అక్షరటుడే, డిచ్పల్లి: Tribal Development Telangana | రాష్ట్రంలో గిరిజన ప్రాంతాల అభివృద్ధికి సీఎం రేవంత్‌రెడ్డి కృషి చేస్తున్నారని జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి సీతక్క (Minister Seethakka) అన్నారు. ఇందల్వాయి మండలం వెంగల్ పాడ్, తిర్మన్‌పల్లి గ్రామాల్లో రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డితో (MLA Bhupathi Reddy) కలిసి పలు అభివృద్ధి పనులకు మంత్రి శంకుస్థాపన చేశారు.
Tribal Development Telangana | రాంపూర్ తండా నుంచి వెంగల్పాడ్ తండా వరకు..
రాంపూర్ తండా నుండి వెంగల్పాడ్ తండా వరకు రూ.5.48కోట్ల అంచనా వ్యయంతో చేపడుతున్న బీటీ రోడ్డు నిర్మాణానికి, అలాగే కేకే తండా నుండి మెగ్యానాయక్ తండా వరకు రూ. 2.94 కోట్ల వ్యయంతో చేపడుతున్న రోడ్డు నిర్మాణ పనులకు భూమిపూజ చేశారు. అనంతరం తిర్మన్‌పల్లిలో ప్రభుత్వ గిరిజన సంక్షేమ రెసిడెన్షియల్ జూనియర్ కళాశాలలో అదనపు సదుపాయాల కల్పనలో భాగంగా నూతనంగా నిర్మించిన వసతి గృహ భవన సముదాయం, కిచెన్ డైనింగ్ హాల్‌లను లాంఛనంగా ప్రారంభించారు. పాఠశాల ఆవరణలో మొక్కలు నాటారు. అనంతరం మంత్రి సీతక్క మాట్లాడుతూ.. మారుమూల గిరిజన తండాలు, గ్రామాలలో అభివృద్ధి పనుల్లో పాల్గొనడం ఎంతో సంతోషం కలిగించిందన్నారు.
Tribal Development Telangana | విద్యారంగ అభివృద్ధి కోసం..
రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి మాట్లాడుతూ, విద్యారంగ అభివృద్ధి కోసం ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని గుర్తు చేశారు. పిల్లలు చక్కగా చదువుకుని ఉన్నత స్థాయిలో రాణించాలన్నదే సీఎం రేవంత్ రెడ్డి ఆశయమన్నారు. ప్రభుత్వ అభిమతానికి అనుగుణంగా రూరల్ నియోజకవర్గంలో గిరిజన తండాలు, ట్రైబల్ వెల్ఫేర్ విద్యాసంస్థల్లో మౌలిక సదుపాయాలు మెరుగుపరుస్తున్నామని తెలిపారు. కాగా, ఏకధాటిగా వర్షం కురుస్తున్నా లెక్క చేయకుండా స్థానిక ప్రజలు, గిరిజనులు మంత్రికి ఘన స్వాగతం పలికి, ఎంతో ఉత్సాహంగా ఈ కార్యక్రమాల్లో పాల్గొన్నారు.
Tribal Development Telangana | విద్యార్థినులతో కలిసి నృత్యం..
కళాశాల విద్యార్థినులతో కలిసి సంప్రదాయ గిరిజన నృత్యంలో మంత్రి పాల్గొన్నారు. అంతకుముందు పాఠశాల ఆవరణలో మొక్కలు నాటారు. మహిళా సంఘాల సభ్యులకు చెక్కులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమాలలో రాష్ట్ర ఉర్దూ అకాడమీ ఛైర్మన్ తాహెర్ బిన్ హందాన్, అదనపు కలెక్టర్ భుజంగ రావు, రాష్ట్ర వ్యవసాయ కమిషన్ సభ్యుడు గడుగు గంగాధర్, ఐడీసీఎంఎస్ ఛైర్మన్ తారాచంద్ నాయక్, నిజామాబాద్ ఆర్డీవో రాజేంద్ర కుమార్, జిల్లా పంచాయతీ అధికారి శ్రీనివాస్ రావు, నిజామాబాద్ మార్కెట్ కమిటీ ఛైర్మన్ ముప్ప గంగారెడ్డి, కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు నగేష్ రెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మన్ అంతిరెడ్డి రాజిరెడ్డి, తిర్మన్ పల్లి సర్పంచ్ చింతల కిషన్ తదితరులు పాల్గొన్నారు.
ఇది కూడా చదవండి : జూలై 20 పార్లమెంటు వర్షాకాల సమావేశాలు