అక్షరటుడే, వెబ్‌డెస్క్: Harish Rao BRS Conspiracy | తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్‌కు వెన్నుపోటు పొడిచేందుకు హరీశ్‌రావు కుట్ర పన్నారని ఆరోపించారు.
మెదక్ ఎమ్మెల్యేలతో హరీశ్‌రావు (Harish Rao) ఇటీవల మీటింగ్ పెట్టారని కవిత చెప్పారు. కేటీఆర్‌కు వారసత్వం లేదని, బీఆర్ఎస్ పార్టీ తనకే వస్తదని ఆయన చెప్పారని ఆరోపించారు. మెదక్‌లో అన్ని సీట్లు గెలుచుకొని, బీజేపీతో అగ్రిమెంట్ చేసుకుందామని ఆయన ఎమ్మెల్యేలకు చెప్పారని కవిత అన్నారు. మెదక్ నుంచి బీఆర్ఎస్ను హస్తగతం చేసుకునే కుట్ర చేస్తున్నారని, కేసీఆర్‌కు వెన్నుపోటు పొడవాలని చూస్తున్నారని ఆరోపించారు. హరీశ్‌రావు ఆర్ఎస్ఎస్ పెద్ద మనిషితో పలుమార్లు సమావేశం అయ్యారన్నారు. ఆయన తిన్నింటి వాసాలు లెక్క పెట్టే వ్యక్తి అని విమర్శించారు.
Harish Rao BRS Conspiracy | ఆంధ్ర రేవంత్‌రెడ్డి
కవిత సీఎం రేవంత్‌రెడ్డిపై విమర్శలు చేశారు. అనుముల రేవంత్‌రెడ్డి కాదని, ఆయన ఆంధ్ర రేవంత్ రెడ్డి అని కవిత అన్నారు. బ్రాహ్మణ పరిషత్ కార్పొరేషన్ ఛైర్మన్, వైస్ ఛైర్మన్లుగా ప్రభుత్వం ఆంధ్రకు చెందిన వారిని నియమించారన్నారు. మన తెలంగాణలో ఎంతో మంది పండితులు ఉండగా.. ఆంధ్రకు చెందిన వారికి ఇవ్వాల్సిన అవసరం ఉందని ప్రశ్నించారు. ఛైర్మన్‌గా నియమితులైన వ్యక్తిని బెదిరింపులకు పాల్పడుతున్నారని ఆరోపించారు. వారిని తొలగించాలని కవిత డిమాండ్ చేశారు. ఆంధ్ర ఎంపీ కొడుకు ర్యాష్ డ్రైవింగ్‌తో ఒక యువతి ప్రాణాలు తీస్తే పోలీసులు అతడికి అనుకూలంగా వ్యవహరించారని ఆరోపించారు. గతంలో బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ కుమారుడు బారీకేడ్లను ఢీకొడితే హంగామా చేసిన ప్రభుత్వం.. ప్రస్తుతం ఎంపీ కుమారుడు యువతి ప్రాణాలు తీస్తే ఎందుకు పట్టించుకోవడం లేదని ప్రశ్నించారు.
Harish Rao BRS Conspiracy | ఆంధ్ర పెత్తనం
కాంగ్రెస్ ప్రభుత్వంలో ఆంధ్ర అధికారుల పెత్తనం నడుస్తోందని కవిత విమర్శించారు. సీఎంవో కార్యాలయ ప్రిన్సిపల్ సెక్రెటరీ ఏపీకి చెందిన వారు అన్నారు. ఇరిగేషన్ శాఖలో చాలా మంది ఆంధ్ర అధికారులు ఉన్నారని చెప్పారు. యాదగిరి గుట్ట బోర్డులో ఆంధ్రకు చెందిన నటుడి భార్యను ఎలా మెంబర్‌గా నియమించారని ప్రశ్నించారు. ప్రైవేట్ ఆస్పత్రుల్లో తెలంగాణ నర్సులకు తక్కువ వేతనం, కేరళ నర్సులకు ఎక్కువ జీతాలు ఇస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై ప్రభుత్వం ఎందుకు స్పందించడం లేదని మండిపడ్డారు. రేవంత్‌రెడ్డి ఆంధ్ర ఏజెంట్‌గా మారారని విమర్శించారు.
Harish Rao BRS Conspiracy | క్విడ్ ప్రోకో కేసు పెట్టాలి
ఒడిశా యువతి చనిపోతే బీఆర్ఎస్ సైతం మాట్లాడలేదని కవిత అన్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య ఏం లాలూచీ ఉందని ప్రశ్నించారు. నారాయణ, చైతన్య కాలేజీలపై బీఆర్ఎస్ పార్టీ ఒక్క మాట మాట్లాడదన్నారు. హరీశ్‌రావు ఆ కాలేజీలకు పాలు అమ్ముకుంటారని, అందుకే మాట్లాడరని పేర్కొన్నారు. గుంట నక్కకు, గుంపు మేస్త్రీకి లండన్‌లో లాలూచీ జరిగిందని ఆమె సంచలన వ్యాఖ్యలు చేశారు. హరీశ్‌రావు ఆరోగ్య శాఖ మంత్రిగా ఉన్న సమయంలో నగరంలోని అనేక ఆస్పత్రులకు, కాలేజీలకు ఆయన కంపెనీ ద్వారా పాలు సరఫరా చేశారన్నారు. దీనిపై క్విడ్ ప్రోకో కేసు పెట్టాలని కవిత డిమాండ్ చేశారు. హరీశ్‌రావుతో సీఎం రేవంత్‌రెడ్డికి ఎలాంటి సంబంధం లేకపోతే వెంటనే పాలు సరఫరా చేసే ఒప్పందాన్ని రద్దు చేసి, విజయ డెయిరీ పాలు సరఫరా చేసేలా జీవో విడుదల చేయాలన్నారు.
Harish Rao BRS Conspiracy | బీఆర్ఎస్ అవినీతి
బీఆర్ఎస్ హయాంలో వ్యవస్థీకృతమైన అవినీతి చేశారన్నారు. పాల పేరిట హరీశ్‌రావు, మున్సిపల్ అనుమతులు, రియల్ ఎస్టేట్ పేరిట కేటీఆర్, ఇసుక వ్యాపారంతో మరొకరు అవినీతి చేశారన్నారు. అవినీతి పార్టీ అయిన బీఆర్ఎస్కు కాకుండా కొత్త పార్టీ అయిన తమక అవకాశం ఇవ్వాలని ఆమె కోరారు.
ఇది కూడా చదవండి..: KTR Jindal University | కేటీఆర్‌కు ప్రతిష్ఠాత్మక యూనివర్సిటీ ఆహ్వానం