అక్షరటుడే, వెబ్‌డెస్క్: Telangana Congress BC Politics | తెలంగాణ కాంగ్రెస్ రాజకీయాల్లో మరోసారి కలకలం రేగింది. మంత్రి కొండా సురేఖను మంత్రివర్గం నుంచి తొలగించాలని రేవంత్‌రెడ్డి ప్రభుత్వం నిర్ణయించింది. ఆమె రాజీనామాకు అంగీకరించకపోవడంతో బర్తరఫ్ సిఫార్సును గవర్నర్‌కు పంపినట్లు సీఎంవో వెల్లడించింది. దీంతో కొంతకాలంగా సాగుతున్న కొండా సురేఖ ఎపిసోడ్ కీలక మలుపు తిరిగింది.
ఇది కేవలం ఒక మంత్రి పదవి కోల్పోయిన వ్యవహారంగా చూడాలా? లేక తెలంగాణ కాంగ్రెస్‌లో అధికార కేంద్రీకరణ, పార్టీ క్రమశిక్షణ, వర్గ సమీకరణలు, నాయకుల మధ్య అసమాన రాజకీయ ప్రమాణాలు బయటపడుతున్నాయా? ఇప్పుడు ఇదే ప్రధాన చర్చగా మారింది.
Telangana Congress BC Politics | సుస్మిత వ్యాఖ్యల నుంచి మొదలైన వివాదం
కొండా సురేఖ కుమార్తె కొండా సుస్మిత చేసిన వ్యాఖ్యలు ఈ వివాదానికి నాంది పలికాయి. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని ఉద్దేశించి ఆమె చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్‌లో తీవ్ర దుమారం రేపాయి. అనంతరం పార్టీ క్రమశిక్షణ కమిటీ సురేఖకు నోటీసులు జారీ చేసి వివరణ కోరింది. అయితే సురేఖ తన సమాధానంలో తన కుమార్తె చేసిన వ్యాఖ్యలతో తనకు సంబంధం లేదని, అవి ఆమె వ్యక్తిగత అభిప్రాయాలని స్పష్టం చేశారు. అయినా కూడా ఆమెపై వేటు వేయడంలో చూపించిన అత్యుత్సాహం పార్టీ శ్రేణులను ఆశ్చర్యపరిచింది.
Konda Sushmitha | తెలంగాణ కాంగ్రెస్‌లో కొండా కల్లోలం.. సుష్మిత తిరుగుబాటు వెనుక అసలు కథేంటి?
ఈ నేపథ్యంలో క్రమశిక్షణా చర్యల పేరిట జరిగిన ఈ పరిణామం, కాంగ్రెస్ పార్టీలోని అంతర్గత అసమానతలు, బీసీ నాయకత్వాన్ని తొక్కేసే రాజకీయ వ్యూహాలను మరోసారి బహిర్గతం చేసిందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
Telangana Congress BC Politics | ఉన్నత వర్గాలకు ఒక న్యాయం.. బీసీలకు మరో న్యాయమా?
కాంగ్రెస్ అధిష్ఠానం వ్యవహరిస్తున్న తీరు చూస్తుంటే “పార్టీలో అందరికీ ఒకే చట్టం వర్తించడం లేదు” అనే అభిప్రాయం బలపడుతోంది. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వంటి ప్రభావవంతమైన ఉన్నత వర్గాల నేతలు తరచూ పార్టీ విధానాలు, అధినాయకత్వం, ఆధిపత్య రాజకీయాలపై పదేపదే బహిరంగంగా అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నప్పటికీ వారిపై వివరణలతో సరిపెట్టడం, మౌనం వహించడం బహిరంగ రహస్యం.
ఓ ఉన్నత సామాజిక వర్గానికి చెందిన అగ్రనేతలు ఎంత తీవ్రమైన వ్యాఖ్యలు చేసినా “అంతర్గత ప్రజాస్వామ్యం” అని సరిపెట్టే కాంగ్రెస్ పెద్దలు.. బీసీ వర్గానికి చెందిన బలమైన నేత చిన్న సాకుతో దొరికినా ఏకంగా పదవి నుంచే ఊడగొట్టడం వెనుక స్పష్టమైన పక్షపాతం కనిపిస్తున్నట్లు విమర్శలు వెలువడుతున్నాయి.
Telangana Congress BC Politics | బీసీ నాయకత్వంపై పెత్తందారీ ధోరణి
తెలంగాణ కాంగ్రెస్‌లో మొదటి నుంచీ ఆధిపత్య సామాజిక వర్గాల పెత్తనమే సాగుతోందనే ఆరోపణలు ఉన్నాయి. వరంగల్ జిల్లా రాజకీయాల్లో తనకంటూ బలమైన ఓటు బ్యాంకు, స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన కొండా సురేఖ వంటి బీసీ మహిళా నేత సొంతంగా ఎదగడాన్ని అగ్రవర్ణ నేతలు సహించలేకపోతున్నారనే విమర్శలు ఉన్నాయి.
ప్రభుత్వంలోనూ, పార్టీలోనూ కీలక నిర్ణయాధికారాలన్నీ ఉన్నత వర్గాల చేతుల్లోనే కేంద్రీకృతమై ఉండగా.. బీసీ, బహుజన నేతలను కేవలం ఓటు బ్యాంకు రాజకీయం కోసమే వాడుకుంటున్నారని శ్రేణులు మండిపడుతున్నాయి.
Telangana Congress BC Politics | రేవంత్ మార్క్ రాజకీయం – పర్యవసనాలు
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ చర్య ద్వారా తన అధికార కేంద్రీకరణను చాటుకోవాలని చూసినప్పటికీ, ఇది భవిష్యత్తులో పార్టీకి తీవ్ర నష్టం కలిగించే అవకాశం ఉందనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.
రాష్ట్రంలో మెజారిటీ జనాభాగా ఉన్న బీసీ వర్గాలు తమ ప్రతినిధిపై జరిగిన ఈ వేటును తమపై జరిగిన దాడిగా భావించే ప్రమాదం ఉంది.
పార్టీ కోసం కష్టపడిన బీసీ నేతలను పక్కనబెట్టి, కేవలం అగ్రవర్ణాల నేతల మాటలకే ప్రాధాన్యం ఇస్తే.. రాబోయే రోజుల్లో కాంగ్రెస్ తీవ్ర రాజకీయ పర్యవసనాలను ఎదుర్కోవాల్సి ఉంటుందని అంటున్నారు.
ఒకరి తప్పును భూతద్దంలో చూపి బర్తరఫ్ చేయడం, మరికొందరి తీవ్రమైన తప్పులను ఉదారంగా మన్నించడం కాంగ్రెస్ అంతర్గత ప్రజాస్వామ్యంలోని లోపాలను, బీసీ నేతల పట్ల ఉన్న వివక్షతను స్పష్టంగా ఎత్తిచూపుతోంది.