Paddy Procurement | కొనుగోలు కేంద్రం నిర్వహణ తీరుపై కలెక్టర్​ ఆగ్రహం.. ఏపీఎంకు షోకాజ్​ నోటీస్​ జారీకి ఆదేశం

shashi kiran Mottala

అక్షరటుడే, నిజామాబాద్​ అర్బన్​: Paddy Procurement | ధాన్యం కొనుగోలు కేంద్రం నిర్వహణలో నిర్లక్ష్యంపై కలెక్టర్ ఇలా త్రిపాఠి (Collector Ila Tripathi) సంబంధిత అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. విధుల పట్ల అలసత్వం వహించడాన్ని తీవ్రంగా పరిగణిస్తూ.. భీమ్​గల్​ మండల ఐకేపీ ఏపీఎంకు షోకాజ్ నోటీసు జారీ చేయాలని ఆదేశించారు.

Paddy Procurement | ప​ల్లికొండ, భీమ్​గల్​ గ్రామాల్లో..

భీమ్​గల్​ మండలం (Bheemgal Mandal) పల్లికొండ, భీమ్​గల్ గ్రామాల్లో కొనసాగుతున్న వరిధాన్యం కొనుగోలు కేంద్రాలను కలెక్టర్ ఇలా త్రిపాఠి మంగళవారం సందర్శించారు. ఈ సందర్భంగా పల్లికొండ కొనుగోలు కేంద్రం నిర్వహణలో లోటుపాట్లు ఉండడాన్ని కలెక్టర్ గమనించారు. రైతుల నుంచి కొనుగోలు చేసిన ధాన్యానికి సంబంధించిన వివరాలను సక్రమంగా నమోదు చేయకపోవడం, రిజిస్టర్ అందుబాటులో లేకపోవడం వంటి లోపాలను గుర్తించిన కలెక్టర్ కేంద్రం నిర్వాహకులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. నిర్వహణ తీరు ఇలాగే ఉంటే కమీషన్ నిలిపివేస్తామని, వచ్చే సీజన్ నుంచి సెంటర్ ను కేటాయించబోమని హెచ్చరించారు.

Paddy Procurement | ఏపీఎంపై ఆగ్రహం..

కొనుగోలు కేంద్రాలను క్షేత్రస్థాయిలో పరిశీలిస్తూ, పర్యవేక్షణ చేయాల్సిన బాధ్యతను సక్రమంగా నిర్వర్తించడం లేదని ఏపీఎంకు షోకాజ్ నోటీసు (Show-cause Notice) జారీ చేయాలని ఉన్నతాధికారులను కలెక్టర్​ ఆదేశించారు. రైతుల ప్రయోజనాలతో ముడిపడిన అంశాలలో విధులపై నిర్లక్ష్యాన్ని ఎంతమాత్రం ఉపేక్షించబోమని కలెక్టర్ స్పష్టం చేశారు. రైతులకు ఇబ్బందులు తలెత్తకుండా సకాలంలో ధాన్యం సేకరణ జరిగేలా ప్రణాళికాబద్దంగా వ్యవహరించాలని ఆదేశించారు. ఈ సందర్భంగా కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తెచ్చిన రైతులను పలకరించి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. మాయిశ్చర్ యంత్రం ద్వారా తేమ శాతాన్ని కలెక్టర్ స్వయంగా పరిశీలించారు. ధాన్యం బస్తాలను తూకం వేస్తున్న వేయింగ్ మిషన్ పనితీరును నిశిత పరిశీలన జరిపారు. తరుగు, కోత వంటివి లేకుండా, రైతులు ఏ దశలోనూ నష్టపోకుండా పక్కాగా పర్యవేక్షణ చేయాలని అధికారులను ఆదేశించారు.

Paddy Procurement | 17 శాతం లోబడి తేమ శాతం ఉంటే..

17 శాతానికి లోబడి తేమ శాతం ఉన్న ధాన్యాన్ని వెంటనే తూకం జరిపించి, మిల్లులకు తరలించాలని కలెక్టర్​ సూచించారు. వెదర్ యాప్ ఆధారంగా వాతావరణ పరిస్థితుల గురించి ముందస్తుగానే రైతులకు వివరాలు తెలియజేస్తూ వారిని అప్రమత్తం చేయాలన్నారు. ట్రక్ షీట్లను వెనువెంటనే తెప్పించుకుంటూ, ట్యాబ్ ఎంట్రీలను వేగంగా జరిపించాలని, తద్వారా సకాలంలో రైతుల ఖాతాలలో బిల్లులు జమ అవుతాయన్నారు. తహశీల్దార్లు, వ్యవసాయ అధికారులు తప్పనిసరిగా క్షేత్రస్తాయిలో కొనుగోలు కేంద్రాలను సందర్శిస్తూ, నిర్వహణ తీరుతెన్నులను నిశితంగా పర్యవేక్షణ జరపాలని ఆదేశించారు. కలెక్టర్ వెంట డీఎస్​వో శ్రీకాంత్ రెడ్డి, సివిల్ సప్లయిస్​ డీఎం ప్రవీణ్, డీసీవో శ్రీనివాస్, స్థానిక అధికారులు ఉన్నారు.

ఇది కూడా చదవండి..: Petrol Shortage in Banswada | బాన్సువాడలో పెట్రోల్ కొరత.. బంకుల్లో నో స్టాక్ బోర్డులు

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
2 Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *