అక్షరటుడే వెబ్‌డెస్క్: KCR Farmhouse Land | మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఫామ్‌హౌస్ పరిసర ప్రాంతాల్లోని భూములపై రెవెన్యూ శాఖ అధికారులు సమగ్ర విచారణ, సర్వేను వేగవంతం చేశారు. ఆదివారం సెలవు రోజు కావడంతో నిలిచిపోయిన సర్వే.. సోమవారం ఉదయం నుంచి యథావిధిగా కొనసాగుతోంది. ముఖ్యంగా ఎర్రవల్లితో పాటు దాని శివారు గ్రామాలైన వెంకటపూర్, వరదరాజుపూర్ సరిహద్దుల పరిధిలోని సర్వే నంబర్ 325లో ఉన్న ప్రభుత్వ, అసైన్డ్ భూములపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు.
KCR Farmhouse Land | ఆధునిక టెక్నాలజీతో ..
గజ్వేల్ ఆర్డీఓ చంద్రకళ, అసిస్టెంట్ డైరెక్టర్ సుదర్శన్ రాథోడ్, డిప్యూటీ ఇన్స్పెక్టర్ శేవ్యానాయక్, మర్కూక్ తహసీల్దార్లతో కూడిన ప్రత్యేక రెవెన్యూ బృందాలు ఈ సర్వేను నిర్వహిస్తున్నాయి. పాత రెవెన్యూ రికార్డులు, శాటిలైట్ మ్యాపింగ్, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి భూముల సరిహద్దులను సరిచూస్తున్నారు. సుమారు 388 ఎకరాల విస్తీర్ణం ఉన్న ఈ సర్వే నంబర్లో.. అసైన్డ్ భూములు ఎంత మేర ఉన్నాయి, ప్రస్తుతం అవి ఎవరి ఆధీనంలో ఉన్నాయి, ప్రైవేట్ పట్టా భూములు ఎంత శాతం ఉన్నాయనే కోణంలో లోతుగా పరిశీలిస్తున్నారు. ఈ ప్రాంతంలో భూములున్న సుమారు 100 మందికి పైగా రైతులకు ముందస్తు నోటీసులు జారీ చేసి, పాస్‌పుస్తకాలు ఇతర యాజమాన్య పత్రాలతో రావాలని ఆదేశించారు.
KCR Farmhouse Land | రాజకీయంగా ప్రాధాన్యత..
శాసనసభలో ఫామ్‌హౌస్ పరిసర భూముల కేటాయింపులు, ధరణి పోర్టల్ నమోదుల్లో అవకతవకలు జరిగాయని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ( Revanth Reddy ) విచారణకు ఆదేశించడంతో ఈ ప్రక్రియ తెరపైకి వచ్చింది. సర్వే పూర్తయిన వెంటనే అధికారులు సమగ్ర నివేదికను ప్రభుత్వానికి అందజేయనున్నారు. ఒకవేళ ప్రభుత్వ లేదా అసైన్డ్ భూములు ఆక్రమణకు గురైనట్లు రుజువైతే, వాటిని చట్టపరంగా స్వాధీనం చేసుకుని అర్హులైన పేదలకు పంపిణీ చేస్తామని అధికారులు వెల్లడించారు. ఈ పరిణామం స్థానికంగా ప్రాధాన్యత సంతరించుకుంది.
ఇది కూడా చదవండి: Konda Laxman Bapuji | యువత కొండా లక్ష్మణ్ బాపూజీ స్ఫూర్తితో ముందుకు సాగాలి