Kavitha Revanth Reddy | నేను బహుజనుల బాణాన్ని.. కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు

తెలంగాణలో ప్రస్తుత రాజకీయ తీరుపై తెలంగాణ రక్షణ సేన (TRS) చీఫ్ కల్వకుంట్ల కవిత తీవ్రస్థాయిలో మండిపడ్డారు.

Shivam nagarani

అక్షరటుడే వెబ్‌డెస్క్: Kavitha Revanth Reddy | తెలంగాణలో ప్రస్తుత రాజకీయ తీరుపై తెలంగాణ రక్షణ సేన (TRS) చీఫ్ కల్వకుంట్ల కవిత తీవ్రస్థాయిలో మండిపడ్డారు. నారాయణపేట జిల్లా కోస్గి నియోజకవర్గ పరిధిలో నిర్వహించిన ‘పాంచజన్య సంకల్ప సభ’లో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొని ప్రభుత్వ వైఫల్యాలపై ధ్వజమెత్తారు. రాష్ట్రంలో రాజకీయం అంటే కేవలం బూతులు తిట్టుకోవడమేనా అని ఆమె ప్రశ్నించారు. సమాజంలో అధర్మం పెచ్చుమీరి, పాలకుల వల్ల ప్రజలు ఇబ్బందులు పడినప్పుడు శ్రీకృష్ణుడు పాంచజన్యం పూరించి ధర్మపోరాటానికి సిద్ధం కావాలని సందేశం ఇస్తాడని తెలిపారు. నేడు రాష్ట్రంలో అరాచకాలు పెరిగిపోయాయని, అందుకే తెలంగాణ రక్షణ సేన కోస్గి వేదికగా ధర్మ యుద్ధానికి శ్రీకారం చుట్టిందని స్పష్టం చేశారు. ప్రభుత్వ తప్పులను ప్రశ్నిస్తే ఎదురుదాడికి దిగడం కాంగ్రెస్ పార్టీకి నైజంగా మారిందని, ఈ ప్రభుత్వాన్ని గద్దె దించే సమయం ఆసన్నమైందని ఆమె హెచ్చరించారు.

Kavitha Revanth Reddy | రైతుల గోసపై కంటతడి..

సీఎం రేవంత్ రెడ్డికి రైతులకు సాగునీరు అందించాలనే ఆలోచనే లేదని కవిత తీవ్రంగా ఆరోపించారు. రాష్ట్రంలో నీళ్లు, యూరియా, ధాన్యం కొనుగోళ్ల కోసం రైతన్నలు అధికారుల కాళ్లు పట్టుకోవాల్సిన దుస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు. మొన్నటికి మొన్న పాలమూరు రైతులు తప్పనిసరి పరిస్థితుల్లో జూరాల హెడ్ రెగ్యులేటర్‌ను పగులగొట్టి మరీ నీళ్లను విడుదల చేసుకోవాల్సి వచ్చిందని గుర్తుచేశారు. వరి, మొక్కజొన్న రైతులు తమ పంటను కొనుగోలు చేయమని వేడుకుంటున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. రాష్ట్రంలో మళ్లీ తెలంగాణను ఆత్మహత్యల అడ్డగా మారుస్తారా అని ప్రశ్నించారు.

Kavitha Revanth Reddy | విద్యపై భారీ హామీలు..

తమ పార్టీ అధికారంలోకి వస్తే ప్రజలందరికీ పూర్తిగా ఉచితంగా వైద్యం అందిస్తామని కవిత భరోసా కల్పించారు. విద్య, వైద్య రంగాల అభివృద్ధి కోసం లక్ష కోట్ల రూపాయలైనా సరే వెనుకాడకుండా ఖర్చు చేస్తామని హామీ ఇచ్చారు. పాలమూరు ప్రాంతంలో 10 లక్షల ఎకరాలకు సాగునీరు అందించి తీరుతామని పేర్కొన్నారు. సమాజంలో బాధ్యత లేని నాయకులు పాలన సాగిస్తున్నప్పుడు, యువత బలమైన నాయకులుగా రాజకీయ రంగ ప్రవేశం చేయాలని పిలుపునిచ్చారు.

Kavitha Revanth Reddy | ‘నేను ఎవరి బాణాన్ని కాదు..

తాను కాంగ్రెస్ విడిచిన బాణమని బీఆర్ఎస్ నేతలు, అలాగే కల్వకుంట్ల కుటుంబం అవినీతి పేరుతో తాను బీఆర్ఎస్ విడిచిన బాణమని సీఎం రేవంత్ రెడ్డి ప్రచారం చేస్తూ తమపై కుట్ర పన్నుతున్నారని కవిత మండిపడ్డారు. తాను ఎవరికీ వత్తాసు పలికే బాణాన్ని కాదని, కేవలం ‘తెలంగాణ బహుజనుల బాణాన్ని’ అని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ప్రసిద్ధ ప్రజా గాయకుడు గద్దర్ ఆలపించిన ‘భలేగుందిరో మన అసెంబ్లీ’ పాటలోని చరణాలను ఆమె స్వయంగా పాడి నాయకులు, కార్యకర్తల్లో జోష్ నింపారు. ప్రజలంతా ఏకమై తెలంగాణ రక్షణ సేనను ఆశీర్వదిస్తే, రాష్ట్రంలోని ప్రతి సమస్యను పరిష్కరించడానికి తాము ముందుంటామని కవిత పిలుపునిచ్చారు.

ఇది కూడా చదవండి: Nizamabad Softball Champions | రాష్ట్ర సబ్ జూనియర్ సాఫ్ట్‌బాల్ విజేతగా నిజామాబాద్

Follow:
Author Bio: శివం నాగరాణి గత 5 సంవత్సరాలుగా తెలుగు వార్తా రంగంలో పనిచేస్తున్నారు. కందిలి దినపత్రికలో జర్నలిస్ట్‌గా పని చేశారు. ప్రస్తుతం అక్షర టుడే వెబ్‌సైట్‌లో లైఫ్‌స్టైల్, ఆధ్యాత్మికం, ఆరోగ్యం, విద్య, ఉద్యోగాలు, ప్రభుత్వ పథకాలు, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్‌వంటి అంశాలపై వార్తలను అందిస్తున్నారు.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *