అక్షరటుడే, ఎల్లారెడ్డి : Pocharam Project | ఇటీవల కురుస్తున్న భారీ వర్షాలకు కామారెడ్డి జిల్లాలోని పోచారం ప్రాజెక్ట్ పొంగిపొర్లుతోంది. ప్రాజెక్ట్ గేట్లపై నుంచి దూకుతున్న వరద, మత్తడిపై నుంచి జాలువారుతున్న జలపాతాలను తిలకించేందుకు పర్యాటకులు భారీగా తరలివస్తున్నారు. స్థానికంగా ‘తెలంగాణ నయాగరా’గా పేరుగాంచిన ఈ ప్రాజెక్టు ప్రస్తుతం ఇతర జిల్లాల పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంటోంది.
హైదరాబాద్, మెదక్, సిద్దిపేట, సంగారెడ్డి, కామారెడ్డి, నిజామాబాద్ జిల్లాల నుంచే కాకుండా చుట్టుపక్కల ప్రాంతాల నుంచి వందల సంఖ్యలో పర్యాటకులు కుటుంబ సమేతంగా వస్తున్నారు. ప్రాజెక్టుపై నుంచి పరుగులు తీస్తున్న నీటిని, పక్కనే ఉన్న చిన్నపాటి జలపాతాల అందాలను సెల్ఫోన్లలో బంధిస్తూ ఆనందాన్ని పంచుకుంటున్నారు. ముఖ్యంగా ఉదయం, సాయంత్రం వేళల్లో పోచారం అందాలు మరింత ఆకట్టుకునేలా ఉంటున్నాయి.
Pocharam Project | పోలీసుల ప్రత్యేక చర్యలు..
వరద ఉధృతి ఎక్కువగా ఉండడంతో ఎలాంటి ప్రమాదాలు జరగకుండా పోలీస్ శాఖ, నీటిపారుదల శాఖ అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. ప్రాజెక్టు వద్దకు ఎవరూ వెళ్లకుండా బారికేడ్లు ఏర్పాటు చేసి, గజ ఈతగాళ్లను, హోంగార్డులను అప్రమత్తంగా ఉంచారు. సెల్ఫీల కోసం ప్రమాదకర ప్రాంతాల్లోకి వెళ్లవద్దని హెచ్చరిస్తున్నారు.
Pocharam Project | 103 ఏళ్ల చారిత్రక కట్టడం..
ఈ ప్రాజెక్టుకు ఎంతో చరిత్ర ఉంది. నిజాం ప్రభుత్వ హయాంలో 1917లో శంకుస్థాపన చేసి, 1922లో రూ.27 లక్షల వ్యయంతో నిర్మించారు. ఇది తెలంగాణ (Telangana)లోనే మొదటి సాగునీటి ప్రాజెక్టు. మంచిప్ప వాగుపై 1.7 కి.మీ పొడవున నిర్మించిన ఈ ప్రాజెక్టు సామర్థ్యం 2.423 టీఎంసీలు కాగా.. పూడిక కారణంగా ప్రస్తుతం 1.82 టీఎంసీలకు నిల్వ సామర్థ్యం పడిపోయింది. దీని ద్వారా కామారెడ్డి, మెదక్ జిల్లాల్లోని సుమారు 10,500 ఎకరాలకు సాగునీరు అందుతోంది. గత ఏడాది ఈ ప్రాజెక్టు తన గరిష్ట వరద సామర్థ్యం 70 వేల క్యూసెక్కులకు రెండింతలకు పైగా అంటే 1.82 లక్షల క్యూసెక్కుల వరదను తట్టుకుని నిలబడి ఇంజినీరింగ్ అద్భుతంగా నిలిచింది.
ఇది కూడా చదవండి..: Sant Namdev Maharaj | భక్తిశ్రద్ధలతో సంత్ నాందేవ్ మహరాజ్ పుణ్యతిథి