అక్షరటుడే, బోధన్ : Salura Accident | బోధన్ నియోజకవర్గంలోని సాలూర (Salura) మండలంలో విషాదం నెలకొంది. గణేష్ మండపం షెడ్ విప్పుతూ పట్టుతప్పి కింద పడి ఒకరు మృతి చెందారు.
Salura Accident | ఖాజాపూర్ గ్రామంలో..
బోధన్ రూరల్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఖాజాపూర్ గ్రామంలో గణేష్ మండపం కోసం ఏర్పాటు చేసిన షెడ్ కర్రలను విప్పుతున్న క్రమంలో భాస్కర్(19) అనే యువకుడు అకస్మాత్తుగా పైనుంచి కింద పడ్డాడు.
భాస్కర్ తన స్నేహితుడితో కలిసి ఉదయం 10:30 సమయంలో మండపం వద్ద తాళ్లు విప్పుతుండగా ఒక్కసారిగా స్పృహతప్పి కిందపడిపోయాడు. గమనించిన కుటుంబ సభ్యులు, స్థానికులు వెంటనే అతడిని చికిత్స నిమిత్తం బోధన్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
అయితే వైద్యులు పరీక్షించి.. అప్పటికే భాస్కర్ మరణించినట్లు తెలిపారు. చేతికందిన కొడుకు కళ్లముందే విగతజీవిగా మారడంతో తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు. ఈ ఘటనతో గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి.
మృతుడి తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు బోధన్ రూరల్ (Bodhan) పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. మృతదేహాన్ని పంచనామా నిమిత్తం మార్చూరికి తరలించారు.
ఇది కూడా చదవండి: తొలి LNG రైలు ప్రారంభం.. ఇది ఎలా నడుస్తుందో తెలుసా..?