Ration Shop Benamis | రేషన్ బియ్యంతో డీలర్ల దందా.. ఉమ్మడిజిల్లాలో బినామీలదే రాజ్యం..

ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో కొన్ని రేషన్​ ధరల దుకాణాలు బినామీల చేతుల్లో కొనసాగుతున్నాయి.

shashi kiran Mottala

అక్షరటుడే, డిచ్​పల్లి:  Ration Shop Benamis | ఉమ్మడి నిజామాబాద్ జిల్లా (Nizamabad District)లో కొన్ని చౌక ధరల దుకాణాలు బినామీల చేతుల్లో కొనసాగుతున్నాయి. ముఖ్యంగా పట్టణ ప్రాంతాల్లో డీలర్లు వీటిని ఇతరులకు అప్పగించి నెలవారీగా కమీషన్లు తీసుకుంటున్నారు. దుకాణాలు దక్కించుకున్న బినామీలు బియ్యం పంపిణీలో అక్రమాలకు పాల్పడుతూ.. అందినకాడికి దండుకుంటున్నారు. దందా దర్జాగా కొనసాగుతున్నా.. తనిఖీలు మరిచిన అధికారుల తీరుపై సర్వత్ర అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

 Ration Shop Benamis | రెవెన్యూ అధికారుల అండదండలతో..!

నిజామాబాద్​ జిల్లాలో 760 రేషన్ దుకాణాలు ఉన్నాయి. 4,02,035 రేషన్ కార్డులు ఉండగా.. కామారెడ్డిలో 583 రేషన్​ దుకాణాలు.. 2,53,297 రేషన్​ కార్డులు ఉన్నాయి. పురపాలికలు, పట్టణాల్లో విలీనమైన గ్రామాల్లో పలు రేషన్ దుకాణాలను అనేక చోట్ల బినామీలే నిర్వహిస్తున్నారు. రెవెన్యూ అధికారుల అండదండలతో అనధికార వ్యక్తులు దుకాణాలు నిర్వహిస్తున్నారని ఆరోపణలున్నాయి.

Ration Shop Benamis | నిబంధనలు ఏం చెబుతున్నాయంటే..

రేషన్ డీలర్ మృతి చెందినా.. తొలగించినా, రాజీనామా చేసిన చోట నిర్ణీత ప్రక్రియ ద్వారా కొత్త డీలర్​ను నియమించాలి. గతేడాది జిల్లాలో కొత్తకార్డులు మంజూరు చేశారు. అయితే కార్డులకు అనుగుణంగా దుకాణాలు కేటాయించలేదు. 500 కార్డులకు మించి ఉంటే అదనంగా మరో దుకాణం తప్పనిసరి. కొత్త పంచాయతీల్లో కార్డుల సంఖ్యతో నిమిత్తం లేకుండా చౌకధరల దుకాణం ఏర్పాటు చేయాలి.

 Ration Shop Benamis | అదనపు బాధ్యతలతో ఆపసోపాలు

బియ్యం పంపిణీలో అక్రమాలకు పాల్పడిన వారిపై అధికారులు కేసు నమోదు చేసి ఆ దుకాణ బాధ్యతను సమీప డీలర్​కు (ఇన్​ఛార్జిగా) అప్పగిస్తున్నారు. ఇలా కొందరు డీలర్లు రెండు, మూడు దుకాణాల బాధ్యతలను చేపట్టాల్సి వస్తోంది. దీంతో ఆర్థికంగా బలంగా ఉన్న కొందరు డీలర్లు ఇతరులకు అనధికారికంగా దుకాణాలు అప్పగించి కమీషన్ తీసుకుంటున్నారు. కొన్ని చోట్ల రెవెన్యూ అధికారులు బినామీలకు వేలిముద్రల ఆథరైజేషన్ ఇవ్వడం గమనార్హం.

 Ration Shop Benamis | రాజకీయ ఒత్తిళ్లు..!

ఉమ్మడి జిల్లా పరిధిలోని పల్లెలు, పట్టణాల్లో కార్డుల సంఖ్యకు అనుగుణంగా కొత్త రేషన్ షాపుల ఏర్పాటుకు పాలనా పరమైన, రాజకీయ ఒత్తిళ్లు పెరుగుతున్నాయి. దీంతో అధికారులు వెనుకడుగు వేస్తున్నారు. రెగ్యులర్ డీలర్లు లేని దుకాణాల్లో చాలా వరకు బినామీలే పాగా వేస్తున్నారు. అలాంటి వారిని గుర్తించి కేసు నమోదు చేయాలని గతంలో సర్కారు పౌరసరఫరాలశాఖ అధికారులను ఆదేశించినా.. క్షేత్రస్థాయిలో చర్యలు కనిపించడం లేదు. అక్రమాలకు పాల్పడిన రేషన్ డీలర్లపై చర్యలు తీసుకుంటామని పౌర సరఫరాల అధికారులు చెప్తున్నా ఇందుకు భిన్నంగా మారింది. ఇప్పటికైనా బినామీల రేషన్​దుకాణాలపై చర్యలు తీసుకోవాలని.. లబ్ధిదారులకు ఇబ్బందుల్లేకుండా చూడాలని ప్రజలు కోరుతున్నారు.

ఇది కూడా చదవండి..: Protest Duty Guidelines | నిరసనల సమయంలో సంయమనం పాటించాలి..: ఎస్పీ రాజేష్ చంద్ర

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *