అక్షరటుడే, వెబ్‌డెస్క్: Eeravathri Anil Criticism | నిజామాబాద్ బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్‌పై కాంగ్రెస్ నాయకుడు, తెలంగాణ మినరల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్ ఈరవత్రి అనిల్ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు.
నోటికొచ్చినట్లు మాట్లాడటం కాదని, కాంగ్రెస్ నేతలపై విమర్శలు చేసే ముందు తాము లేవనెత్తుతున్న ప్రశ్నలకు సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. ఎంపీగా నిజామాబాద్ ప్రజలకు చేసిన సేవలు, రైతుల సమస్యలు, గల్ఫ్ కార్మికుల సంక్షేమంపై అర్వింద్‌ను ప్రశ్నించారు.
డీఎస్ ఎంతో కష్టపడి రాజకీయాల్లో ఎదిగి పీసీసీ పదవికే వన్నె తెచ్చిన నాయకుడని పేర్కొన్న అనిల్.. అలాంటి వ్యక్తి కుమారుడిగా పుట్టి సమాజం సిగ్గుపడేలా మాట్లాడటం సరికాదని వ్యాఖ్యానించారు.
Eeravathri Anil Criticism | రూ.వేల కోట్ల ఆస్తులపైనా ప్రశ్నల వర్షం
అర్వింద్ ఆస్తులపై కూడా అనిల్ పలు ప్రశ్నలు సంధించారు. వేల కోట్ల ఆస్తులు, నెలకు కోట్ల రూపాయల అద్దె ఆదాయం వచ్చే స్థాయికి ఎలా ఎదిగారో ప్రజలకు సమాధానం చెప్పే ధైర్యం ఉందా అని ప్రశ్నించారు.
రాజకీయాల కోసం తన ఆస్తులను సైతం దానం చేసిన నిబద్ధత కలిగిన బీసీ నాయకుడు మహేష్ కుమార్ గౌడ్‌ను విమర్శించే నైతిక అర్హత అర్వింద్‌కు ఎక్కడిదని అనిల్ ప్రశ్నించారు.
గతంలో డీఎస్ హయాంలో బీ-ఫారాలు అమ్ముకున్న చరిత్ర ఉందంటూ అర్వింద్‌పై ఆరోపణలు చేశారు. అవినీతికి సంబంధించిన అంశాలపై చర్చకు సిద్ధమా అని సవాల్ విసిరారు.
Eeravathri Anil Criticism | పసుపు బోర్డు హామీపై ప్రశ్నలు
నిజామాబాద్ ఎంపీగా అర్వింద్ నియోజకవర్గానికి ఏం చేశారో ప్రజలకు వివరించాలని అనిల్ డిమాండ్ చేశారు. పసుపు బోర్డు అంశాన్ని ప్రస్తావిస్తూ.. పసుపు రైతులకు మద్దతు ధర విషయంలో కేంద్రం నుంచి ఏం సాధించారో చెప్పాలని ప్రశ్నించారు.
జిల్లాలో సుమారు రెండు లక్షల మంది గల్ఫ్ కార్మికులు ఉన్నారని పేర్కొంటూ.. వారి సంక్షేమం కోసం కేంద్ర ప్రభుత్వం తరఫున ఒక్క రూపాయి సాయం చేశారా అని నిలదీశారు.
కాంగ్రెస్ ప్రభుత్వం గల్ఫ్ కార్మికుల కుటుంబాలకు రూ.5 లక్షల ఎక్స్‌గ్రేషియా అందిస్తున్న విషయాన్ని ప్రస్తావిస్తూ, ఆ కార్యక్రమాన్ని చూసి ఓర్వలేక విమర్శలు చేస్తున్నారా అని ప్రశ్నించారు.
“పనిచేసే చేతకాక.. రోడ్డుపై పోయే వారిలా చెత్త భాషలో మాట్లాడటం మానుకోండి. విమర్శలు చేయడం కంటే ముందు ప్రజలకు ఇచ్చిన హామీలు, చేసిన పనులపై సమాధానం చెప్పండి” అని అర్వింద్‌ను ఉద్దేశించి ఈరవత్రి అనిల్ ఘాటుగా వ్యాఖ్యానించారు.