అక్షరటుడే, వెబ్‌డెస్క్: Mobile Anganwadi Centers | చిన్నారులే దేశ సంపద అని మంత్రి సీతక్క (Minister Seethakka) అన్నారు. తెలంగాణ–2047 లక్ష్య సాధనలో నేటి చిన్నారులే కీలక పాత్ర పోషిస్తారని పేర్కొన్నారు.
ఏ ఒక్క చిన్నారికీ అంగన్వాడీ సేవలకు దూరం కాకుండా రాష్ట్ర ప్రభుత్వం మొబైల్ అంగన్వాడీ కేంద్రాలను ప్రారంభిస్తోందని మంత్రి సీతక్క తెలిపారు. ఎంసీఆర్హెచ్ఆర్డీలో కార్మిక శాఖ మంత్రి వివేక్‌తో కలిసి కార్మిక శాఖ సహకారంతో మహిళా, శిశు సంక్షేమ శాఖ రూపొందించిన మొబైల్ అంగన్వాడీ వాహనాన్ని జెండా ఊపి ఆమె ప్రారంభించారు. ఈ వాహనం మేడ్చల్ జిల్లాలోని ఇందిరమ్మ కాలనీలో అంగన్వాడీ సేవలు అందించనుంది.
Mobile Anganwadi Centers | అంగన్వాడీ కేంద్రాలు లేనిచోట్ల..
మంత్రి సీతక్క మాట్లాడుతూ.. ఇప్పటివరకు కేంద్రాలకు వచ్చే చిన్నారులకే పోషకాహారం, ఆరోగ్య సంరక్షణ, ప్రీ-స్కూల్ విద్య, తల్లి శిశు సంక్షేమ సేవలు అందుబాటులో ఉండేవన్నారు. అయితే అంగన్వాడీ కేంద్రాలు లేని ప్రాంతాల్లో నివసించే చిన్నారులు, ముఖ్యంగా పనుల కోసం హైదరాబాద్ వంటి నగరాలకు వలస వచ్చే కార్మికుల పిల్లలు ఈ సేవలకు దూరమవుతున్నారని పేర్కొన్నారు. అలాంటి వారి కోసం మొబైల్ కేంద్రాలను అందుబాటులోకి తీసుకొస్తున్నామని చెప్పారు.
Mobile Anganwadi Centers | వలస కార్మికులు ఉండే ప్రాంతాల్లో..

పోషకాహారం, ఆరోగ్య పరీక్షలు, ఎదుగుదల పర్యవేక్షణ, ప్రీ-స్కూల్ విద్యతో పాటు తల్లి శిశు సంక్షేమానికి సంబంధించిన అన్ని సేవలను ఈ వాహనాల ద్వారా అందిస్తామని మంత్రి వెల్లడించారు. వలస కార్మికులు ఎక్కువగా నివసించే ప్రాంతాలకు ఈ మొబైల్ వాహనాలు నేరుగా వెళ్లి సేవలు అందిస్తాయని పేర్కొన్నారు. ఒక్కో వాహనం దాదాపు పది అంగన్వాడీ కేంద్రాలకు సమానంగా సేవలు అందించే సామర్థ్యాన్ని కలిగి ఉందని, ఒక్కో మొబైల్ అంగన్వాడి కేంద్రం ద్వారా సుమారు 300 మంది లబ్ధిదారులకు సేవలు అందనున్నాయని మంత్రి సీతక్క తెలిపారు.
ఇది కూడా చదవండి..: Retired Teacher Suicide | రిటైర్మెంట్ బెనిఫిట్స్ అందక రిటైర్డ్ టీచర్ ఆత్మహత్య