అక్షరటుడే, వెబ్డెస్క్ : Saddula Bathukamma | పూలను పేర్చి బతుకమ్మను తయారు చేయడం మాత్రమే కాదు.. ఆ బతుకమ్మ చుట్టూ పాట పాడటం, ఆడటం, ఆడపడుచులంతా ఒక్కచోట చేరడం… ఇవన్నీ కలిసిన తెలంగాణ ఆత్మే బతుకమ్మ! తొమ్మిది రోజులుగా తెలంగాణ (Telangana) పల్లెల నుంచి పట్టణాల వరకు ఎంతో సందడిగా సాగిన బతుకమ్మ వేడుకలు… ఇవాళ సద్దుల బతుకమ్మతో ఘనంగా ముగియనున్నాయి.
మొదటి రోజు ఎంగిలి పూల బతుకమ్మతో ప్రారంభమైన ఈ పూల పండుగ… తొమ్మిదో రోజుకు వచ్చేసరికి మరింత వైభవంగా మారుతుంది. ఈ తొమ్మిది రోజుల్లో ప్రతిరోజుకూ ఒక ప్రత్యేకత ఉంటుంది. ఎంగిలి పూల బతుకమ్మ, అటుకుల బతుకమ్మ, ముద్దపప్పు బతుకమ్మ, నానే బియ్యం బతుకమ్మ, అట్ల బతుకమ్మ, అలిగిన బతుకమ్మ, వేపకాయల బతుకమ్మ, వెన్నముద్దల బతుకమ్మ… చివరగా సద్దుల బతుకమ్మ. ఈ 9 రోజుల్లో మహిళలు తంగేడు, గునుగు, బంతి, చామంతి వంటి రకరకాల పూలను సేకరించి… వాటిని అందంగా పేర్చి బతుకమ్మను అలంకరిస్తారు. సాయంత్రం కాగానే ఇంటి దగ్గర నుంచి, కాలనీల్లోని కూడళ్ల వరకు… ఎక్కడ చూసినా బతుకమ్మలే కనిపిస్తాయి. మహిళలు సంప్రదాయ దుస్తుల్లో బతుకమ్మ చుట్టూ చేరి… చప్పట్లు కొడుతూ పాటలు పాడుతూ, కోలాటాలు ఆడుతూ సంబరాలు చేసుకుంటారు.
Saddula Bathukamma | సద్దుల సంబురం
ఈ తొమ్మిది రోజుల వేడుకల్లో చివరి రోజైన సద్దుల బతుకమ్మకు ప్రత్యేకమైన ప్రాధాన్యత ఉంది. ఈ రోజు బతుకమ్మను మిగతా రోజులతో పోలిస్తే మరింత పెద్దగా, అందంగా పేర్చుతారు. అంతేకాదు… గౌరమ్మకు ప్రత్యేకంగా సద్దులు నైవేద్యంగా సమర్పిస్తారు. పులిహోర, దద్ధోజనం, కొబ్బరి అన్నం, నువ్వుల అన్నం వంటి రకరకాల నైవేద్యాలను తయారు చేసి అమ్మవారికి సమర్పిస్తారు. ఆ తర్వాత బతుకమ్మలను తీసుకుని మహిళలంతా కలిసి ఊరేగింపుగా జలాశయాల దగ్గరకు వెళ్తారు. అక్కడ బతుకమ్మలకు ప్రత్యేక పూజలు నిర్వహించి, వాయినాలు ఇచ్చిపుచ్చుకున్న తర్వాత… బతుకమ్మలను నీటిలో నిమజ్జనం చేస్తారు. బతుకమ్మను నీటిలో వదిలే ఆ క్షణం… ఈ పూల పండుగకు ముగింపు మాత్రమే కాదు… మరో ఏడాది మళ్లీ బతుకమ్మ రావాలనే ఆశతో చెప్పే వీడ్కోలు కూడా.
తొమ్మిది రోజుల పాటు పాటలతో, పూలతో, ఆటలతో తెలంగాణను సందడిగా మార్చిన బతుకమ్మ… ఇవాళ సద్దుల బతుకమ్మతో ముగియనుంది. పూలు వాడిపోవచ్చు… పండుగ ముగిసిపోవచ్చు… కానీ బతుకమ్మతో తెలంగాణ ఆడపడుచుల అనుబంధం మాత్రం ప్రతి ఏడాది మరింత అందంగా కొనసాగుతూనే ఉంటుంది. సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు!
దీనిని కూడా చదవండి : ACB Raids | అవినీతి తిమింగలం.. కీసర సీఐ ఇళ్లలో ఏసీబీ సోదాలు