అక్షరటుడే, నిజామాబాద్ క్రైం: Murder Case Verdict | హత్య కేసులో నిందితుడికి పదేళ్ల కఠిన కారాగార శిక్ష పడింది. ఈ మేరకు నిజామాబాద్ (Nizamabad) జిల్లా న్యాయస్థానం శుక్రవారం తీర్పు వెలువరించింది.
Murder Case Verdict | మెండోరా పోలీస్‌స్టేషన్ పరిధిలో..
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మెండోరా(Mendora) మండలం దూద్‌గావ్ గ్రామానికి చెందిన భాగ్యవతి నివాసానికి ఎదురుగా ఉండే బుచ్చన్న ఇంటి ముందు ఉన్న వేపచెట్టు విషయంలో నాలుగేళ్లుగా వివాదం ఉంది. ఈ క్రమంలో 2022 జూన్ 2వ తేదీన ఉదయం సుమారు 9 గంటల సమయంలో భాగ్యవతి కుమారుడు వసంత్‌తో బుచ్చన్న గొడవకు దిగాడు. వసంత్ తలను గోడకు బుచ్చన్న పలుమార్లు కొట్టగా అతడికి తీవ్ర గాయాలయ్యాయి. ఆ గాయాలకు చికిత్స పొందుతూ బాధితుడు వసంత్ మరణించాడు. బాధితులు అదేరోజు మెండోరా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేశారు. అప్పటి సీఐ గోవర్ధన్ రెడ్డి దర్యాప్తు చేపట్టి నిందితుడిని అరెస్ట్ చేసి, సమగ్ర ఆధారాలను సేకరించి కోర్టులో చార్జ్‌షీట్ దాఖలు చేశారు.
Murder Case Verdict | విచారణ అనంతరం..
విచారణలో ప్రాసిక్యూషన్ సమర్పించిన సాక్ష్యాధారాలు, సాక్షుల వాంగ్మూలాల ఆధారంగా నేరం రుజువైంది. దీంతో 1వ అదనపు జిల్లా సెషన్స్ కోర్టు నిజామాబాద్ న్యాయమూర్తి హరీష నిందితుడు బుచ్చన్నకు పదేళ్ల కఠిన కారాగార శిక్ష, రూ.10,000 జరిమానా విధించారు. జరిమానా చెల్లించని పక్షంలో మరో మూడు నెలల సాధారణ జైలు శిక్ష విధిస్తూ తీర్పు వెలువరించారు. ఈ కేసులో నేరస్థుడికి శిక్ష పడడానికి కృషి చేసినటువంటి సీఐ గోవర్ధన్ రెడ్డి, ఆర్మూర్ రూరల్ సీఐ (అప్పటి) జాన్ రెడ్డి , అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్ నర్సింహా రెడ్డి, కోర్టు లైజనింగ్ ఆఫీసర్ గోవింద్ ఎస్సై, సీహెచ్ మురళీధర్ రాజు ఏఎస్సై, కోర్టు డ్యూటీ ఆఫీసర్స్ ఎం. విషన్ గౌడ్ కానిస్టేబుల్, లక్ష్మణ్ కానిస్టేబుల్, రాజులను సీపీ అభినందించారు.
ఇది కూడా చదవండి: Endowments Department Jobs | దేవాదాయ శాఖలో ఉద్యోగుల నియామకం