అక్షరటుడే వెబ్‌డెస్క్: TGSRTC Union Elections | తెలంగాణ ( Telangana ) రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీజీఎస్‌ఆర్టీసీ) గుర్తింపు సంఘం ఎన్నికల నగారా మోగడంతో డిపోల వద్ద రాజకీయ వాతావరణం వేడెక్చింది. కార్మిక సమస్యల పరిష్కారం కోసం జరగాల్సిన ఈ ఎన్నికలు కాస్తా అధికార రాజకీయాలు, అంతర్గత కుమ్ములాటలు, సరికొత్త పొత్తులతో హోరాహోరీ సమరాన్ని తలపిస్తున్నాయి. ముఖ్యంగా ఈ ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ పార్టీ అనుసరిస్తున్న విచిత్ర వైఖరి స్వపక్షంతో పాటు కార్మిక వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
TGSRTC Union Elections | టీడబ్ల్యూయూకి మద్దతు?
దశాబ్దాలుగా కాంగ్రెస్ పార్టీకి నమ్మినబంటుగా ఉన్న అనుబంధ కార్మిక సంఘం ఐఎన్టీయూసీని పక్కనబెట్టి, ఎలాంటి అధికారిక పార్టీ అఫిలియేషన్ లేని ‘తెలంగాణ వర్కర్స్ యూనియన్’ (టీడబ్ల్యూయూ)కి మద్దతు ప్రకటిస్తూ పీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్ గౌడ్ లేఖ విడుదల చేయడం పెద్ద వివాదానికి దారితీసింది. పార్టీ రాజ్యాంగం ప్రకారం గుర్తింపు పొందిన ఐఎన్టీయూసీ ఉండగా, ప్రైవేట్ సంఘానికి పీసీసీ ఎలా మద్దతిస్తుందని ఆ సంఘం నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ మేరకు పార్టీ అధిష్టానానికి రాతపూర్వకంగా ఫిర్యాదు కూడా చేశారు. సీనియర్ నేత మొగుళ్ల రాజిరెడ్డి సొంత అనుబంధ సంఘాన్ని బలహీనపరిచి టీడబ్ల్యూయూను భుజాన ఎత్తుకోవడం వెనుక ఆంతర్యమేంటని కార్మిక శ్రేణులు నిలదీస్తున్నాయి.
TGSRTC Union Elections | పీసీసీ ఒకదారి.. డీసీసీ మరొకదారి..
కాంగ్రెస్ పార్టీ వ్యవహారశైలి క్షేత్రస్థాయిలో తీవ్ర గందరగోళానికి దారితీసింది. రాష్ట్ర అధ్యక్షుడు మహేశ్‌కుమార్ గౌడ్ హైదరాబాద్‌లో టీడబ్ల్యూయూకి మద్దతు ప్రకటిస్తే, ఖమ్మం జిల్లా కాంగ్రెస్ కమిటీ (డీసీసీ) అధ్యక్షుడు నూతి సత్యనారాయణ మాత్రం కాంగ్రెస్ మద్దతు ఐఎన్టీయూసీకేనని బహిరంగంగా ప్రకటించారు. దీంతో అసలు అధికార పార్టీ ఎవరికి మద్దతిస్తుందో తెలియక కార్మికులు అయోమయంలో పడ్డారు. మరోవైపు గత సమ్మెలో కీలకంగా వ్యవహరించి ఆ తర్వాత రాజకీయాల్లోకి వెళ్లిన అశ్వత్థామరెడ్డి.. ప్రస్తుతం టీడబ్ల్యూయూ ప్రధాన కార్యదర్శిగా ఉంటూ సీఐటీయూ అనుబంధ సంఘం ఎస్‌డబ్ల్యుఎఫ్‌తో కలిసి కొత్త పొత్తుకు తెరలేపారు.
TGSRTC Union Elections |జేఏసీ పక్కా వ్యూహం..
ఈ రాజకీయ కలవరపాటు మధ్య కార్మిక ప్రయోజనాలే ధ్యేయంగా ఎంప్లాయీస్ యూనియన్ (ఈయూ- ఈదురు వెంకన్న), తెలంగాణ మజ్దూర్ యూనియన్ (టీఎంయూ- థామస్ రెడ్డి), నేషనల్ మజ్దూర్ యూనియన్ (ఎన్ఎంయూ- కమాల్‌రెడ్డి) ఏకతాటిపైకి వచ్చి బలమైన జేఏసీ కూటమిగా ఏర్పడ్డాయి. రాష్ట్రవ్యాప్తంగా క్లాస్-3 కేటగిరీలో ‘బస్సు’ గుర్తుపై ఈయూ ఉమ్మడిగా పోటీ చేస్తోంది. క్లాస్-6 ఎన్నికల్లో భాగంగా ఖమ్మం, వరంగల్ రీజియన్లలో ఎన్ఎంయూకు సంపూర్ణ మద్దతునిస్తూ మిగతా సంఘాలు తప్పుకున్నాయి.
పదవులు, గుర్తుల కంటే కార్మికుల ప్రయోజనాలే తమకు ముఖ్యమని, అధికార పార్టీ అండతో వస్తున్న స్వార్థ శక్తులను అడ్డుకోవడమే తమ ధ్యేయమని టీఎంయూ నేత థామస్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. క్షేత్రస్థాయిలో కార్మికుల స్పందన తమ కూటమికే ఏకపక్షంగా ఉందని ఆయన పేర్కొన్నారు.
ఇది కూడా చదవండి: Nagaland Spurious Liquor | కల్తీ మద్యం తాగి 19 మంది మృతి