అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Tirupati Aksharabhyasam | తిరుపతిలో బాసర తరహా అన్నప్రాసన, అక్షరాభ్యాసం కార్యక్రమాలకు టీటీడీ (TTD) శ్రీకారం చుట్టింది. టీటీడీ హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో వకుళామాత ఆలయంలో ప్రవేశ పెట్టిన అక్షర గోవిందం-అన్నప్రాశనం కార్యక్రమాన్ని టీటీడీ ఛైర్మన్ ప్రారంభించారు.
తల్లిదండ్రులు తమ పిల్లలకు అక్షరాభ్యాసం, అన్నప్రాసనం కోసం పలు ఆలయాలకు తీసుకు వెళ్తారు. నిర్మల్ జిల్లా (Nirmal District)లో గల బాసర సరస్వతి మాత ఆలయంలో ఏటా లక్షలాది మంది పిల్లలకు అక్షరాభ్యాసం కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఇదే తరహాలో తిరుపతిలో కూడా అక్షరాభ్యాసం, అన్నప్రాశన కార్యక్రమాలు చేపట్టాలని టీటీడీ నిర్ణయించింది. ఈ మేరకు వీటిని శుక్రవారం నుంచి ప్రారంభించింది. దీంతో తిరుమల శ్రీవారిని దర్శించుకున్న భక్తులు తమ పిల్లలకు అక్షరాభ్యాసం, అన్నప్రాశనం సైతం చేయించొచ్చు.
Tirupati Aksharabhyasam | గోవింద నామంతో..
టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడుమాట్లాడుతూ అక్షరాభ్యాసం, అన్నప్రాసనం ప్రతి చిన్నారి జీవితంలోని అత్యంత పవిత్ర సంస్కారాలు అన్నారు. తొలి అక్షరం గోవింద నామంతో మొదలైతే.. విద్యాభ్యాసం దైవానుగ్రహంతో విజయవంతంగా సాగుతుందనే విశ్వాసంతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించామన్నారు. అక్షర గోవిందం కిట్‌ను ఉచితంగా పంపిణీ చేశారు. ఇందులో పలక, బలపాలు, అక్షింతలు, పసుపు, కుంకుమ, శ్రీవారి కంకణం, బెల్లం ఉంటాయి. వీటితో పాటు వేంకటేశ్వరస్వామి, పద్మావతి అమ్మవారు, సరస్వతీదేవి చిత్రపటాలు సైతం ఉంటాయని టీటీడీ ఛైర్మన్ తెలిపారు.
Tirupati Aksharabhyasam | రోజుకు 50 మంది..

అక్షర గోవిందం కార్యక్రమంలో 3 నుంచి 5 ఏళ్ల చిన్నారులు పాల్గొనవచ్చు. మంగళవారం మినహా మిగిలిన అన్ని రోజుల్లో వకుళమాత ఆలయంలో అక్షరాభ్యాసం, అన్నప్రాసన కార్యక్రమాలు నిర్వహిస్తారు. అక్షర గోవిందం కార్యక్రమంలో భాగంగా నిత్యం 50 మంది పిల్లలకు మాత్రమే అవకాశం కల్పిస్తారు. బ్యాచ్‌కు 25 మంది చిన్నారుల చొప్పున రెండు విడతల్లో అక్షరాభ్యాసం చేయిస్తారు. దీని కోసం భక్తులు గంట ముందుగానే వకుళామాత ఆలయానికి రావాలి. అనంతరం అక్కడ తమ పేర్లను రిజిస్టర్ చేసుకోవాలి. చిన్నారుల తల్లిదండ్రులు సంప్రదాయ వస్త్రధారణలో హాజరు కావాలి.
ఇది కూడా చదవండి..: Prashanti Express Robbery | ప్రశాంతి ఎక్స్‌ప్రెస్‌లో దోపిడీ దొంగల హల్చల్