అక్షరటుడే, వెబ్డెస్క్ : Rain Deficit Farmers | వరుణుడు ముఖం చాటేశాడు. వానాకాలం మొదలై నెలన్నర దాటుతున్నా.. భారీ వర్షాలు (Heavy Rains) పడలేదు. దీంతో వానాకాలం సీజన్లో సాగు పనులు చేపట్టేందుకు రైతులు ఆలోచిస్తున్నారు.
రాష్ట్రంలో ప్రతి ఏటా వరిని ఎక్కువ మొత్తంలో సాగు చేస్తారు. ఈ పంటకు నీరు ఎక్కువగా అవసరం. అయితే ప్రస్తుతం వానలు లేకపోవడంతో అన్నదాతలు వరి వేయడానికి ఆలోచిస్తున్నారు. వానాకాలం మొదలైన నాటి నుంచి చెప్పుకోదగ్గ వర్షాలు పడలేవు. కాలువలు పారలేదు. చెరువుల్లోకి నీరు రాలేదు. దీంతో వరి నాట్లు వేయడానికి అన్నదాతలు సంకొచిస్తున్నారు. ఈ సారి కాలం పోయినట్లేనా అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
Rain Deficit Farmers | వట్టిపోతున్న బోర్లు
రాష్ట్రంలో ప్రస్తుతం బోరుబావుల కింద మాత్రమే వరి సాగు చేశారు. అయితే వానలు లేకపోవడంతో భూగర్భ జలాలు రోజు రోజుకు పాతాళంలోకి పడిపోతున్నాయి. దీంతో బోర్లు పోయాక వేసిన పంటలకు నీరు అందడం లేదు. ఫలితంగా అన్నదాతలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మరికొందరు అప్పులు తెచ్చి కొత్తగా బోర్లు వేయిస్తున్నారు. అయినా చుక్క నీరు రాకపోవడంతో మనోవేదనకు గురి అవుతున్నారు. ప్రస్తుతం భూగర్భ జలాలు పడిపోయానని, రైతులు (Farmers) అనవసరంగా బోర్లు వేసి అప్పుల పాలు కావొద్దని అధికారులు సూచిస్తున్నారు.
Rain Deficit Farmers | తగ్గనున్న సాగు విస్తీర్ణం

ఈ సీజన్లో పంటల సాగు విస్తీర్ణం భారీగా తగ్గే అవకాశం ఉంది. జలాశయాల్లో నీరు లేదు. దీంతో ఆయకట్టుకు నీరు ఇచ్చే పరిస్థితి లేదు. మరోవైపు వర్షాలు లేక వేసిన పంటలు ఎండుతున్నాయి. ముఖ్యంగా వరి రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వర్షాలు పడుతాయనే ఆశతో ఇప్పటికే చాలా మంది నాట్లు వేయగా అవి ఎండిపోతున్నాయి. మరికొందరు నారు పోసి వానల కోసం ఎదురు చూస్తున్నారు. అయితే ఇంకా వర్షాలు లేకపోవడంతో నారు ముదిరిపోతుంది.
Rain Deficit Farmers | కరువు వచ్చినట్లేనా..
రాష్ట్రంలో ఒకటి రెండు జిల్లాల్లో తప్పా.. అంతటా లోటు వర్షపాతం నమోదు అయింది. ఈ నెలాఖరులోగా వర్షాలు లేకపోతే పంటల సాగు కష్టమేనని, వేసిన పొలాలు సైతం ఎండిపోతాయని రైతులు ఆందోళన చెందుతున్నారు. రెండు రోజులుగా మేఘాలు కమ్ముకొస్తున్నా.. చిరు జల్లులు తప్పా భారీ వర్షాలు పడటం లేదు. వానలు లేకపోతే కరువు వచ్చినట్లేనని రైతులు అంటున్నారు. కరువు వస్తే వానాకాలంతో పాటు యాసంగి సాగుపై తీవ్ర ప్రభావం పడుతుంది.
ఇది కూడా చదవండి..: Yuva Sangrama Sabha | యువ సంగ్రామ సదస్సు.. బీఆర్ఎస్ నాయకుల హౌజ్ అరెస్ట్