అక్షరటుడే వెబ్‌డెస్క్: Revanth Reddy Delhi Tour | తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రెండు రోజుల ఢిల్లీ పర్యటన నిమిత్తం శంషాబాద్ విమానాశ్రయం నుంచి ఇవాళ ఉదయం హస్తినకు పయనమయ్యారు. ఈ పర్యటనలో ఆయన పలు కీలక రాజకీయ, పరిపాలనా సంబంధిత కార్యక్రమాల్లో బిజీగా గడపనున్నారు. శంషాబాద్ నుంచి బయలుదేరిన సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ, రేపు రెండు రోజుల పాటు ఢిల్లీలోనే ఉండనున్నారు. ఈ పర్యటనలో భాగంగా ఆయన అధికారిక కార్యక్రమాలతో పాటు పార్టీ పరమైన అత్యున్నత స్థాయి సమావేశాల్లో పాల్గొననున్నారు.
Revanth Reddy Delhi Tour | కాంక్లేవ్‌లో సీఎం ప్రసంగం..
ఇవాళ సాయంత్రం 5:30 గంటలకు అసోంకు చెందిన ఓ ప్రముఖ టీవీ, పత్రికా సంస్థ నిర్వహించబోయే జాతీయ స్థాయి కాంక్లేవ్ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించనున్నారు. రేపు అత్యంత ప్రతిష్టాత్మకంగా జరగనున్న కాంగ్రెస్ పార్టీ అత్యున్నత నిర్ణయాధికార కమిటీ (CWC) సమావేశానికి సీఎం హాజరుకానున్నారు. ప్రస్తుతం కేంద్ర ఎన్నికల కమిషన్ పనితీరు, ఎస్‌ఐఆర్ (SIR) వివాదంపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతున్న నేపథ్యంలో ఈ సమావేశానికి ప్రాధాన్యత సంతరించుకుంది. ఈసీ తీరుపై వెల్లువెత్తుతున్న అభ్యంతరాలు, పార్టీ అనుసరించాల్సిన వ్యూహాలపై ఈ భేటీలో కూలంకషంగా చర్చించనున్నారు.
Revanth Reddy Delhi Tour | మంత్రివర్గ విస్తరణపై టెన్షన్..
ఈ పర్యటనలో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి ఏఐసీసీ పెద్దలతో ప్రత్యేకంగా భేటీ కానున్నారు. రాష్ట్రంలో ప్రభుత్వ పనితీరు, సంక్షేమ పథకాల అమలుతో పాటు నామినేటెడ్ పదవుల భర్తీ, మంత్రివర్గ విస్తరణ, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థుల ఖరారుపై హైకమాండ్‌తో చర్చించే అవకాశం ఉంది. దీంతో కాంగ్రెస్ శ్రేణుల్లో, ఆశావహుల్లో ఉత్కంఠ నెలకొంది.
Revanth Reddy Delhi Tour | కేంద్ర మంత్రులతో భేటీ..
కేవలం రాజకీయ అంశాలకే పరిమితం కాకుండా, రాష్ట్ర సంక్షేమంపై కూడా సీఎం దృష్టి సారించారు. ఈ టూర్‌లో పలువురు కేంద్ర మంత్రులను కలిసి రాష్ట్రానికి రావాల్సిన పెండింగ్ నిధులు, విభజన హామీలు, వివిధ ప్రాజెక్టుల అనుమతులపై విజ్ఞప్తి చేయనున్నట్లు సమాచారం.
ఇది కూడా చదవండి: Ujjain Shahi Masjid | రోడ్డు విస్తరణలో మసీదు కూల్చివేతకు యత్నం.. ఉజ్జయినిలో ఉద్రిక్తత