అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Yuva Sangrama Sabha | హైదరాబాద్ (Hyderabad) నగరంలోని సరూర్‌నగర్ స్టేడియంలో నేడు బీఆర్ఎస్ ఆధ్వర్యంలో యువ సంగ్రామ సదస్సు పేరిట భారీ సభ నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఈ సభకు వెళ్లకుండా పలువురు ముఖ్య నాయకులను పోలీసులు అడ్డుకుంటున్నారు.
నిరుద్యోగులు, యువతకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ నిర్వహిస్తున్న ఈ సభకు కేటీఆర్ హాజరు కానున్నారు. పెద్ద ఎత్తున నిరుద్యోగ యువత తరలిరానున్నారు. ఈ క్రమంలో పోలీసులు నాయకులను అరెస్ట్ చేస్తుండటంపై పార్టీ ఆగ్రహం వ్యక్తం చేసింది. యువ సంగ్రామ సదస్సుకు హాజరుకాకుండా మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డిని పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. కోర్టు అనుమతితో సభ నిర్వహిస్తుంటే అడ్డుకోవడం ఏంటని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు.
Yuva Sangrama Sabha | ప్రభుత్వానికి భయమెందుకు?

బీఆర్ఎస్ నాయకుడు ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్‌ను సైతం పోలీసులు గృహ నిర్బంధం చేశారు. ఆయన మాట్లాడుతూ.. నిరుద్యోగ యువత తరఫున బీఆర్ఎస్ గళమెత్తితే ఇంత భయమెందుకని ప్రశ్నించారు. హైకోర్టు పర్మిషన్ ఉన్నా, మల్కాజిగిరి సీపీ స్వయంగా యువ సంగ్రామ సదస్సుకు అనుమతినిచ్చినా… బీఆర్ఎస్ నాయకులను వెళ్లనివ్వకుండా కాంగ్రెస్ ప్రభుత్వం అక్రమంగా హౌస్ అరెస్ట్ చేయడం అత్యంత దారుణమని పేర్కొన్నారు. ఒకవైపు రాహుల్ గాంధీ రాజ్యాంగం పట్టుకుని పెద్ద పెద్ద నీతులు చెబుతుంటే… ఇక్కడ తెలంగాణలో మాత్రం రేవంత్ రెడ్డి పౌరుల రాజ్యాంగ హక్కులను నిస్సిగ్గుగా కాలరాస్తున్నారని విమర్శించారు. ప్రజాస్వామ్యబద్ధంగా యువ సంగ్రామ సదస్సుకు హాజరవ్వకుండా అడ్డుకుంటే… ఈ ప్రభుత్వ అణచివేతకు నిరసనగా తన ఇంట్లోనే ఆమరణ నిరాహార దీక్షకు దిగుతానని ప్రకటించారు.
ఇది కూడా చదవండి..: KTR Youth Sangrama | రేపే ‘యువ సంగ్రామ సదస్సు’.. యువత పెద్దఎత్తున తరలిరావాలి: కేటీఆర్