KTR Congress Criticism | అసమర్థత ప్రోమాక్స్​.. అవినీతి అల్ట్రామాక్స్​.. కాంగ్రెస్​ పాలనపై కేటీఆర్​ సెటైర్లు

కాంగ్రెస్​ పాలనపై బీఆర్​ఎస్​ వర్కింగ్​ ప్రెసిడెంట్​ కేటీఆర్​ విమర్శలు చేశారు. అనేక హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన రేవంత్​ రెడ్డి.. తర్వాత ప్రజలను మోసం చేశారని మండిపడ్డారు.

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్ : KTR Congress Criticism |కాంగ్రెస్​ పాలనపై బీఆర్​ఎస్​ వర్కింగ్​ ప్రెసిడెంట్​ కేటీఆర్​ విమర్శలు చేశారు. అనేక హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన రేవంత్​ రెడ్డి (Revanth Reddy).. తర్వాత ప్రజలను మోసం చేశారని మండిపడ్డారు.

కాంగ్రెస్​ వెయ్యి రోజుల పాలనపై ఆయన బీఆర్​ఎస్​ నాయకులతో కలిసి ఛార్జీషీటు విడుదల చేశారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు దిగజారుతున్నాయని ​ ఆరోపించారు. కాంగ్రెస్​ పాలనలో అసమర్థత ప్రోమాక్స్​.. అవినీతి అల్ట్రామాక్స్​, అరాచకం హైమాక్స్​ అని సెటైర్లు వేశారు. ఎంగిలి విస్తరాకుల దగ్గర కుక్కలు కొట్టుకున్నట్లు.. రాష్ట్ర సంపాదన కోసం మంత్రులు, ముఖ్యమంత్రి తన్నుకుంటున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు.

ప్రజా పాలన అని చెప్పి కాంగ్రెస్​ ప్రభుత్వం ప్రజలను వంచించిందని కేటీఆర్​ అన్నారు. వెయ్యి రోజుల పాటు నిలువెత్తు మోసం చేశారన్నారు. వెయ్యి రోజుల పాలన.. ప్రజల పీడన అన్నారు. తెలంగాణ రాష్ట్రం మీద దరిద్రం దండయాత్ర మొదలు పెట్టి నేటితో వెయ్యి రోజులు అయిందన్నారు. కాంగ్రెస్​ సర్కార్​ సర్వభ్రష్ట ప్రభుత్వం అని విమర్శించారు. ఈ వెయ్యి రోజులు ఒక క్రిమినల్​ వేస్ట్​ అని పేర్కొన్నారు.

KTR Congress Criticism | ఆర్థిక విధ్వంసం

వెయ్యి రోజుల కాంగ్రెస్​ పాలనలో ఆర్థిక విధ్వంసం జరిగిందని కేటీఆర్​ అన్నారు. రైతులను రాచి రంపాన పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. నిరుద్యోగులను నిండా ముంచారని విమర్శించారు. కాంగ్రెస్​ అభయ హస్తం మేనిఫెస్టో ఈ శతాబ్దపు అతి పెద్ద మోసం అని కేటీఆర్​ అన్నారు. 13 డిక్లరేషన్లు, 420 హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చారన్నారు. ఉద్యోగులకు ఉత్త చేతులు చూపారన్నారు. బుల్డోజర్లతో ఇళ్లు కూలుస్తున్నారని, అనుమల అన్నదమ్ములు, పొంగులేటి అనుచరులు భూములు కబ్జా చేస్తున్నారని ఆరోపించారు.

KTR Congress Criticism | సామంతుల పాలన

ఇది ఢిల్లీ ముందు మోకరిల్లిన సామంతుల పాలన అని కేటీఆర్ విమర్శించారు. రైతు భరోసా పేరు చెప్పి అన్నదాతలకు పంగనామాలు పెట్టారన్నారు. ఇలా అన్ని వర్గాలను మోసం చేశారని విమర్శించారు. వెయ్యి రోజుల పాలనలో ప్రతి రంగం ధ్వంసమైందన్నారు. కాంగ్రెస్​ ప్రభుత్వం రూ.4.5 లక్షల కోట్ల అప్పులు చేసిందన్నారు. కానీ కొత్తగా చేసిన పనులు ఏమి లేవని చెప్పారు. కాంగ్రెస్​ నాయకులు పాలన పట్టించుకోకుండా ఆదిపత్యం కొట్లాడుతున్నారని విమర్శించారు.

KTR Congress Criticism | రైతుల ఆత్మహత్యలు

రూ.41 వేల కోట్ల రైతు రుణాలను మాఫీ చేస్తామని చెప్పి.. చివరకు రూ.20 వేల కోట్లు మాత్రమే మాఫీ చేశారన్నారు. దీంతో 65 శాతం మంది రైతులకు మాఫీ రాలేదన్నారు. యూరియా కోసం నేడు రైతులు తిప్పలు పడుతున్నా.. ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. వెయ్యి రోజుల పాలనలో వెయ్యి మందికి పైగా రైతులు ఆత్మహత్య చేసుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

KTR Congress Criticism | ఢిల్లీకి మూటలు..

రాష్ట్రంలో రైతు బంధు బంద్​ అయిందని, రాహుల్​ బంధు చాలు అయిందన్నారు. రైతుల కడుపు కొట్టి రాహుల్ గాంధీకి డబ్బులు పంపుతున్నారని ఆరోపించారు. రాహుల్ గాంధీ జేబులు నింపుతున్న దొంగ రేవంత్​రెడ్డి అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కొత్త డ్యామ్​లు కట్టని ప్రభుత్వం.. మూడు చెక్​ డ్యామ్​లను పేల్చేసిందని విమర్శించారు. సీఎంకు బేషిన్లు తెలియవన్నారు. బూతులు తప్పా.. తెలుగు కూడా సరిగా రాదన్నారు. ఆయనకు చంద్రబాబుకు చెంచాగిరి చేయడం మాత్రం తెలుసని ఎద్దేవా చేశారు.

KTR Congress Criticism | నిరుద్యోగ భృతి ఎక్కడ

రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని మాటా తప్పారని కేటీఆర్​ పేర్కొన్నారు. నిరుద్యోగ భృతి ఏమైందని ప్రశ్నించారు. దీనిపై రాహుల్ గాంధీ మాట్లాడలన్నారు. నాడు ఓట్ల కోసం వచ్చిన రాహుల్​ .. ఇప్పుడు తెలంగాణకు ఎందుకు రావడం లేదన్నారు. ఫీజు రీయింబర్స్​మెంట్​ బకాయిలు ఇవ్వడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. బకాయిలు అడుగుతున్న కాలేజీలపై బెదిరింపులకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. మరోవైపు జీవో 97 పేరిట పాలిటెక్నిక్​ విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సీఎం రేవంత్​రెడ్డి వ్యాకరణ దోషాలు లేకుండా ఒక్క పేపర్​ రాస్తే తాము అందరం రాజీనామా చేస్తామని సవాల్ చేశారు.

ఇది కూడా చదవండి..: Cheyutha Pension Scheme | ‘చేయూత’కు గడుపు పొడిగింపు.. లబ్ధిదారులకు ఊరట..

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *