అక్షరటుడే, కామారెడ్డి: Kamareddy Child Kidnapping | కామారెడ్డి (Kamareddy) పట్టణంలో నెల రోజుల క్రితం రెండేళ్ల బాలుడు కిడ్నాప్‌నకు గురయ్యాడు. గణేష్ ఉత్సవాల సందర్భంగా తల్లిదండ్రులతో వచ్చిన బాలుడు కిడ్నాప్ కావడంతో తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు. తాజాగా నిందితులను అరెస్ట్ చేసినట్లు సమాచారం.
Kamareddy Child Kidnapping | సాంకేతిక పరిజ్ఞానంతో..
సీసీ కెమెరాలు, ఇతర సాంకేతిక పరిజ్ఞానం ద్వారా పోలీసులు వివరాలు సేకరించి నమ్మదగిన సమాచారం మేరకు రామారెడ్డి పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ గ్రామంలో బాలుడిని దాచినట్టుగా గుర్తించారని సమాచారం. ఇంట్లోని ఓ గదిలో తాళం వేసి ఉండగా అందులో ఉన్న బాలుడిని బయటకు తీసుకువచ్చి భార్యాభర్తలను అడగగా పొంతన లేని సమాధానం చెప్పినట్లుగా తెలిసింది. అదేరోజు బాలుడిని తీసుకొచ్చిన పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లుగా సమాచారం.
Kamareddy Child Kidnapping | పెంచుకోవడానికేనా..?
ఈ కిడ్నాప్‌నకు కారణం ఏమిటో ఇంకా తేలలేదు. అయితే బాలుడిని పెంచుకోవడం కోసం కిడ్నాప్ చేశారన్న ప్రచారం బయట సాగుతోంది. పోలీసుల విచారణలో అసలు కారణం తేలుతుందని పోలీసు వర్గాలు చెబుతున్నాయి. ఈ కేసులో ఇంకా ఎవరెవరి పాత్ర ఉందోనని పోలీసులు లోతుగా విచారణ చేపడుతున్నట్టుగా సమాచారం. ఈ విషయమై కామారెడ్డి డీఎస్పీ మధుసూదన్‌ను వివరణ కోరగా బాలుడి కిడ్నాప్ విషయంలో విచారణ కొనసాగుతుందన్నారు. బాలుడిని పెంచుకోవడం కోసమే తీసుకెళ్లినట్టుగా తెలుస్తుందన్నారు. విచారణ కొనసాగుతుందని, త్వరలో పూర్తి వివరాలు వెల్లడిస్తామని పేర్కొన్నారు.
ఇది కూడా చదవండి..: Bigala Ganesh Gupta | ఘనంగా మాజీఎమ్మెల్యే బిగాల అమ్మమ్మ 100వ జన్మదినోత్సవం