అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Indian Roller Bird | దసరా రోజు పాలపిట్టను చూస్తే మంచి జరుగుతుందని ప్రజలు నమ్ముతారు. దీనిని ఆసరాగా చేసుకొని కొందరు పాలపిట్టలను పంజరాల్లో బంధించి.. ప్రజలకు చూయించే ప్రయత్నం చేశారు. అలాంటి వారిపై హైదరాబాద్ పోలీసులు కఠిన చర్యలు తీసుకున్నారు.
రాష్ట్ర పక్షి అయిన పాలపిట్టను బంధించడం నేరమని అటవీ శాఖ అధికారులు ముందుగానే అవగాహన కల్పించారు. అయినప్పటికీ నగరంలో కొందరు పాలపిట్టను బంధించి ప్రదర్శనకు ఉంచారు. ప్రజల నుంచి డబ్బులు తీసుకొని పాలపిట్ట చూపెట్టారు. ఈ మేరకు సమాచారం అందుకున్న పోలీసులు అటవీ శాఖ అధికారులతో కలిసి దాడులు చేపట్టి పాలపిట్టలను రక్షించారు. లంగర్ హౌజ్, ఛత్రిణాక, మంగళహాట్ ప్రాంతాల్లోని ఆలయాల సమీపంలో దాడులు చేసి, పాలపిట్టలను అటవీ శాఖ అధికారులకు అప్పగించారు.
Indian Roller Bird | నాలుగు పక్షులను..
లంగర్ హౌజ్‌లోని బాపూఘాట్ సమీపంలో ఉన్న ఒక ఆలయం వద్ద రెండు పాలపిట్టలను పంజరాల నుంచి రక్షించారు. ఛత్రిణాకలోని శ్రీ చిత్రగుప్త స్వామి ఆలయం సమీపంలో చెట్టుకు వేలాడదీసిన పంజరంలో మరో పక్షిని గుర్తించారు. మంగళహాట్‌లోని బాలాజీ నగర్‌లో ఉన్న ఒక ఆలయం వద్ద పంజరం నుంచి మరో పక్షిని రక్షించారు. నగర కమిషనర్ సజ్జనార్ (CP Sajjanar) మాట్లాడుతూ.. పంజరంలో బంధించిన పాలపిట్టతో శుభం కలగదన్నారు. పక్షులను బంధించి ఉంచిన వారిపై అటవీ శాఖతో సమన్వయం చేసుకుని చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. మూగప్రాణుల స్వేచ్ఛను హరిస్తూ, కాసుల వేటకు తెరలేపే ఇలాంటి పోకడలను ఎవరూ ప్రోత్సహించొద్దని ఆయన కోరారు.
Indian Roller Bird | పీసీసీ చీఫ్ సైతం..
పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ దసరా సందర్భంగా పాలపిట్టను ఎగుర వేశారు. ఈ మేరకు ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పంజరంలో బంధించిన పాలపిట్టను ఆయన ఎగురవేశారు. ఆయన కోసం పక్షిని బంధించారని పలువురు విమర్శలు చేస్తున్నారు. మరి పీసీసీ చీఫ్‌పై పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకుంటారని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు.
దీనిని కూడా చదవండి : Delhi High Court Protest | పాలన మార్పు ఎందుకు కోరుకుంటున్నారు?.. సీజేపీ నేతలకు ఢిల్లీ హైకోర్టు షాకింగ్ ప్రశ్నలు