అక్షరటుడే, భీమ్‌గల్: Bheemgal Development | కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరితో భీమ్‌గల్‌లో అభివృద్ధి పనులు నిలిచిపోయాయని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి (Prashanth Reddy) అన్నారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో రూ.కోట్లు మంజూరు చేసి ప్రారంభించిన ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టులను ప్రస్తుత ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆరోపించారు.
Bheemgal Development | నెరవేరని హామీ
ఎన్నికల సమయంలో పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్‌కుమార్ గౌడ్ భీమ్‌గల్ ప్రజలకు ఇచ్చిన హామీలు అమలుకు నోచుకోలేదని వేముల ప్రశాంత్‌రెడ్డి అన్నారు. మూడు నెలల్లో 100 పడకల ఆస్పత్రి, ఇంటిగ్రేటెడ్ మార్కెట్, బస్సు డిపో పనులను పూర్తి చేస్తామని హామీ ఇచ్చినా.. ఇంకా పనులు ముందుకు సాగడం లేదని విమర్శించారు. భీమ్‌గల్ అభివృద్ధి, పెండింగ్ పనులపై తాను గతంలో ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చినా స్పందన లేకపోవడంతో నిరసనకు దిగాల్సి వచ్చిందని, తనను పోలీసులు అరెస్టు చేసి అడ్డుకున్నారని ఆయన గుర్తుచేశారు.
Bheemgal Development | నిధులు విడుదల చేయాలి
రూ.35 కోట్ల బడ్జెట్‌తో మంజూరైన 100 పడకల ఆస్పత్రి నిర్మాణంలో సుమారు రూ.15 కోట్ల విలువైన పనులు పూర్తయ్యాయని తెలిపారు. అయితే కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించకపోవడంతో పనులు ఆగిపోయాయన్నారు. రూ.3.5 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టిన ఇంటిగ్రేటెడ్ మార్కెట్ నిర్మాణం సగానికి పైగా పూర్తయినా, పెండింగ్ బిల్లులు చెల్లించకపోవడంతో నిలిచిపోయిందని పేర్కొన్నారు. ప్రస్తుతం మార్కెట్ ప్రాంగణం నిరుపయోగంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో రూ.2.25 కోట్లతో పునరుద్ధరించి ప్రారంభించిన భీమ్‌గల్ బస్సు డిపోను కాంగ్రెస్ ప్రభుత్వం మళ్లీ మూసివేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. రూ.12 కోట్లతో మంజూరైన సీసీ రోడ్లు, ఇతర అభివృద్ధి పనుల్లో భాగంగా గల్లీల్లో కంకర పోసి నెలలు గడుస్తున్నా రోడ్డు పనులు పూర్తి చేయడం లేదని విమర్శించారు. భీమ్‌గల్ అభివృద్ధి కోసం ప్రజల తరఫున తమ పోరాటం కొనసాగుతుందని వేముల ప్రశాంత్‌రెడ్డి స్పష్టం చేశారు. ప్రభుత్వం వెంటనే స్పందించి పెండింగ్ పనులకు నిధులు విడుదల చేసి అభివృద్ధి కార్యక్రమాలను పూర్తి చేయాలని డిమాండ్ చేశారు.
ఇది కూడా చదవండి..: Head Constable | హెడ్ కానిస్టేబుల్ తిరుపతి కుటుంబాన్ని ఆదుకుంటాం: సీపీ సాయిచైతన్య