అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Kavitha Discom Allegations | రాష్ట్ర ప్రభుత్వం (State Government) రైతు డిస్కం ఏర్పాటు చేసి మిగతా రెండు డిస్కంలను ప్రైవేట్ పరం చేసే కుట్ర పన్నుతోందని టీఆర్ఎస్ అధ్యక్షురాలు కవిత (Kavitha) ఆరోపించారు. ఈ విషయంలో తాము అలాంటి ప్రయత్నాలు చేయడం లేదని ముఖ్యమంత్రి ప్రెస్ మీట్ పెట్టి చెప్పగలరా అని ప్రశ్నించారు. ఉచిత విద్యుత్ తీసేయం, మోటార్లకు మీటర్లు పెట్టబోమని ప్రజలకు స్పష్టతనివ్వాలని డిమాండ్ చేశారు. ఆమె ఆదివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు.
Kavitha Discom Allegations | కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం వత్తాసు
విద్యుత్ సంస్కరణాల్లో భాగంగా కేంద్రం చేపడుతున్న చర్యలకు రాష్ట్ర ప్రభుత్వం వత్తాసు పలుకుతోందని కవిత అన్నారు. రైతులకు సంబంధించి డిస్కం విషయంలో ఈఆర్సీ వారి అభిప్రాయాలు తీసుకోవాలని సూచించారు. రైతులకు నష్టం చేసే ఈ డిస్కంకు ఈఆర్సీ ఎట్టి పరిస్థితుల్లో పర్మిషన్ ఇవ్వొద్దని కోరారు. రైతు డిస్కం (Farmer Discom) గురించి ఆరు నెలల పాటు సీక్రెట్‌గా ఉంచిన తర్వాత నిన్న చిట్ చాట్‌లో సీఎం దాని గురించి మాట్లాడారన్నారు. తెలంగాణ జాగృతి తరఫున కేసు కూడా వేశామని.. పర్మిషన్ ఇస్తే సుప్రీంకు వెళ్లయినా సరే అడ్డుకుంటామని చెప్పారు.
Kavitha Discom Allegations | కేంద్రం నిర్ణయంతో ఆ కంపెనీలకే మేలు
సోలార్ ప్యానెల్స్‌కు సంబంధించి ఇండియాలో బ్యాటరీలు తయారు చేసే కంపెనీలకు అవకాశం అంటూ కేంద్రం చెబుతోందని టీఆర్ఎస్ అధ్యక్షురాలు పేర్కొన్నారు. అలా అయితే ఒక రిలయన్స్, ఒక అదానీ కంపెనీలకు మాత్రమే అవకాశం ఉంటుందన్నారు. చైనా నుంచి ఇంపోర్ట్ చేసుకొని సోలార్ ప్యానెల్స్, బ్యాటరీలు తయారు చేసే చాలా కంపెనీలు ఉన్నాయని వివరించారు. ఆయా కంపెనీలకు చరమగీతం పాడే విధంగా కుట్ర చేస్తున్నారని ఆరోపించారు.
Kavitha Discom Allegations | రైతు వ్యతిరేక విధానాలు
రాష్ట్ర ప్రభుత్వం రైతు వ్యతిరేక విధానాలు అవలంభిస్తోందని కవిత విమర్శించారు. రాష్ట్రంలో రైతు భరోసా రెండు ఎకరాల లోపు వారికే ఇచ్చారన్నారు. రైతు రుణ మాఫీ 30 శాతం మందికి కాలేదని పేర్కొన్నారు. బోనస్ ఎగ్గొట్టే ప్రయత్నం చేస్తున్నారని.. చివరి గింజ వరకు ధాన్యం కొంటామని చెప్పి ఇప్పటికీ సరిగా కొనుగోలు చేయడం లేదన్నారు.
Kavitha Discom Allegations | ఆ ఫిర్యాదులను హైడ్రా పక్కన పెట్టింది..
హైడ్రా (Hydraa) చర్యలను కూడా కవిత తప్పుపట్టారు. పెద్ద వాళ్లను కాపాడుతూ పేద వాళ్లను ఇబ్బంది పెట్టేలా హైడ్రా చర్యలున్నాయని వ్యాఖ్యానించారు. బడా వ్యక్తులు చేసే కబ్జాలపై నేను ఇచ్చిన ఫిర్యాదులను హైడ్రా పక్కన పెట్టిందని ఆరోపించారు.
ఇది కూడా చదవండి..: Employees Health Scheme | ఎంప్లాయిస్ హెల్త్ స్కీమ్‌పై నేడు సీఎం సమీక్ష


