అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Crop Diversification Delay | ప్రభుత్వం, అధికారులు అందరికి రైతులంటే చులకన అయిపోయారు. వానాకాలం సాగు సీజన్ ప్రారంభ అయినా.. ఇంకా యాసంగి ధాన్యం కొనుగోళ్లు పూర్తి కాలేదు. దీంతో రైతులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. ఈ క్రమంలో తాజాగా ప్రభుత్వం పంట మార్పిడి చేయాలని రైతులకు సూచిస్తోంది.
రాష్ట్రంలో ఈ ఏడాది ఎల్‌నినో (El Niño) ప్రభావంతో వర్షాలు తక్కువగా పడుతాయని వాతావరణ శాఖ అధికారులు నెలల ముందు నుంచే చెబుతున్నారు. అయినా ప్రభుత్వం, వ్యవసాయ అధికారులు ఎలాంటి చర్యలు చేపట్టలేదు. దీంతో అన్నదాతలు ప్రతిసారి లాగే ఎక్కువ మొత్తంలో వరిసాగుకు సిద్ధం అయ్యారు. కొందరు మొక్కజొన్న వేస్తున్నారు. నీరు తక్కువగా ఉన్న రైతులు ఇప్పటికే మొక్కజొన్న విత్తారు. వరి వేసే రైతులు విత్తనాలు కొనుగోలు చేసి తుకాలు సైతం పోశారు. ఈ సమయంలో ప్రభుత్వం పంట మార్పిడి చేయాలని తాజాగా వీడియో రూపొందించి సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.
Crop Diversification Delay | చిత్తశుద్ధి కరువు
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy) ఇటీవల ఓ సభలో మాట్లాడుతూ.. వరి, మక్క సాగుతో ఇబ్బందులు ఎదురు అవుతున్నాయన్నారు. రైతులు ఇతర పంటలు వేయాలని సూచించారు. అయితే క్షేత్రస్థాయిలో అన్నదాతలకు అవగాహన కల్పించేవారు కరువయ్యారు. ప్రస్తుతం సన్నరకం వరి సాగు చేసిన రైతులకు క్వింటాల్‌కు రూ.500 బోనస్ ఇస్తామని ప్రభుత్వం ప్రకటించింది. అయితే పంట మార్పిడిపై చిత్తశుద్ధి ఉంటే ఆ బోనస్ ఇతర పంటలు సాగు చేసే వారికి ఇస్తామని ప్రకటించాలి. అయితే ప్రభుత్వం ఎ లాంటి చర్యలు చేపట్టకుండా కేవలం ప్రకటనలు, వీడియోల ద్వారా అవగాహన కల్పించే యత్నం చేస్తోంది.
Crop Diversification Delay | వ్యవసాయ అధికారులు ఎక్కడ
ప్రస్తుతం యాసంగి ధాన్యం కొనుగోళ్లు ఇంకా సాగుతున్నాయి. వర్షాలు పడుతుండటంతో వడ్లు మొలకలు వస్తున్నాయి. లారీలు రాకపోవడంతో ధాన్యం నెలల తరబడి కొనుగోలు కేంద్రాల్లోనే ఉంది. అయినా వ్యవసాయ అధికారులు, పౌరసరఫరాల అధికారులు నామమాత్రపు చర్యలు తీసుకుంటున్నారు. పంటమార్పిడిపై అవగాహన కల్పించాల్సిన వ్యవసాయ అధికారులు అసలు గ్రామాల్లో కనిపించడం లేదు. మరోవైపు ఎరువుల ధరలు పెరగడం, యూరియా కోసం అన్నదాతలు ఇబ్బందులు పడుతున్నారు. వర్షాలు పడక పంటలు ఎండిపోతే రైతులు తీవ్రంగా నష్టపోతారు. ఈ క్రమంలో అధికారులు స్పందించి ఇప్పుడే చర్యలు చేపట్టాలని పలువురు కోరుతున్నారు.
Crop Diversification Delay | పెట్టుబడికి తిప్పలు
వానాకాలంలో ఎరువుల ధరలు భారీగా పెరిగాయి. మరోవైపు డీజిల్ ధరలు పెరగడంతో ట్రాక్టర్ కిరాయిలు సైతం పెంచారు. దీంతో అన్నదాతలపై అదనపు భారం పడుతోంది. మరోవైపు ధాన్యం కొనుగోళ్లు పూర్తి కాలేదు. ప్రభుత్వం రైతు భరోసా ఎప్పుడు వేస్తుందో సమాచారం లేదు. యాసంగి సీజన్ డబ్బులను మార్చి, ఏప్రిల్‌లో రెండు విడతలుగా వేసిన ప్రభుత్వం రెండు ఎకరాలకు మాత్రమే అందించింది. దీంతో ఈ సీజన్లో రైతు భరోసా ఎప్పుడు వేస్తారో తెలియని పరిస్థితి ఉంది. దీంతో వానాకాలం పెట్టుబడుల కోసం రైతులు బయట అప్పులు చేస్తున్నారు.
— IPRDepartment (@IPRTelangana) June 13, 2026
దీనిని కూడా చదవండి : Medak Tree Removal Dispute | విద్యుత్ వర్సెస్ ఫారెస్ట్ అధికారులు.. చెట్ల తొలగింపు అడ్డుకోవడంతో ఉద్రిక్తత