అక్షరటుడే, ఎల్లారెడ్డి: Paddy Lorry Extortion Case | వడ్ల లోడ్‌తో వెళ్తున్న లారీని అడ్డగించి, బెదిరించి డబ్బులు డిమాండ్ చేసిన కేసులో నలుగురిని ఎల్లారెడ్డి (Yellaredddy) పోలీసులు అరెస్టు చేశారు. ఈ మేరకు ఎల్లారెడ్డి డీఎస్పీ శ్రీనివాసరావు వివరాలు వెల్లడించారు.
Paddy Lorry Extortion Case | డబ్బులివ్వకపోతే చంపుతామని..
పోలీసుల వివరాల ప్రకారం.. ఈనెల 26న రాత్రి మల్లయ్యపల్లి గ్రామ శివారులోని పోచారం కెనాల్ సమీపంలో వడ్ల లోడ్‌తో వెళ్తున్న లారీని నలుగురు నిందితులు కారుతో అడ్డగించారు. లారీలోని వడ్లకు సంబంధించిన పత్రాలను చూపించాలని డ్రైవర్‌ను కోరారు. పత్రాలు చూపించకపోతే నలుగురికి ఒక్కొక్కరికి రూ.30వేల చొప్పున మొత్తం రూ.1.20 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేసినట్లు పోలీసులు తెలిపారు. డబ్బులు ఇవ్వకపోతే చంపుతామని, పోలీసులకు పట్టించి కేసులు పెట్టిస్తామని బెదిరించినట్లు దర్యాప్తులో వెల్లడైందని పేర్కొన్నారు.
Paddy Lorry Extortion Case | లారీ యజమాని ఫిర్యాదుతో..
ఈ ఘటనపై లారీ యజమాని చకినాల సురేందర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎల్లారెడ్డి పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదు చేశారు. జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర ఆదేశాల మేరకు ఎల్లారెడ్డి డీఎస్పీ శ్రీనివాసరావు పర్యవేక్షణలో సీఐ, ఎస్సైల ఆధ్వర్యంలో రెండు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి దర్యాప్తు చేపట్టారు. దర్యాప్తులో భాగంగా నిందితులను గుర్తించి అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. నిందితుల నుంచి కారు, నాలుగు సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. కేసులో మిగిలిన అంశాలపై దర్యాప్తు కొనసాగుతున్నట్లు ఎల్లారెడ్డి డీఎస్పీ శ్రీనివాసరావు తెలిపారు. నేరాలకు పాల్పడే వ్యక్తులు తమ వృత్తి లేదా హోదాను అడ్డుపెట్టుకున్నప్పటికీ చట్టపరమైన చర్యల నుంచి తప్పించుకోలేరని పోలీసులు స్పష్టం చేశారు.