పనిలో పెట్టుకున్న యజమానులపై జిల్లా పోలీసులు 23 కేసులు నమోదు చేశారు. కామారెడ్డి డివిజన్ లో 11 కేసులు, ఎల్లారెడ్డిలో 4 కేసులు, బాన్సువాడలో 8 కేసులు నమోదు చేశారు. మరోసారి చిన్నారులను పనిలో చేర్చుకుంటే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
Operation Muskaan | కఠిన చర్యలు తప్పవు

– రాజేష్ చంద్ర, ఎస్పీ, కామారెడ్డి
చిన్నారులతో పని చేయించడం జాతీయ, రాష్ట్ర చట్టాల ప్రకారం నేరం. ఇలాచేసే వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టం. వారిపై కఠిన చట్టపరమైన చర్యలు తప్పవు. బాలల రక్షణ అనేది ప్రభుత్వ శాఖల బాధ్యత మాత్రమే కాదు. ఇది సమాజంలోని ప్రతి పౌరుడి కర్తవ్యం. జిల్లాలో ఎక్కడైనా బాల కార్మికులు కనిపిస్తే, పిల్లలపై వేధింపులు, దోపిడీ జరుగుతున్నట్లు తెలిస్తే వెంటనే చైల్డ్ హెల్ప్‌లైన్ 1098 లేదా డయల్ 100 కు ఫోన్ చేసి సమాచారం ఇవ్వాలి.
ఇది కూడా చదవండి..: Bhu Bharati Project | భూభారతి ప్రాజెక్ట్‌లో ఫీల్డ్ టెక్నికల్ స్టాఫ్ సమస్యలు పరిష్కరించాలి..