అక్షరటుడే వెబ్డెస్క్: Telangana BJP Politics | కాంగ్రెస్ నాయకులు బీజేపీ కార్యాలయాలు, నేతల ఇళ్లపై దాడులకు తెగబడటం హేయమైన చర్యని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు ( Ramachandra Rao )తీవ్రంగా మండిపడ్డారు. యాదాద్రి భువనగిరి జిల్లాలోని హోటల్ వివేరాలో మీడియాతో మాట్లాడిన ఆయన.. తప్పుడు కేసులకు, దాడులకు బీజేపీ కార్యకర్తలు ఎప్పటికీ భయపడరని స్పష్టం చేశారు. నల్లగొండ జిల్లాలో ఏకంగా జిల్లా పార్టీ అధ్యక్షుడి తల్లిపై దాడి చేయడం అత్యంత సిగ్గుచేటని ఆగ్రహం వ్యక్తం చేశారు.
Telangana BJP Politics | వెస్ట్ బెంగాల్ తరహా పాలన..
తెలంగాణను కాంగ్రెస్ ప్రభుత్వం పశ్చిమ బెంగాల్ మాదిరిగా మారుస్తోందని, ప్రజాస్వామ్య విరుద్ధంగా బీజేపీపై దాడులకు పాల్పడుతోందని రామచంద్రరావు ఆరోపించారు. బెంగాల్లో ఏవిధంగా పోరాడి అధికారంలోకి వచ్చామో, తెలంగాణలోనూ అదే రీతిలో కాంగ్రెస్ను ఎదురించి అధికారంలోకి వస్తామని ధీమా వ్యక్తం చేశారు.
Telangana BJP Politics | బ్రదర్స్ అండ్ కంపెనీ’పాలన ..
వెయ్యి రోజుల పాలనలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఏమీ చేయలేకపోయిందని, మిగిలిన 750 రోజుల్లో మాత్రం ఏం అభివృద్ధి చేస్తుందని ప్రశ్నించారు. దళితులు ఆరాధ్య దైవంగా భావించే సంత్ రవిదాస్ చిత్రపటంపై నల్లరంగు పూయడాన్ని తీవ్రంగా ఖండించారు. రాష్ట్రంలో ప్రస్తుతం కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ రాజకీయం నడుస్తోందని చెప్పారు. గతంలో పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో ‘ఫ్యామిలీ అండ్ కంపెనీ’ రాజ్యం నడవగా, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో ‘బ్రదర్స్ అండ్ కంపెనీ’ పాలన సాగుతోందని రామచంద్రరావు ఎద్దేవా చేశారు. ఈ సమావేశంలో మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్, బీజేపీ జిల్లా అధ్యక్షుడు ఉట్కూరి అశోక్ తదితరులు పాల్గొన్నారు.
ఇది కూడా చదవండి: Cheyutha Pension Scheme | ‘చేయూత’కు గడుపు పొడిగింపు