అక్షరటుడే, వెబ్‌డెస్క్: Sangareddy Road Accident | సంగారెడ్డి జిల్లాలో మంగళవారం జరిగిన రెండు వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ఏడుగురు దుర్మరణం చెందగా, పలువురు గాయపడ్డారు. మరోవైపు హైదరాబాద్‌లో విషాద ఘటన చోటుచేసుకుంది. రైల్వే ట్రాక్ వద్ద పనిచేస్తున్న ఓ మహిళ తన రెండేళ్ల కుమారుడిని రక్షించే క్రమంలో రైలు ఢీకొనడంతో ఇద్దరూ మృతి చెందారు.
Sangareddy Road Accident | ట్యాంకర్ ఢీకొని ఐదుగురు..
జహీరాబాద్ మండలం న్యూ సత్వార్ వద్ద మంగళవారం ట్యాంకర్ ఆటోరిక్షాను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఐదుగురు మృతి చెందారు. మరో ఏడుగురు గాయపడ్డారు. క్షతగాత్రులను జహీరాబాద్ ఏరియా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
మృతులు, క్షతగాత్రులు కర్ణాటకలోని బీదర్ జిల్లాకు చెందిన వ్యవసాయ కూలీలుగా గుర్తించారు. ఉపాధి కోసం వారు ఆటోలో జహీరాబాద్, పరిసర ప్రాంతాలకు వెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకున్నట్లు సమాచారం. పొరుగు రాష్ట్రమైన కర్ణాటక నుంచి వ్యవసాయ కూలీలు తరచూ జహీరాబాద్ ప్రాంతానికి పనుల కోసం వస్తుంటారు.
ఈ ఘోర ప్రమాదంపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
Sangareddy Road Accident | మరో ప్రమాదంలో ఇద్దరు..
సంగారెడ్డి జిల్లాలోనే మరో ప్రమాదంలో ఇద్దరు మరణించారు. కోహిర్ మండలం వెంకటాపూర్ క్రాస్‌రోడ్స్ సమీపంలోని జాతీయ రహదారి-65పై ఈ ప్రమాదం జరిగింది.
పోలీసుల వివరాల ప్రకారం.. అదుపుతప్పిన ఓ కారు మొదట డివైడర్‌ను ఢీకొట్టి, అనంతరం అవతలి వైపు వెళ్తున్న వాహనాలను ఢీకొట్టింది. ఈ ఘటనలో నాలుగు వాహనాలు దెబ్బతిన్నాయి. ప్రమాదం కారణంగా జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. దెబ్బతిన్న వాహనాలను తొలగించి ట్రాఫిక్‌ను పునరుద్ధరించారు.
Sangareddy Road Accident | రైలు ఢీకొని తల్లీకుమారుడు..
ఇదిలా ఉండగా హైదరాబాద్‌లో మరో విషాద ఘటన చోటుచేసుకుంది. రైల్వే ట్రాక్ వద్ద పొదలను తొలగిస్తున్న సమయంలో 23 ఏళ్ల మహిళ, ఆమె రెండేళ్ల కుమారుడు రైలు ఢీకొని అసువులు బాసారు.
రైల్వే పోలీసుల కథనం ప్రకారం.. బద్వేల్-శివరాంపల్లి రైల్వే స్టేషన్ల మధ్య రైల్వే ట్రాక్ సమీపంలో మొత్తం 15 మంది కార్మికులు పనులు చేస్తున్నారు. వారిలో అనూష అనే మహిళ ఉంది. ఆమె రెండేళ్ల కుమారుడు తిరునాథ్ సమీపంలో ఆడుకుంటూ రైల్వే ట్రాక్‌పైకి వెళ్లాడు. ఈ క్రమంలో కొడుకును తీసుకోవడానికి అనూష రైల్వే ట్రాక్‌పైకి వెళ్లింది.
అదే సమయంలో ఢిల్లీ హజ్రత్ నిజాముద్దీన్ నుంచి బెంగళూరు యశ్వంత్‌పూర్‌కు వెళ్తున్న కర్ణాటక సంపర్క్ క్రాంతి ఎక్స్‌ప్రెస్ అక్కడికి వచ్చింది. అయితే, రైల్వే ట్రాక్ మలుపులో ఉండటంతో రైలు సమీపించిన విషయాన్ని ఆమె గమనించలేకపోయింది. దీంతో రైలు వారిని ఢీకొని ముందుకు దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో అనూష, ఆమె కుమారుడు తిరునాథ్ అక్కడికక్కడే మృతి చెందారు.
అనూష స్వస్థలం వరంగల్ జిల్లాలోని ఓ గ్రామంగా తెలిసింది. ఉపాధి కోసం హైదరాబాద్‌కు వలస వచ్చి కూలీగా పనిచేస్తున్నట్లు రైల్వే పోలీసులు వెల్లడించారు.