అక్షరటుడే, కామారెడ్డి: Journalist Arrests | ఇటీవల జర్నలిస్టుల పేరుతో బెదిరింపులకు పాల్పడుతూ అక్రమంగా డబ్బులు వసూలు చేస్తున్న వారి చిట్టాను జిల్లా పోలీసులు (Kamareddy Police) ఒక్కొక్కటిగా బయటకు తీస్తున్నారు. ఇలాంటి ఘటనలో ఇప్పటికే ఒక జర్నలిస్ట్ జైలు జీవితం గడుపుతుండగా అతనిపై నాలుగు రోజుల క్రితం పీడీ యాక్టు నమోదు చేశారు.
Journalist Arrests | ఆర్టీఐ యాక్ట్ పేరుతో..
తాజాగా జర్నలిస్ట్‌ల పేరుతో బెదిరింపులకు పాల్పడుతూ ఓ మహిళ వద్ద డబ్బులు వసూలు చేసి ఆత్మహత్యకు ప్రేరేపించిన ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను డీఎస్పీ మధుసూదన్ గురువారం మీడియాకు వెల్లడించారు. ఓ శాఖలో పనిచేస్తున్న శిరీష ఆత్మహత్య కేసు దర్యాప్తులో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయన్నారు. ప్రభుత్వ ఉద్యోగం, జీతం, సర్వీస్ వివరాలను ఆర్టీఐ (RTI) ద్వారా సేకరించి, ఉద్యోగం కోల్పోయేలా చేస్తామని బెదిరిస్తూ డబ్బులు డిమాండ్ చేసి మానసికంగా వేధించినట్లు దర్యాప్తులో ఆధారాలు లభించాయని పేర్కొన్నారు. దీంతో కేసును ఆత్మహత్యకు ప్రేరేపణ కోణంలో దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు. ఈ కేసులో ఏ2గా ఇందూరి సిద్దాగౌడ్, ఏ3 లాండే భాస్కర్‌లను గురువారం కామారెడ్డి ప్రాంతంలో పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించగా, నేరానికి సంబంధించిన కీలక విషయాలను వెల్లడించినట్లు తెలిపారు.
Journalist Arrests | పోలీసుల దర్యాప్తులో కీలక విషయాలు..
పోలీసుల దర్యాప్తులో నిందితులు తమను జర్నలిస్టుగా పరిచయం చేసుకొని ప్రభుత్వ ఉద్యోగులు, వ్యాపారులు, రియల్ ఎస్టేట్ వ్యక్తులను లక్ష్యంగా చేసుకున్నట్లు వెల్లడైందన్నారు. వారిపై ప్రతికూల వార్తలు ప్రచురిస్తామని, అధికారులకు ఫిర్యాదులు చేస్తామని, ఉద్యోగాలు పోయేలా చేస్తామని బెదిరించి డబ్బులు డిమాండ్ చేసినట్లు ఆధారాలు లభించాయన్నారు. ఇలాంటి బెదిరింపులు, డబ్బుల వసూళ్లకు సంబంధించి కామారెడ్డి, ఎల్లారెడ్డి, దోమకొండ, గాంధారి, దేవునిపల్లి పోలీస్ స్టేషన్లలో గతంలోనూ పలు కేసులు నమోదైనట్లు దర్యాప్తులో తేలిందని పేర్కొన్నారు. ప్రస్తుత కేసులో కూడా ఇదే విధమైన పద్ధతిలో మహిళపై ఒత్తిడి, బెదిరింపులు, మానసిక వేధింపులకు పాల్పడినట్లు దర్యాప్తులో వెల్లడైందని తెలిపారు. ఈ సమావేశంలో కామారెడ్డి పట్టణ సీఐ నరహరి, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.
ఇది కూడా చదవండి: Banana Tree Vastu | ఇంటి ఆవరణలో అరటి చెట్టు నాటవచ్చా ?.. వాస్తు శాస్త్రం ఏం చెబుతుందంటే..