అక్షరటుడే, బీర్కూర్: Cyber Fraud | సైబర్ మోసగాళ్ల బారిన పడి ఓ యువకుడు తన బ్యాంక్ ఖాతా నుంచి డబ్బులు పోగొట్టుకున్నాడు. ఈ ఘటన బీర్కూర్ మండల కేంద్రంలో చోటు చేసుకుంది.
Cyber Fraud | ఆర్టీఏ ఈ చలాన్ పేరుతో మెసేజ్
బాధితుడి కథనం ప్రకారం.. నెల రోజుల క్రితం అతని వాట్సాప్‌కు ఆర్టీఏ ఈ-చలాన్ పేరుతో(RTA e challan scam) ఒక ఏపీకే ఫైల్ లింక్ వచ్చింది. అధికారిక సమాచారం అనుకుని మజ్హర్ అనే యువకుడు ఆ ఫైల్‌ను తన మొబైల్‌లో ఇన్‌స్టాల్ చేసుకున్నాడు. ఆ సమయంలో అతని బ్యాంకు ఖాతాలో డబ్బులు లేవు. అయితే ఇటీవల అతని ఖాతాలో డబ్బులు జమ అయిన తర్వాత విడతల వారీగా రూ.95,100 నగదు వివిధ లావాదేవీల రూపంలో ఖాతా నుంచి మాయమైనట్లు గుర్తించాడు. బ్యాంకు నుంచి డబ్బులు డెబిట్ అయినట్లు మొబైల్‌కు సందేశాలు రావడంతో వెంటనే తన ఖాతాను పరిశీలించగా సైబర్ మోసానికి (online banking fraud) గురైనట్లు తెలుసుకున్నాడు.
Cyber Fraud | బీర్కూర్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు..
దీంతో బాధితుడు బీర్కూర్ పోలీస్ స్టేషన్‌లో(Birkur Police Station) ఫిర్యాదు చేశాడు. ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. మొబైల్‌లో ఇన్‌స్టాల్ చేసిన ఏపీకే ఫైల్ ద్వారా సైబర్ నేరగాళ్లు వ్యక్తిగత, బ్యాంకింగ్ వివరాలను సేకరించి ఈ మోసానికి పాల్పడి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. వాట్సాప్, సోషల్ మీడియా ద్వారా వచ్చే తెలియని లింకులు, ఏపీకే ఫైళ్లు డౌన్‌లోడ్ చేయవద్దని, ప్రభుత్వ శాఖల పేరుతో వచ్చే సందేశాల నిజానిజాలను నిర్ధారించుకోవాలని సూచించారు. అనుమానాస్పద లావాదేవీలు జరిగిన వెంటనే 1930 సైబర్ హెల్ప్‌లైన్‌కు సమాచారం ఇవ్వాలని, సమీప పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయాలని తెలిపారు.
ఇది కూడా చదవండి : Harish Rao Revanth Reddy | హిట్లర్‌కు పట్టిన గతే సీఎం రేవంత్‌కు పడుతుంది : హరీశ్‌రావు
