అక్షరటుడే, కామారెడ్డి: Shabbir Ali | కామారెడ్డి (Kamareddy) ప్రభుత్వ బాలుర పాఠశాలను రాష్ట్రంలోనే మోడల్ పాఠశాలగా (Model School) తీర్చిద్దుతామని ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ ప్రకటించారు. పాఠశాల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం రూ.5 కోట్లు మంజూరు చేసిందని తెలిపారు. బుధవారం కామారెడ్డి కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.
Shabbir Ali | కార్పొరేట్ స్థాయిలో..
తాను విద్యాభ్యాసం చేసిన ఈ పాఠశాల అభివృద్ధికి సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) నిధులు మంజూరు చేయడం సంతోషంగా ఉందన్నారు. ప్రభుత్వ పాఠశాలలు కార్పొరేట్ స్థాయిలో ఉండాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని, అందులో భాగంగా బాయ్స్ హైస్కూల్‌లో ఏసీ తరగతి గదులు, డిజిటల్ క్లాస్‌రూమ్స్, సైన్స్, కంప్యూటర్ ల్యాబ్స్, స్మార్ట్ లైబ్రరీ, తాగునీటి సౌకర్యం, క్రీడా మైదానాలు ఏర్పాటు చేస్తామని చెప్పారు. అవసరమైతే తన సొంత నిధులు కూడా ఖర్చు చేసి పనులు త్వరగా పూర్తి చేస్తామని స్పష్టం చేశారు. విద్యతో పాటు క్రీడలు, వైద్యం, సాగునీరు, మౌలిక వసతులకు ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తోందన్నారు.
కామారెడ్డిని ఎడ్యుకేషన్ హబ్‌గా అభివృద్ధి చేసే దిశగా ప్రత్యేక కార్యాచరణ అమలు చేస్తున్నామని తెలిపారు. ఇందిరాగాంధీ స్టేడియాన్ని (Indira Gandhi Stadium) అంతర్జాతీయ ప్రమాణాలతో తీర్చిద్దుతున్నామని, జర్మన్ టెక్నాలజీతో డేలైట్ స్టేడియం ఏర్పాటుకు ఎంఎస్‌ఎన్ ఫార్మా సీఎస్ఆర్ కింద రూ.78 లక్షలు అందిస్తోందని వివరించారు. ప్రభుత్వం కేటాయించిన రూ.9 కోట్లతో 8 లేన్ల అథ్లెటిక్స్ ట్రాక్, నాలుగు టెన్నిస్ కోర్టులు, వాలీబాల్ కోర్టు, యోగా భవన్, ఆధునిక జిమ్, డ్రెస్ చేంజింగ్ రూములు, రైఫిల్ షూటింగ్ రేంజ్ ఏర్పాటు చేస్తున్నామని, త్వరలో స్విమ్మింగ్ పూల్ నిర్మిస్తామన్నారు.
Shabbir Ali | దోమకొండలో రూ.10కోట్లతో ఫైర్‌స్టేషన్..
దోమకొండలో రూ.10 కోట్లతో ఫైర్ స్టేషన్, 50 పడకల ప్రభుత్వ ఆస్పత్రి, తహశీల్దార్ కార్యాలయానికి పరిపాలనా అనుమతులు వచ్చాయని, త్వరలో పనులు ప్రారంభమవుతాయని చెప్పారు. కామారెడ్డి అభివృద్ధిపై సీఎం ప్రత్యేక దృష్టి ఉందని, నిధులు మంజూరు చేస్తున్నారని తెలిపారు. పట్టణంలో ఆధునిక రహదారులు, సెంట్రల్ లైటింగ్, డ్రైనేజీ, తాగునీరు, పార్క్‌లు, జంక్షన్ల సుందరీకరణ, సీసీ రోడ్లు, భూగర్భ మురుగు కాలువలకు ప్రాధాన్యం ఇస్తున్నామన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో రోడ్లు, సీసీ రోడ్లు, అంతర్గత డ్రైనేజీ, వ్యవసాయ విద్యుత్, సాగునీరు, పల్లె ఆరోగ్య కేంద్రాలు, పాఠశాలల ఆధునికీకరణ, అంగన్‌వాడీల బలోపేతం, మహిళా సంఘాల ప్రోత్సాహంపై పని చేస్తున్నామని పేర్కొన్నారు.
Shabbir Ali | పరిశ్రమల స్థాపనకు అనుకూలం..
పరిశ్రమల స్థాపనకు అనుకూల వాతావరణం కల్పించి యువతకు స్థానిక ఉపాధి, నైపుణ్య కేంద్రాల ద్వారా అవకాశాలు ఇస్తామని చెప్పారు. కామారెడ్డి సాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం కోసం కాళేశ్వరం ప్రాజెక్టు పనులు వేగవంతం చేయించేందుకు ముఖ్యమంత్రి, నీటిపారుదల మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిని ఉమ్మడి జిల్లా ఎమ్మెల్యేలతో కలిసి కలుస్తామన్నారు. గత ప్రభుత్వ మార్పుల వల్లే జిల్లాకు నీరు అందలేదని, వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాం నాటి అసలు ప్రణాళిక ప్రకారమే ప్రాజెక్టు పూర్తి చేస్తామని తెలిపారు. విద్య, వైద్యం, సాగునీరు, క్రీడలు, పరిశ్రమలు, మౌలిక వసతులు, యువతకు ఉపాధి, రైతు సంక్షేమం అన్ని రంగాల్లో కామారెడ్డిని రాష్ట్రంలోనే అగ్రగామిగా నిలపడమే తన ధ్యేయమని షబ్బీర్ అలీ పునరుద్ఘాటించారు. ఈ సమావేశంలో జిల్లా గ్రంధాలయ ఛైర్మన్ మద్ది చంద్రకాంత్ రెడ్డి, మున్సిపల్ ఛైర్‌పర్సన్ ఇప్ప ఉమారాణి, పట్టణ అధ్యక్షులు ఐరేని సందీప్, ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షులు భూమని బాలరాజ్, ఎస్టీ సెల్ జిల్లా అధ్యక్షులు రెడ్డి నాయక్, ఆయా మండలాల పార్టీ అధ్యక్షులు రాజా గౌడ్, నౌసిలాల్ నాయక్, నరేందర్ రెడ్డి, అంకం కృష్ణారావు తదితరులు పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి: ఏపీని గంజాయి హబ్‌గా మార్చారు : సీఎం చంద్రబాబు