KTR Challenge | 20 లక్షల ఇళ్లు కట్టాకే ఓట్లు అడగండి.. పొంగులేటిపై కేటీఆర్ ఫైర్

Shivam nagarani

అక్షరటుడే వెబ్‌డెస్క్: KTR Challenge | సవాళ్లు విసిరి ఆ తర్వాత పారిపోవడం కాంగ్రెస్ నాయకులకు అలవాటుగా మారిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి చేసిన సవాల్‌పై ఆయన సోషల్ మీడియా వేదిక ‘ఎక్స్’ (ట్విట్టర్) ద్వారా గట్టిగా కౌంటర్ ఇచ్చారు. 20 లక్షల ఇందిరమ్మ ఇళ్లను నిర్మించిన తర్వాతే ప్రజలను ఓట్లు అడుగుతామన్న మంత్రి పొంగులేటి.. ఆ మాట మీద నిలబడే దమ్ముందా అని ప్రశ్నించారు. శపథాలు చేయడం కాదు.. చేతనైతే ఇళ్లు కట్టించి చూపించాలని సవాల్ విసిరారు. 20 లక్షల ఇళ్ల గృహప్రవేశాలు పూర్తయ్యాకే కాంగ్రెస్ నేతలు ప్రజల్లోకి వెళ్లాలని డిమాండ్ చేశారు.

KTR Challenge | పేదల ఆత్మగౌరవాన్ని నిలబెట్టే ఇళ్లు కట్టించాం. ..

గత కాంగ్రెస్ ప్రభుత్వాల మాదిరిగా తాము రూ. 70 వేలతో అగ్గిపెట్టెల్లాంటి డబ్బా ఇళ్లను కట్టలేదని కేటీఆర్ స్పష్టం చేశారు. “బీఆర్ఎస్ హయాంలో నిర్మించిన ఒక్కో డబుల్ బెడ్రూమ్ ఇల్లు.. కాంగ్రెస్ ఇచ్చే 7 ఇందిరమ్మ ఇళ్లతో సమానం. మేం పేదల ఆత్మగౌరవాన్ని నిలబెట్టే ఇళ్లు కట్టించాం. స్వరాష్ట్రాన్ని సాధించడమే కాకుండా, పేదల సొంతింటి కలను నిజం చేసిన ఘనత మా పార్టీదే. ఒక్క హైదరాబాద్‌లోనే లక్ష డబుల్ బెడ్రూమ్ ఇళ్లను నిర్మించాం. కాంగ్రెస్ ప్రభుత్వానికి ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా.. అంతకంటే ఎక్కువ ఇళ్లను నగరంలో నిర్మించి చూపించాలి” అని కేటీఆర్ సవాల్ విసిరారు.

ktr.1 5

 

KTR Challenge | పేదల ఇళ్లను ధ్వంసం చేస్తోంది..

తాము గృహ నిర్మాణ యజ్ఞాన్ని తలపెడితే.. కాంగ్రెస్ ప్రభుత్వం గృహమేధ యాగం చేస్తూ పేదల ఇళ్లను ధ్వంసం చేస్తోందని కేటీఆర్ మండిపడ్డారు. “మేం ఇటుకలు పేర్చి ఇళ్లు కడితే.. ఈ క్రూర కాంగ్రెస్ నేతలు పేదల ఇళ్లపై బుల్డోజర్లు ఎక్కించి కూల్చేస్తున్నారు. వీకెండ్ వచ్చిందంటే చాలు.. సామాన్యుల కొంపలను కూల్చి వికృతానందం పొందుతున్నారు. ఈ రెండున్నరేళ్ల పాలనలో నగరంలో కాంగ్రెస్ ప్రభుత్వం కట్టిన ఇళ్లు ఎన్ని? కూల్చేసిన ఇళ్లు ఎన్ని? దీనిపై శ్వేతపత్రం ప్రకటించే ధైర్యం ఈ ప్రభుత్వానికి ఉందా?” అని నిలదీశారు. గతంలో దీపావళి బాంబులు పేలుస్తామని చెప్పి.. చివరకు తుస్సుమనిపించారంటూ మంత్రి పొంగులేటిని ‘మిస్టర్ బాంబులేటి’, ‘తుపేల్ మినిస్టర్’ అని కేటీఆర్ ఎద్దేవా చేశారు.

ktr.2 1

KTR Challenge | బ్లాక్ మెయిల్ దందాలు చేయడం..

అడ్డదారుల్లో సొంత కొడుకు కంపెనీలకు వేల కోట్ల రూపాయల కాంట్రాక్టులు ఇప్పించుకునే అవినీతి కిటుకులు, అక్రమ క్రషర్లు నడుపుతూ ప్రభుత్వ సొమ్మును కొల్లగొట్టే చిట్కాలు తమకు తెలియవంటూ మంత్రి పొంగులేటిని ఉద్దేశించి కేటీఆర్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రెవెన్యూ శాఖను అడ్డుపెట్టుకుని బ్లాక్ మెయిల్ దందాలు చేయడం, గూండాలను ఉసిగొల్పి సామాన్యుల భూములను లాక్కోవడం, అహంకారంతో బడుగు బలహీన వర్గాల నాయకులపై పేపర్లు విసిరికొట్టడం తమ రక్తంలోనే లేదన్నారు. కాంగ్రెస్ నేతలు ఎన్ని డైవర్షన్ డ్రామాలు ఆడినా.. ఎన్నికల్లో ఇచ్చిన 420 హామీల మోసాలపై తాము పోరాటాన్ని ఆపబోమని స్పష్టం చేశారు. దమ్ముంటే మేనిఫెస్టోలోని ప్రతి వాగ్దానాన్ని అమలు చేస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిజ్ఞ చేయాలని కేటీఆర్ సవాల్ విసిరారు.

 

ఇది కూడా చదవండి: Paddy Transport | కలెక్టర్​ ఆదేశాలతో కదిలిన యంత్రాంగం.. తడిసిన ధాన్యాన్ని తరలిస్తున్న అధికారులు

Follow:
Author Bio: శివం నాగరాణి గత 5 సంవత్సరాలుగా తెలుగు వార్తా రంగంలో పనిచేస్తున్నారు. కందిలి దినపత్రికలో జర్నలిస్ట్‌గా పని చేశారు. ప్రస్తుతం అక్షర టుడే వెబ్‌సైట్‌లో లైఫ్‌స్టైల్, ఆధ్యాత్మికం, ఆరోగ్యం, విద్య, ఉద్యోగాలు, ప్రభుత్వ పథకాలు, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్‌వంటి అంశాలపై వార్తలను అందిస్తున్నారు.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *