అక్షరటుడే, బాన్సువాడ: Banswada Stray Dog Safety | వీధికుక్కలు చిన్నారులపై దాడి చేసిన ఘటనల నేపథ్యంలో బాన్సువాడ (Banswada) పురపాలక సంఘం అప్రమత్తమైంది. పట్టణంలోని పలు ప్రాంతాల్లో చిన్నారుల భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇస్తూ ప్రత్యేక చర్యలను ప్రారంభించినట్లు మున్సిపల్ కమిషనర్ గోపు గంగాధర్ తెలిపారు.
Banswada Stray Dog Safety | పురపాలక సంఘం ఆధ్వర్యంలో..
పురపాలక సంఘం ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి, వీధి కుక్కలను గుర్తించి పట్టుకునే కార్యక్రమాన్ని వేగవంతం చేశారు. ప్రమాదకర ప్రాంతాల్లో జంతు సంరక్షణ నిబంధనలకు అనుగుణంగా చర్యలు తీసుకుంటూ, ప్రజల నుంచి అందుతున్న ఫిర్యాదులను వెంటనే పరిష్కరించేలా ప్రత్యేక పర్యవేక్షణ కొనసాగిస్తున్నట్లు వెల్లడించారు. ఈ సందర్భంగా ప్రజలకు పలు సూచనలు చేశారు. చిన్న పిల్లలను ఒంటరిగా వీధుల్లోకి పంపవద్దని, వీధి కుక్కలను రెచ్చగొట్టేలా ప్రవర్తించకూడదని, కుక్కలు గుంపులుగా సంచరించే ప్రాంతాలకు పిల్లలను వెళ్లనివ్వవద్దని కోరారు. అలాగే ఎక్కడైనా వీధి కుక్కల వల్ల ప్రమాదకర పరిస్థితులు కనిపిస్తే వెంటనే పురపాలక సంఘానికి సమాచారం అందించాలని విజ్ఞప్తి చేశారు. పాఠశాలకు వెళ్లే, తిరిగి వచ్చే సమయంలో పిల్లలతో పాటు పెద్దలు ఉండేలా తల్లిదండ్రులు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
Banswada Stray Dog Safety | ప్రజల సహకారంతోనే..
ప్రజల సహకారంతోనే ఈ సమస్యకు పరిష్కారం సాధ్యమవుతుందని, చిన్నారుల భద్రత ప్రతి ఒక్కరి బాధ్యత అని కమిషనర్ పేర్కొన్నారు. ప్రజలందరూ అప్రమత్తంగా ఉండి పురపాలక సంఘానికి సహకరించాలని కోరారు. బుధవారం వీధి కుక్కల దాడిలో గాయపడిన చిన్నారిని కమిషనర్ గోపు గంగాధర్ పరామర్శించారు. చిన్నారి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకొని, కుటుంబ సభ్యులతో మాట్లాడి ఘటనకు సంబంధించిన వివరాలు తెలుసుకున్నారు. చిన్నారికి అవసరమైన సహాయం అందించేందుకు పురపాలక సంఘం తరఫున తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
ఇది కూడా చదవండి..: Bandaru Ceremony Nizamabad | సర్వ సమాజ్ ఆధ్వర్యంలో ఘనంగా ‘బండారు’ కార్యక్రమం