అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Mahabubnagar Road Accident | మహబూబ్‌నగర్ జిల్లా (Mahabubnagar District)లో ఆదివారం అర్ధరాత్రి జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం ఐదు కుటుంబాల్లో తీరని విషాదాన్ని నింపింది. జిల్లా కేంద్రానికి సమీపంలోని పాలకొండ చౌరస్తా వద్ద బైపాస్ రహదారిపై వేగంగా వెళ్తున్న స్పోర్ట్స్ బైక్, యూటర్న్ తీసుకుంటున్న కారును ఢీకొనడంతో ఈ దారుణ ఘటన చోటుచేసుకుంది.
స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బైపాస్ రోడ్డుపై ఒక కారు యూటర్న్ తీసుకునేందుకు ప్రయత్నిస్తుండగా, అదే సమయంలో అత్యంత వేగంతో వస్తున్న స్పోర్ట్స్ బైక్ (Sports Bike) అదుపుతప్పి కారును బలంగా ఢీకొట్టింది. ఢీకొన్న వేగం తీవ్రంగా ఉండటంతో కారు, బైక్ రెండూ పూర్తిగా ధ్వంసమయ్యాయి.
Mahabubnagar Road Accident | ఓవర్ స్పీడ్..
ఈ ప్రమాదంలో బైక్‌పై ప్రయాణిస్తున్న ఇద్దరు యువకులతో పాటు కారులో ఉన్న ఇద్దరు చిన్నారులు, మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉండటంతో ఇద్దరు చిన్నారులు సహా మొత్తం ఐదుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఒక్కసారిగా జరిగిన ఈ ఘోర ఘటనను చూసిన స్థానికులు షాక్‌కు గురయ్యారు. సమాచారం అందుకున్న వెంటనే మహబూబ్‌నగర్ పోలీసులు (Mahabubnagar Police) సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం మహబూబ్‌నగర్ ప్రభుత్వ జనరల్ ఆసుపత్రికి తరలించారు.
Mahabubnagar Road Accident | సరైన పోలీసు నిఘా లేకపోవడంతో
ఘటన కారణంగా బైపాస్ రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. పోలీసులు క్రేన్ సహాయంతో ప్రమాదానికి గురైన వాహనాలను తొలగించి ట్రాఫిక్‌ను పునరుద్ధరించారు. ఇక పాలకొండ చౌరస్తా వద్ద తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా రాత్రి సమయంలో యువకులు బైక్ రేసులు నిర్వహిస్తూ అతివేగంగా వాహనాలు నడుపుతున్నారని ఆరోపిస్తున్నారు. సరైన పోలీసు నిఘా లేకపోవడంతో ఇలాంటి ప్రమాదాలు పెరుగుతున్నాయని వారు అంటున్నారు. బైపాస్ రోడ్డుపై వేగ నియంత్రణ చర్యలు, హెచ్చరిక బోర్డులు, స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేయాలని స్థానికులు అధికారులను కోరుతున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఇది కూడా చదవండి..: Bandi Sanjay Allegations | ‘బాధితులను బండి సంజయ్ బెదిరించారు’.. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సంచలన ఆరోపణలు

