అక్షరటుడే వెబ్‌డెస్క్: Mahesh Kumar Goud | బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ తెలంగాణ పర్యటన పూర్తిస్థాయిలో విఫలమైందని టీపీసీసీ చీఫ్ మహేశ్( Mahesh Kumar Goud ) కుమార్ గౌడ్ విమర్శించారు. తెలంగాణ రాజకీయ పరిస్థితులపై లేదా ఇక్కడి సంస్కృతి, ఉద్యమ స్ఫూర్తిపై కనీస అవగాహన లేకుండా పర్యటనలు చేస్తున్నారని ఆయన ఎద్దేవా చేశారు.
Mahesh Kumar Goud | సంపన్న వర్గాల కోసమే..
మూడు రోజుల పాటు రాష్ట్రంలో పర్యటించిన నితిన్ నబీన్, రాష్ట్రానికి సంబంధించిన పెండింగ్ ప్రాజెక్టుల గురించి గానీ, అభివృద్ధి గురించి గానీ ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నించారు. కనీసం రెండు వేల మందిని కూడా పోగు చేసుకోలేని స్థాయికి బీజేపీ పడిపోయిందని ఆయన విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం కేవలం సంపన్న వర్గాల కోసమే పని చేస్తోందని, కాళేశ్వరం స్కామ్ వంటి అంశాలపై సీబీఐ దర్యాప్తు ఎందుకు చేయలేదని నిలదీశారు. వికసిత్ భారత్ పేరుతో ప్రజలను మభ్యపెడుతున్నారని, దేశంలో మత చిచ్చు పెట్టాలని చూస్తే తెలంగాణ ప్రజలు సహించరని హెచ్చరించారు.

Mahesh Kumar Goud | కాంగ్రెస్ ప్రభుత్వంపై నమ్మకం..
సోనియా గాంధీ కృషితోనే తెలంగాణ సాధ్యమైందని, రాష్ట్ర ప్రజల గుండెల్లో కాంగ్రెస్ పార్టీకి ప్రత్యేక స్థానం ఉందని మహేశ్ కుమార్ గౌడ్ ధీమా వ్యక్తం చేశారు. అధికారంలోకి వచ్చిన కొద్ది కాలంలోనే 70 వేల ఉద్యోగాలను భర్తీ చేశామని, ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేరుస్తున్నామని ఆయన గుర్తు చేశారు. బీజేపీ ప్రభుత్వం సీబీఐ, ఈడీ , ఎలక్షన్ కమిషన్‌ను తమ అనుబంధ సంస్థల్లా వాడుకుంటోందని ఆయన ఆరోపించారు. రాజ్యాంగ విలువలను తుంగలో తొక్కి ప్రతిపక్ష నాయకులపై కక్షసాధింపు చర్యలకు పాల్పడుతోందని మండిపడ్డారు. ఓటర్ల జాబితా సవరణ పేరుతో కాంగ్రెస్ ఓట్లను తొలగిస్తున్నారని, ఇది ప్రజాస్వామ్యానికి ప్రమాదకరమని అన్నారు.
Mahesh Kumar Goud | సవాళ్లకు సిద్ధం..
కేసీఆర్ ఫామ్ హౌస్‌కు పరిమితం కాగా, ఇతర ప్రతిపక్షాలు కాంగ్రెస్ ప్రభుత్వంపై విష ప్రచారం చేస్తున్నాయని ఆరోపించారు. బీజేపీతో పాటు ఎన్ని పార్టీలు కలిసినా, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏమీ చేయలేవని, తెలంగాణలో తమకు ఎలాంటి ఢోకా లేదని మహేశ్ కుమార్ గౌడ్ స్పష్టం చేశారు.
ఇది కూడా చదవండి: BC JAC Protest | 2న కళాశాలల బంద్‌ను విజయవంతం చేయాలి..