అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Harish Rao | తెలంగాణను సర్వనాశనం చేసిందే కాంగ్రెస్ అని మాజీ మంత్రి హరీశ్ రావు అన్నారు. తెలంగాణ భవన్లో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు.
సీఎం రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy) కృష్ణ జలాలపై సోమవారం మీడియాతో మాట్లాడిన విషయం తెలిసిందే. దీనిపై తాజాగా హరీశ్ రావు కౌంటర్ ఇచ్చారు. తెలంగాణను కరువుపాలు చేసిందే కాంగ్రెస్ అన్నారు. రేవంత్ రెడ్డి సహా ఆయన పక్కనున్న నేతలు అందరూ ఉద్యమ సమయంలో ఆంధ్రా నాయకుల ముందు కట్టుబానిసలే అని విమర్శించారు. తెలంగాణ హక్కుల కోసం పోరాడి, ప్రజల్లో చైతన్యం కలిగించింది కేసీఆర్, గులాబీ జెండా పార్టీ అన్నారు. టీడీపీలో ఉన్నప్పుడు రేవంత్‌రెడ్డి ఎప్పుడైనా తెలంగాణ జలాల కోసం మాట్లాడారా అని ప్రశ్నించారు. బీఆర్ఎస్ పోరాటం వల్లే జూరాల ఆయకట్టుకు, నాగర్జున సాగర్ ఎడమ కాలువకు నీరు అందాయన్నారు. అప్పుడు కాంగ్రెస్, టీడీపీ నేతలు మాట్లాడలేదన్నారు. నాడు పదవుల కోసం పెదవులు మూసుకున్న నేతలు అని విమర్శించారు.
Harish Rao | నీళ్లు ఎత్తడం చేతగాక..
సీఎం రేవంత్‌రెడ్డికి నీళ్లు ఎత్తడం చాతగాక, బీఆర్ఎస్ మీద దుమ్మెత్తి పోస్తున్నారని హరీశ్‌రావు విమర్శించారు. నిందలు వేసినంత మాత్రానా అబద్ధాలు నిజాలుగా మారవన్నారు. ఉద్యమ కాలంలో రేవంత్‌రెడ్డి ఎక్కడ ఉన్నారని ప్రశ్నించారు. రాష్ట్రం ఏర్పడిన కొన్ని రోజులకే ప్రభుత్వాన్ని కూల్చేందుకు ఆంధ్ర నాయకుల డబ్బు మూటలు మోసుకొచ్చి, నోట్ల కట్టలతో దొరికిన వ్యక్తి రేవంత్ అని విమర్శించారు. ఆయన ద్రోహాలు బయట పెడుతుండటంతో ఫ్రస్టేషన్‌తో మాట్లాడుతున్నారని ఆరోపించారు. పాలమూరు జిల్లాను కాంగ్రెస్, టీడీపీ పట్టించుకోలేదన్నారు. కేసీఆర్ సీఎం అయ్యాక పది లక్షల ఎకరాలకు సాగు నీరు అందించామని తెలిపారు. సీఎం అయ్యాక రేవంత్‌రెడ్డి తన సొంత జిల్లా అయిన పాలమూరులో అదనంగా ఒక్క లక్ష ఎకరాలకు సాగు నీరు ఇచ్చారా అని ప్రశ్నించారు.
Harish Rao | పాలమూరులో క్రాప్ హాలీడే..
రేవంత్‌రెడ్డి సీఎం అయ్యాక చంద్రబాబుకు ధైర్యం వచ్చిందని హరీశ్‌రావు అన్నారు. దీంతో తెలంగాణ జలాలను తరలించుకు పోతున్నారని ఆరోపించారు. గురుదక్షిణ కింద సీఎం రేవంత్‌రెడ్డి నీటిని విడిచి పెడుతున్నారని విమర్శించారు. 2024లో చంద్రబాబు జీవో ఇచ్చి మరీ 750 కిలోమీటర్ల దూరంలో ఉన్న కుప్పం నియోజకవర్గానికి నీళ్లు తీసుకుపోయాడన్నారు. కృష్ణా నది పక్కనే ఉన్న పాలమూరుకు మాత్రం రేవంత్‌రెడ్డి నీరు ఇవ్వలేదన్నారు. ఈ రోజు సీఎం పాలమూరు రైతులకు క్రాప్ హాలీడే ఇచ్చారని, పంటలు వేయొద్దని చెప్పారన్నారు. కేసీఆర్ హయాంలో నిర్మించిన ఎత్తిపోతల పథకాలను నడపడం కూడా రేవంత్‌రెడ్డికి చేతకావడం లేదన్నారు.
ఇది కూడా చదవండి..: Ponnam Prabhakar | చొరబాట్లు ఆపకుండా అమిత్ షా ఏం చేస్తున్నారు : మంత్రి పొన్నం